ఏసీపీ చేతనకు మరో అరుదైన గౌరవం

ఏసీపీ చేతనకు మరో అరుదైన గౌరవం
x
Highlights

సుల్తాన్ బజార్ ఏసీపీ చేతనకు మరో అరుదైన గౌరవం దక్కింది. చిన్నారి చేతన కిడ్నాప్‌ కేసును విజయవంతంగా చేధించి ప్రశంసలు అందుకున్న ఆమెపై ఉన్నతాధికారులు సైతం...

సుల్తాన్ బజార్ ఏసీపీ చేతనకు మరో అరుదైన గౌరవం దక్కింది. చిన్నారి చేతన కిడ్నాప్‌ కేసును విజయవంతంగా చేధించి ప్రశంసలు అందుకున్న ఆమెపై ఉన్నతాధికారులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు. భవిష్యత్‌ తరాల పోలీసుల కోసం ఈ కేస్‌ స్టడీని పాఠ్యాంశంగా చేర్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో త్వరలోనే పోలీస్ శాఖలో చేతన తొలి కేస్‌ స్టడీ పాఠ్యాంశంగా మారనుంది.

తెలుగు రాష్ట్రాల ప్రజలతో ప్రశంసలు అందుకున్న చిన్నారి చేతన కిడ్నాప్‌ కేసును పోలీసు పాఠ్యాంశంగా చేర్చాలని నగర పోలీసు విభాగం ప్రతిపాదించింది. ఈ కేస్‌ స్టడీని తెలంగాణ పోలీసు అకాడమీతో పాటు నేషనల్‌ పోలీసు అకాడమీకి పంపాలని నిర్ణయించారు. చిన్నారి కిడ్నాప్ అయిన తరువాత గంటలోనే రంగంలోకి దిగిన పోలీసులు రికార్డు స్ధాయిలో 48 గంటల్లో కేసును చేధించారు. చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు, కీలక ఆధారాల కోసం అనుసరించిన విధానం, నిందితులను పట్టుకునేందుకు రూపొందించుకున్న వ్యూహాలతో సమగ్ర నివేదికను రూపొందించనున్నారు.

చిన్నారి కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన సుల్తాన్ బజార్ ఏసీపీ చేతన అన్ని విభాగాలను అప్రమత్తం చేశారు. ఈజీగా తప్పించుకునే మార్గాలను అన్వేషించి బస్టాండ్‌లోని సీసీ పుటేజీని పరిశీలించి గంటల వ్యవధిలోనే కిడ్నాపర్‌ ఆచూకి గుర్తించారు. రవాణా శాఖ అధికారుల సహకారంతో బస్సు నెంబర్‌ తెలుసుకుని ఫోన్ ద్వారానే డ్రైవర్‌, కండక్టర్‌లను విచారించిన చేతన చిన్నారి బీదర్‌లో ఉన్నట్టు పక్కా సమాచారం సేకరించింది. కిడ్నాపర్ మరో ప్రాంతానికి వెళ్లకుండా కర్నాటక పోలీసులను అప్రమత్తం చేసిన ఆమె సమన్వయంతో చిన్నారి ఆచూకి తెలుసుకుంది. ఇలా చిన్నారిని తల్లి చెంతకు చేర్చడంతలో ఏసీపీ చేతన విజయవంతమయ్యారు.

దూరమైన తన కుమార్తెను తిరిగి తెచ్చి ఇచ్చిన ఏసీపీ చేతన పేరును చిన్నారికి పెడుతున్నట్టు తల్లి ప్రకటించింది. ఈ అంశాన్ని పాఠ్యాంశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. బాధితుల విషయంలో సత్వరం స్పందిస్తే ప్రజల్లో ఏర్పడే అభిప్రాయానికీ నిదర్శనంగా ఈ పరిణామాన్ని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకున్న తీరును ఉన్నతాధికారులు సైతం ప్రశంసించారు. లభించిన ఆధారాలతో సమయజాప్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే కేసును అతి తక్కువ సమయంలో విజయవంతం చేధించగలిగారంటూ రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా విశ్లేషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories