
వరుస విజయాల నరేంద్ర మోదీ, సౌత్‌లో తొలిగడప తెలంగాణపై గురిపెట్టబోతున్నాడా గుజరాత్, హిమాచల్ జోష్‌తో ఇక తెలంగాణలో సైతం పాగా వేసేందుకు సిద్దమవుతున్నాడా...
వరుస విజయాల నరేంద్ర మోదీ, సౌత్‌లో తొలిగడప తెలంగాణపై గురిపెట్టబోతున్నాడా గుజరాత్, హిమాచల్ జోష్‌తో ఇక తెలంగాణలో సైతం పాగా వేసేందుకు సిద్దమవుతున్నాడా తెలంగాణ సాధనలో తమ పార్టిదీ కీలకమైన పాత్రంటున్న మోదీ, ఇక్కడా నార్త్ ఫార్ములా వర్కవుట్ చేద్దామనుకుంటున్నారా వర్కవుట్ అవుతుందా?
మొన్న హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవానికి వచ్చి, తెలుగులో ఎంచక్కా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. అందరికీ నమస్కారం అంటూ పార్టీలతో సంబంధం లేకుండా, తెలంగాణ అభివృద్ధికి పాటుపడతామంటూ, ఒకరకంగా తెలంగాణలో సమరనాదం మోగించారు. మోడీ ప్రసంగంలో గమనించాల్సిన కీలక విషయం సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్మరణ. ఒకవైపు కేసీఆర్ నిజాంను వేనోళ్ల పొగుడుతుంటే, మరోవైపు దానికి విరుద్దంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్‌పై ప్రశంసలు కురిపించారు మోడీ. పటేల్ సమైక్య స్ఫూర్తి, సాహసోపేత వైఖరితోనే దేశంలో తెలంగాణ సంస్థానం విలీనమైందని, విమోచనదినంపై కేసీఆర్‌తో ఒక రకంగా ఢీ అంటే ఢీ అన్నారు.
తెలంగాణలోనూ పాగా వేయాలని మోదీ-షా వ్యూహాలు
గుజరాత్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో మోడీనే అన్నీతానై వ్యవహరించారు. హిమాచల్‌లో విజయశిఖరాన్ని అధిరోహించడంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు చాలా రాష్ట్రాల్లోనూ అమిత్ షాతో కలిసి సింహనాదం చేశారు. ఇప్పుడు అదే జోష్‌తో, తెలంగాణలోనూ పాగా వేయాలని పక్కా వ్యూహాలు రచిస్తున్నారు మోడీ.
తెలంగాణలో యూపీ ఫార్ములా?
ఇప్పటికే మిషన్ తెలంగాణ ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణలో వరుసగా రెండుసార్లు పర్యటించారు. అచ్చం ఉరురప్రదేశ్ ఫార్ములానే ఇక్కడా అప్లై చేద్దామని స్కెచ్ వేస్తున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర పార్టీ, ఆఫీస్ బేరర్స్, జిల్లా, మండలస్థాయి, బూత్ కమిటీ నాయకులతో ఒకేసారి సమావేశం, బీసీలు, ఎస్సీలతో సమావేశాలు, సహపంక్తి భోజనాలు, మేధావులతో మాటామంతీ, రజాకార్లు,నక్సలైట్ల బాధిత గ్రామాల పర్యటనతో, కాషాయాన్ని గల్లీగల్లీకి తీసుకెళ్లే వ్యూహం వేశారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు అమిత్ షా. రాష్ట్ర సర్కారు చేసిందేమీ లేదని విమర్శించి, కేసీఆర్‌పైనే నేరుగా బాణం సంధించారు. తాము వస్తే తెలంగాణను అన్ని విధాలా అభివృద్ది చేస్తామన్నారు. ఇలా అన్ని కార్యక్రమాలను గమనిస్తే, ఎస్సీ, బీసీ సామాజిక సమీకరణలు, ముస్లిం రిజర్వేషన్లు, రజాకార్లపై విమర్శలతో హిందూత్వవాదం, రాజకీయ ఎత్తుగడలు, పార్టీ బలోపేతంపై కొత్త తరహా వ్యూహాలు అమిత్ షా పర్యటనలో కనిపిస్తాయి. మహాభారత సమరంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు, మోదీ మ్యానియా ప్రభంజనానికి తెలంగాణలో వ్యూహాలు రచించారు షా. అంటే రేపోమాపో, సౌత్‌లో నార్త్‌పోల్ పాతేందుకు సిద్దమవుతున్న మోడీ, అందుకు తెలంగాణతో శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. నిన్న యూపీ, నేడు గుజరాత్, హిమాచల్ విజయశంఖారావంతో, రేపు తెలంగాణపై ఫోకస్ పెట్టాలని మోదీ-షాలు స్కెచ్ వేస్తున్నారని తెలుస్తోంది. మరి తెలంగాణలో గుజరాత్, హిమాచల్ విక్టరీ రిపీట్ అవుతుందా?

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire