చిట్టిత‌ల్లిని కంటికి రెప్పలా కాపాడుతున్న డాక్ట‌ర్లు

x
Highlights

తల్లి గర్భం నుంచి 9 నెలల తర్వాత భూమి మీదకు రావాల్సిన పాప 2 నెలల ముందే వచ్చేసింది. తోడుగా తనతో వచ్చిన చెల్లి పుట్టిన నిమిషాల్లోనే చనిపోయింది 3 రోజుల...

తల్లి గర్భం నుంచి 9 నెలల తర్వాత భూమి మీదకు రావాల్సిన పాప 2 నెలల ముందే వచ్చేసింది. తోడుగా తనతో వచ్చిన చెల్లి పుట్టిన నిమిషాల్లోనే చనిపోయింది 3 రోజుల తర్వాత కన్నతల్లి మరణించింది. చివరికి తండ్రి కూడా పాపను సాకడం తనతో కాదని వదిలేసి వెళ్లిపోయాడు. కానీ ఆ తల్లికి పురుడు పోసిన డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బందే పాపను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నవీనగా మార్చి ఏడాది తర్వాత నవయుగంలోకి నడిపించారు.

నవీన చూస్తున్నారుగా ఎంత ముద్దుగా ఉందో. మీరు చూస్తున్న ఈ పాప పుట్టినప్పుడు ఇంత బాగా పెరుగుతుందని ఎవరూ అనుకోలేదు. ఈరోజు ఈ చిన్నారి ఇలా ఉందంటే దానికి కారణం నల్గొండ ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే.

ఏడాది క్రితం చిట్యాలకు చెందిన అనురాధ అనే గర్భిణి ప్రసవం కోసం నల్గొండ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. 9 నెలల తర్వాత బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లి 7 నెలలకే పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. నెలలు తక్కువగా పుట్టడంతో కవల పిల్లలిద్దరూ అనారోగ్యంతో తక్కువ బరువుతో జన్మించారు. కవలలు పుట్టారని సంతోషించే లోపే ఒక పాప చనిపోయింది. మరో పాప కేవలం 930 గ్రాముల బరువుతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ జన్మించింది. 3 రోజుల తర్వాత తల్లి కూడా తీవ్ర రక్తస్రావంతో మరణించింది. కూతురితో పాటు భార్యను కోల్పోయానన్న బాధలో అనారోగ్యంతో ఉన్న పాపను పోషించలేనని ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లాడు. పాప ఆలనా పాలనా చూసుకునేందుకు బంధువులు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బందే అన్నీ తామై పెంచారు. నవీన అని పేరు పెట్టి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మార్చి ఈ నవయుగంలోకి నడిపించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కంగారు మదర్ కేర్ పద్ధతిలో పాపను బతికించారు. పాపను ప్రతిరోజు తల్లి ఎదపై పడుకోబెట్టి వెచ్చదనాన్ని అందించడమే కంగారు మదర్ కేర్ అంటారు. ఇందుకు ఓ మాతృమూర్తి పెద్ద మనసుతో ముందుకొచ్చింది. అలా 3 నెలల పాటు తల్లిగా మారి పాపకు పునర్జన్మనిచ్చిందని చెప్తున్నారు డాక్టర్లు.

అనారోగ్యంతో పుట్టిన పాప ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఫిబ్రవరి 2వ తేదీతో తొలి పుట్టినరోజు జరుపుకుంది. ఏడాదిపాటు కంటికి రెప్పలా కాపాడిన నల్గొండ ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది పాపకు నవీన అని పేరు పెట్టి అన్నప్రాసన, డోలారోహణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి ఆనంద బాష్పాల మధ్య శిశుగృహకు అందించారు.

తండ్రి వద్దనుకున్నా బంధువులు కాదనుకున్నా నల్గొండ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది మాత్రం అలా అనుకోలేదు. పాపను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తుంచుకొని ఆ పాపకు పునర్జన్మనిచ్చారు. నవీనను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మార్చిన నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిపై స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories