ఒక హత్య...ఐదు ప్రాణాలు

x
Highlights

కిడ్నాపయ్యిందని, తిరిగి వస్తుందని తండ్రి ఆశ. క్షణాలు యుగాలుగా గడుస్తున్నా ఏదో నిరీక్షణ. ఎంతక్రూరులైనా చిన్నారి ప్రాణానికి హానితలపెట్టరన్న ఆలోచన. కానీ...

కిడ్నాపయ్యిందని, తిరిగి వస్తుందని తండ్రి ఆశ. క్షణాలు యుగాలుగా గడుస్తున్నా ఏదో నిరీక్షణ. ఎంతక్రూరులైనా చిన్నారి ప్రాణానికి హానితలపెట్టరన్న ఆలోచన. కానీ గుండెపగిలే వార్త బయటికొచ్చింది. ఆ తండ్రి హృదయం ముక్కలైంది. అటు న్యాయం కోసం పోరాడుతూ, పోరాడుతూ తల్లి, బాబాయి అలిసిపోయారు. ఒక హత్య, ఐదు ప్రాణాలు. నాగవైష్ణవి తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూసిన తండ్రి ప్రభాకర్‌, ఇక రాదనే చేదు నిజం తెలిసి తట్టుకోలేకపోయారు. ముట్టుకుంటే కందిపోయే తన చిట్టితల్లి శరీరాన్ని కొలిమిలో వేసి బూడిద చేశారన్న మాటను విన్న వెంటనే కుప్పకూలిపోయాడు. గారాల బిడ్డ కోసం కొట్టుకుంటున్న గుండె, ఇక రాదని తెలిసి ఆగిపోయింది.

నాగవైష్ణవి మృతితో విషాదంలో మునిగిపోయిన కుటుంబానికి, తండ్రి ప్రభాకర్‌ రావు మృతి, విషాదం మీద విషాదం. తండ్రీకూతుళ్ల మరణం, తెలుగు ప్రజలనే కాదు, యావత్‌ దేశ ప్రజలను కన్నీళ్లు పెట్టించింది. కన్నబిడ్డను, కట్టుకున్న భర్తను కళ్ళ ముందే కోల్పోయిన నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు. ప్రభాకర్‌ సోదరుడు సుధాకర్‌తో కలిసి న్యాయం కోసం పోరాడుతూ వచ్చారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోర్టుల చుట్టూ తిరిగారు. మానసికంగా కుంగిపోవడం, మరోవైపు బ్రెయిన్ క్యాన్సర్ రావడంతో 2017లో, నర్మదా దేవి చనిపోయారు.

ఈ కేసులో న్యాయంకోసం పోరాడిన మరో వ్యక్తి సుధాకర్. ప్రభాకర్‌కు సోదరుడు, నాగవైష్ణవికి బాబాయి. ఈయన కూడా అనారోగ్యంతో చనిపోయారు. ఇలా ఒక్క కుటుంబంలో పెను విషాదాలు. డ్రైవర్‌ హత్య, నాగవైష్ణవి మర్డర్, తర్వాత తల్లిదండ్రులు ప్రభాకర్, నర్మదాదేవి, ఆ తర్వాత బాబాయి సుధాకర్‌ మరణం. కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే విషాదమిది.

పతనమవుతున్న కుటంబ విలువలకు నాగవైష్ణవి హత్య పరాకాష్ట. ధనం, అసూయద్వేషాలతో లుప్తమవుతున్న మానవత్వానికి నిదర్శనం. ప్రతిరోజు ఎందరో నాగవైష్ణవులు సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే చనిపోతున్నారు. మరి ఇంతటి దారుణానికి పాల్పడిన హంతకులకు, కేవలం జీవితఖైదుతోనే సరిపెట్టడం ఏంటన్న మహిళా సంఘాల ప్రశ్నకు బదులేది? ఉరిశిక్ష విధించి ఉంటే, ఇంకెందరికో కనువిప్పు కలిగేదంటున్నవారి డిమాండ్‌ సహేతుకుమైనదేనా?

చెదరని చిరునవ్వు, ముట్టుకుంటే కందిపోయే కోమలత్వం, తన చుట్టూ అందరూ మంచోళ్లే ఉన్నారన్న అమాయకత్వం, మన ఇంటిపిల్లే అన్నట్టుగా చిలిపితనం. నాగవైష్ణవిని చూస్తే, అందరికీ ఇలానే అనిపిస్తుంది. కానీ ప్రేమల వెనక పగలు, ఆప్యాయతా మాటల మాటున మట్టుబెట్టే వ్యూహాలు ఉంటాయని, పాపం చిన్నపిల్లకేం తెలుసు. కనీసం తల్లిదండ్రులూ గ్రహించలేకపోయారు. మండే కొలిమిలో చిన్నారిని బూడిద చేసి, బంధాలు, అనుబంధాలనూ మంటగలిపారు క్రూరులు.

డబ్బు, అసూయద్వేషాలకు, తెలుగు రాష్ట్రాల్లో ఎందరో నాగవైష్ణవులు రాలిపోయారు. ఆస్తులకు అడ్డం వస్తున్నారని, సోదరులను, వారి పిల్లలను చంపిన ఘటనలు చాలా చూస్తున్నాం. అక్రమ సంబంధాలకు ఆటంకం కలిగిస్తోందని సొంత బిడ్డలను హత్య చేసిన వార్తలైతే ఎన్నో. ఇతర పిల్లలతో తక్కువ చేసి చూస్తున్నారని కొందరు, తమకంటే అన్నివిధాలా బాగుపడుతున్నారని మరికొందరు, అసూయలతో సొంత బంధువులను చంపేస్తున్నారు. డబ్బు, ఆస్తులు, అసూయల ముందు రక్తసంబంధం, బంధుత్వం, చివరికి మానవత్వం కూడా కనపడదనానికి, నాగవైష్ణవి హత్యే నిదర్శనం. పతనమవుతున్న కుటుంబ విలువలకు పరాకాష్టలివి.

నాగవైష్ణవి హత్య కేసులో ఎనిమిదేళ్లన్నరపాటు విచారణ జరిగింది. దారుణంగా చంపేసి నిందితులకు క్యాపిటల్ పనిమిష్‌మెంట్‌ పడుతుందని అందరూ భావించారు. కానీ జీవితఖైదు విధించడంపై మహిళా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో ఉరిశిక్ష పడి ఉంటేనే, సమాజానికి హెచ్చరిక పంపినట్టు ఉండేదంటున్నారు. చిన్నారులను అత్యంతక్రూరంగా చంపినవాళ్లకు, జీవితఖైదు చాలా చిన్న శిక్ష అంటున్నారు. అయితే కటుంబ సభ్యులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి శిక్షల సంగతి అటుంచితే, నాగవైష్ణవి హత్య, మరో నాలుగు ప్రాణాలు. అందర్నీ కలచివేశాయి. ఆలస్యంగానైనా, విజయవాడకోర్టు మంచి తీర్పే ఇచ్చిందని కొందరంటే, ఉరిశిక్ష సరైందని మరికొందరంటున్నారు. ఏది ఏమైనా ప్రేమ, ఆప్యాయత ఉండాల్సిన బంధుత్వంలో, అసూయద్వేషాలు, ఆస్తుల కోసం అమానుషత్వానికి తెగించడం, సమాజంలో మరో చీకటి కోణం. మన మూలాలను, కుటుంబ విలువలను, చిన్నారుల పట్ల ప్రేమాప్యాయతలను మరోసారి తడిమిచూసుకోవాలని, నాగవైష్ణవి ఉదంతం సమాజాన్ని హెచ్చరిస్తూనే ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories