ప్రణయ్ విగ్రహం ఏర్పాటుపై మరో వివాదం..

x
Highlights

మిర్యాలగూడలో ఇటీవల పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహం ఏర్పాటు నిర్ణయం.. ఇప్పుడు మరో కొత్త వివాదానికి దారి తీసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు...

మిర్యాలగూడలో ఇటీవల పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహం ఏర్పాటు నిర్ణయం.. ఇప్పుడు మరో కొత్త వివాదానికి దారి తీసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ కొందరు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంపై ప్రణయ్ కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఏ వర్గానికి వ్యతిరేకంగా ప్రణయ్ విగ్రహఏర్పాటు చేయడం లేదని, పరువు హత్యలు పునరావృతం కాకుండా ఉండేందుకే విగ్రహ నిర్మాణం చేపడుతున్నామని అంటున్నారు. ప్రణయ్ విగ్రహం వ్యవహరంలో రెండు వర్గాలు రోడ్డుఎక్కడంతో మళ్లీ మిర్యాలగూడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ప్రణయ్ విగ్రహం ఏర్పాటుపై పట్టణంలోని పలు వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక మిర్యాలగూడలో భేటీ అయ్యింది. ప్రభుత్వ భూముల్లో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు సరికాదన్న తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు నల్గొండ వెళ్లి, కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రణయ్ హత్య దారుణమే అయినా, ఇలా విగ్రహాలను ఏర్పాటు సరికాదన్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న విగ్రహాన్ని నిలిపివేయాలని తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక కోరింది.

మరోవైపు, తన కొడుకు విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ప్రణయ్ తండ్రి బలస్వామి ఆరోపించాడు. ఈ విగ్రహం ఏర్పాటు ప్రత్యేకంగా ఒక్క వర్గానికి వ్యతిరేకంగా చెయ్యటం లేదని తెలిపారు. పరువు హత్యకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఒక హెచ్చరికగా ఉండాలనే విగ్రహం ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు.

మిర్యాలగూడలోని సాగర్ రోడ్డులో శకుంతల థియేటర్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ప్రణయ్ విగ్రహాన్ని కుటుంబసభ్యులు నిర్మిస్తున్నారు. అయితే, ఈ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు అసలు ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రణయ్ హత్యను ఖండిస్తూనే మరోవైపు, విగ్రహా నిర్మాణం మాత్రం వద్దంటున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు మాత్రం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories