కాంగ్రెస్ విష సంస్కృతికే బొడ్డుపల్లి బలయ్యాడు: జగదీష్‌రెడ్డి

కాంగ్రెస్ విష సంస్కృతికే బొడ్డుపల్లి బలయ్యాడు: జగదీష్‌రెడ్డి
x
Highlights

కాంగ్రెస్ అంతర్గత గొడవలతోనే నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి...

కాంగ్రెస్ అంతర్గత గొడవలతోనే నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చరిత్ర హత్యలు, దాడుల రాజకీయాలమయమని విమర్శించారు. వారిలో వారే గ్రూపులు కడుతూ ఆధిపత్య రాజకీయాలతో ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీనివాస్ హత్య విషయంలో కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని ఖండించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ ఎజెండా లేకనే శవ రాజకీయాలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెర లేపారని, కాంగ్రెస్ విష సంస్కృతికే బొడ్డుపల్లి శ్రీనివాస్ బలయ్యాడని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ రాజకీయాలకు నకిరేకల్ ఎమ్మెల్యేకు వేముల వీరేశానికి సంబంధం లేదని, బట్టలు ఊడదీసుకుని కొట్టుకునే సంస్కృతి, చంపుకునే సంస్కృతి కాంగ్రెస్ నేతలదేనని ఆయన అన్నారు. ఎన్నో గ్రామాలు కాంగ్రెస్ నేతల దాష్టికానికి వల్లకాడుగా మారాయని మంత్రి ఆరోపించారు.

శవాలతో మోరీలను నింపేస్తామన్న నీచపు మాటలపై సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. శ్రీనివాస్ హత్య అనంతరం మేము వస్తున్నామని తెలిసి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డ్రామాకు తెరలేపాడని, మృతదేహం అక్కడ ఉండగానే వెంకట్‌రెడ్డి శవ రాజకీయానికి శ్రీకారం చుట్టారన్నారు. శ్రీనివాస్ గతంలోనే టీఆరెస్‌లోకి వచ్చి సస్పెండయ్యాడని, మళ్ళీ పార్టీలోకి రావాలని మెమెందుకు బెదిరిస్తామని జగదీష్‌రెడ్డి అన్నారు.

వీరేశం ఎదుగుదలను ఓర్చుకోలేకనే కోమటిరెడ్డి బ్రదర్స్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, హత్య కేసులో వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకే పోలీసులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీబీఐ విచారణ కోరడం అంటే తెలంగాణ పోలీసులను అవమానపర్చడమేనని ఆయన అన్నారు. కాల్ డేటా కూడా వెంకట్‌రెడ్డి డ్రామాలో భాగమే అని, కాంగ్రెస్ నేతలు ఉద్దేశ పూర్వకంగా శ్రీనివాస్ హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అంతర్గత పోరు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హత్య కేసు డ్రామా అని మంత్రి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories