మైనర్లకు బైక్‌ ఇస్తే... పేరెంట్స్‌ జైలుకే!!

మైనర్లకు బైక్‌ ఇస్తే... పేరెంట్స్‌ జైలుకే!!
x
Highlights

మీ పిల్లలకి బండి ఇచ్చి బయటికి పంపిస్తున్నారా.. అయితే జాగ్రత్త. మీరు జైలుకి వెళ్ళక తప్పదు. మైనర్లు డ్రైవింగ్ చేసినా, మద్యం సేవించి వాహనం నడిపినా వాళ్ల...

మీ పిల్లలకి బండి ఇచ్చి బయటికి పంపిస్తున్నారా.. అయితే జాగ్రత్త. మీరు జైలుకి వెళ్ళక తప్పదు. మైనర్లు డ్రైవింగ్ చేసినా, మద్యం సేవించి వాహనం నడిపినా వాళ్ల తల్లిదండ్రులను జైల్లో పెడతారట. వారిపై చార్జ్ షీట్లు కూడా వేస్తారట. అవును.. మీరు విన్నది నిజమే. ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లో అమలవుతున్న రూల్స్ ఇవి. గత వారం నగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. వీటిలో వంద మందికి పైగా మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడ్డారు. శుక్ర, శనివారాల్లో మందేసి రోడ్లపై వాహనాలు నడుపుతూ అడ్డంగా బుక్కయ్యారు.

తగిన వయసు రాకుండా బైకులు, కార్లు తోలేయడమే నేరమైతే.. దానికి తోడు ఫుల్లుగా మందేసి వాహనాలు నడపడం ఇంకెంత పెద్ద నేరమో వేరే చెప్పక్కరలేదు. సిటీలో మైనర్లు పూటుగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటి వరకూ పిల్లల తల్లిదండ్రులను పిలిపించి మందలించి పంపేవారు. అయినా ఒకసారి.. రెండుసార్లు కాదు. పదేపదే పట్టుబడినా మైనర్లు వాహనాలు నడుపుతున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు మైనర్ల డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే వారి తల్లిదండ్రులపై కేసు పెట్టి జైలుకి పంపుతున్నారు.

వారం వ్యవధిలోనే 60 మందికి పైగా తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి కోర్టు ముందుంచారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్ట్.. మైనర్ డ్రైవర్ల పేరెంట్స్‌కి ఒక్క రోజు నుండి ఐదు రోజులు వరకు జైలు శిక్ష విధించింది. అప్జల్ గంజ్‌లో ఓ మైనర్ మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్ర వాహనం నడుపుతూ ఓ చిన్నారిని ఢీ కొట్టాడు. ఆ పాప తీవ్రంగా గాయపడింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మైనర్‌తో పాటు అతని తండ్రిపై కూడా కేసు నమోదు చేసి కోర్ట్ ముందు హాజరు పరిచారు. గతంలో కూడా ఈ మైనర్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు తేలడంతో కోర్టు ఆ తండ్రికి మూడు రోజుల జైలు శిక్ష విధించింది. తన కొడుకు మొదటిసారి తప్పు చేసినప్పుడు కట్టడి చేస్తే తనకి జైలుకెళ్లే పరిస్థితే వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆ తండ్రి.

మోటారు వాహనాల చట్టంలో 16 ఏళ్ల లోపు పిల్లలు ఎలాంటి వాహనాలనూ నడపరాదనే నిబంధన ఉంది. 16 ఏళ్లు నిండిన వారు గేర్లు లేని వాహనాలు నడపడానికి. 18 ఏళ్లు నిండిన తర్వాత గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. చట్టం ప్రకారం మైనర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తి వాహనం నడిపితే వారికి వాహనం ఇచ్చినందుకు తల్లిదండ్రులు కూడా శిక్షార్హులేనని పేర్కొంది. దీంతో పోలీసులు మైనర్ డ్రైవర్ల తల్లిదండ్రులపై కేసులు పెట్టి జైలుకి పంపుతున్నారు . హైదరాబాద్ సిటీలో కొత్త టెక్నాలజీ వాడుకుంటూ.. స్పెషల్ డ్రైవ్ పేరుతో మైనర్ డ్రైవింగ్‌ను నిలువరిస్తున్నామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories