అరుణ ఆపరేషన్....దాడికి 10 రోజుల క్రితమే...

అరుణ ఆపరేషన్....దాడికి 10 రోజుల క్రితమే...
x
Highlights

విశాఖ మన్యంలో ప్రజాప్రతినిధుల హత్యకు పాల్పడిన మావోయిస్టులను పోలీసులు ఒక్కొక్కరిగా గుర్తిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన తర్వాత ప్రాథమికంగా...

విశాఖ మన్యంలో ప్రజాప్రతినిధుల హత్యకు పాల్పడిన మావోయిస్టులను పోలీసులు ఒక్కొక్కరిగా గుర్తిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన తర్వాత ప్రాథమికంగా కొందరిని గుర్తించారు. స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో ముగ్గురి పేర్లను పోలీసులు వెల్లడించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమపై దాడిలో పాల్గొన్న మావోయిస్టుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. దాడికి నేతృత్వం వహించిన అరుణతో పాటు మరో ఇద్దరు మావోయిస్టుల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య, కామేశ్వరి అలియాస్ స్వరూప, జులుమూరి శ్రీనుబాబు అలియాస్ రైనో దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరి కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.

ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరుకు దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ మెంబర్ గా ఉన్న అరుణ దాడికి పది రోజుల క్రితమే అరుకు ఏరియాకు వచ్చినట్టు పోలీసులు సమాచారం సేకరించారు. మహిళా దళానికి నేతృత్వం వహిస్తున్న అరుణ.. పక్కా వ్యూహంతో దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న అక్కిరాజు హరగోపాల్.. అలియాస్ ఆర్కే ఆదేశాలతోనే ఎమ్మెల్యే సర్వేశ్వర్రావ్, మాజీ ఎమ్మెల్యే సోమను అరుణ దళం కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అరుణ ఎస్‌జెడ్‌సీఎం దళానికి చెందిన సభ్యురాలు. ఆమె స్వస్థలం విశాఖ జిల్లా కరకపాలెంగా గుర్తించారు. అరుణతో పాటు ఈ దాడిలో పాల్గొన్నట్టు భావిస్తున్న స్వరూప స్వస్థలం భీమవరం. అలాగే మూడో వ్యక్తి శ్రీనుబాబును దబ్బపాలెం మండలం అడ్డతీగల వాసిగా గుర్తించారు.

ఈ జంట హత్యలు ఆర్కే సారధ్యంలో జరిగాయని మొదట ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరుగుతున్న తరుణంలోనే చలపతి తెరపైకి వచ్చాడు. రామకృష్ణ కాదు అసలు సూత్రదారి చలపతే అంటూ ప్రచారం జరిగింది. మరోవైపు చలపతి భార్య అరుణ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ జరిగిందని.. ఈ హత్యలో ఆమెనే పాల్గొందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే కిడారి, సివేరు సోమపై జరిగిన దాడిలో సుమారు 60 మంది మావోయిస్టులు పాల్గొన్నారని సమాచారం. వీరిలో సగం మంది మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ముందురోజు రాత్రే లివిటిపుట్టు సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకల్లా గ్రామంలోకి వెళ్లి.. గ్రామాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని పోలీసులు చెబుతున్నారు. విశాఖ మన్యంలో జరిగిన జంట హత్యలను భారీ సవాల్ గా భావిస్తున్న పోలీసులు.. ఇప్పటికే చాలా వరకు కేసును చేధిస్తున్నారు. ముఖ్యమైన ముగ్గురు మావోయిస్టుల పోటోలను విడుదల చేసిన పోలీసులు.. ఇంకా ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories