కూటమి లెక్కల్లో గందరగోళం...టీడీపీ, టీజేఎస్‌ సీట్లు ఓకే.. సందిగ్ధంలో సీపీఐ?

x
Highlights

మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తు లెక్కలు ఇంకా తేలలేదు. టీడీపీ, టీజేఎస్‌ స్థానాలపై లెక్కలు కొలిక్కివచ్చినా, సీపీఐకి కేటాయించే స్థానాలపై...

మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తు లెక్కలు ఇంకా తేలలేదు. టీడీపీ, టీజేఎస్‌ స్థానాలపై లెక్కలు కొలిక్కివచ్చినా, సీపీఐకి కేటాయించే స్థానాలపై మాత్రం పీటముడి కొనసాగుతోంది. కొత్తగూడెం, మునుగోడు స్థానాలపై సీపీఐ పట్టుబడుతోంది. ఐదు సీట్లు ఇస్తే ఓకే.. లేకుంటే కూటమికి కటీఫ్ చెబుతామంటోంది సీపీఐ. అయితే, కూటమి లెక్కలపై ఇవాళ కీలక ప్రకటన వెలువడనుండటంతో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.

మహాకూటమి లెక్కలు ఇంకా తేలలేదు. నామినేషన్లకు గడువు ముంచుకొస్తున్నా కూటమి పక్షాల్లోని పార్టీలకు ఎన్ని స్థానాలు, ఏయే స్థానాలు కేటాయించారన్న అంశమై స్పష్టత కొరవడింది. దీనిపై కూటమిలోని టీజేఎస్, సీపీఐలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణతో భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు, కామన్‌ మినిమం ప్రోగ్రాంపై చర్చించారు.

ఈ భేటీలో టీజేఎస్‌కు జనగామ, మెదక్, దుబ్బాక, మల్కాజ్‌గిరి, సిద్దిపేట, రామగుండం, వర్ధన్నపేటలతో పాటు వరంగల్‌ ఈస్ట్‌ లేదా మిర్యాలగూడలో ఒక స్థానం కేటాయించేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్లుగా తెలిసింది. ఇందులో జనగామ నుంచి టీజేఎస్‌ అధినేత కోదండరాం పోటీ చేసే అవకాశం ఉంది. ఇక మిర్యాలగూడలో సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు పోటీ చేసే అవకాశం ఉంది. జానా కుమారుడి పోటీపై ఏఐసీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే మాత్రం ఆ స్థానం కాకుండా వరంగల్‌ ఈస్ట్‌ స్థానాన్ని టీజేఎస్‌కు ఇవ్వనున్నారు. ఇక ఆసిఫాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్‌లలో మాత్రం స్నేహపూర్వక పోటీ చేయాలని ఇరు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి.

మరోవైపు చాడ వెంకట్‌రెడ్డితో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ దూతలు చర్చలు జరిపారు. సీపీఐకి ముందునుంచీ చెబుతున్నట్లుగా బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్‌ స్థానాలు కేటాయించేందుకు ఓకే చెప్పగా, కొత్తగూడెం, మనుగోడుపై చర్చలు జరిగాయి. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీలో ఉన్నందున ఈ స్థానాన్ని పక్కనపెట్టి కొత్తగూడెంపై ఎక్కువ సమయం చర్చించారు. కొత్తగూడెం కాంగ్రెస్‌కే వదిలెయ్యాలని, అధికారంలోకి వచ్చాక సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తామని కాంగ్రెస్‌ నేతలు బుజ్జగించే యత్నం చేశారు. అయితే ఈ అంశంపై ఉత్తమ్‌ దగ్గరే తేల్చుకుంటామని చాడ స్పష్టం చేశారు.

తాము ఐదు సీట్లు అడుగుతుంటే మూడు సీట్లే ఇస్తామని చెప్పడంపై చాడ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతీసారి తమనే సర్దుకోవాలని సూచిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు వాళ్లెందుకు సర్దుకోవడం లేదని ప్రశ్నించారు. సీట్ల విషయంలో సీపీఐకి ఉన్న ఇమేజ్‌ని కాంగ్రెస్‌ పార్టీ గుర్తించాలన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోనే నేరుగా తేల్చుకుంటామని, ఐదు సీట్లు ఇవ్వకుంటే సాయంత్రానికల్లా అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

అయితే, ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కూటమి పక్షాలకు ఎన్ని సీట్లు, ఏయే సీట్లు కేటాయించామన్న విషయాన్ని ప్రకటిస్తామని నేతలు చెబుతున్నారు. మరి టీడీపీ, టీజేఎస్ ఓకే.. సీపీఐ పరిస్థితేంటి..? కూటమిలో ఉంటుందా లేక కటీఫ్ చెబుతుందా..అన్నది తేలాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories