మద్దిలచెరువు సూరి హత్యకేసులో సంచలన తీర్పు

మద్దిలచెరువు సూరి హత్యకేసులో సంచలన తీర్పు
x
Highlights

మద్దెలచెరువు సూరి హత్యకేసులో భానుకిరణ్‌‌ను నాంపల్లి కోర్టు దోషిగా తేల్చింది. భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్షతోపాటు 20వేల జరిమానా విధించారు. అలాగే,...

మద్దెలచెరువు సూరి హత్యకేసులో భానుకిరణ్‌‌ను నాంపల్లి కోర్టు దోషిగా తేల్చింది. భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్షతోపాటు 20వేల జరిమానా విధించారు. అలాగే, మన్మోహన్‌సింగ్‌కు ఐదేళ్ల జైలుతోపాటు 5వేల రూపాయల జరిమానా విధించిన న్యాయస్థానం మరో నలుగురిపై నేరం రుజువుకాకపోవడంతో కేసు కొట్టేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన సూరి 2011, జనవరి 3న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌లో సూరితో పాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్ యూసుఫ్‌గూడ ప్రాంతంలో నాటు తుపాకీతో కాల్చి ఆయన్ని చంపి పరారయ్యాడు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ 2012, ఏప్రిల్ 21న జహీరాబాద్ వద్ద భానుకిరణ్‌ను అరెస్ట్ చేశారు.

సూరిని హత్య చేసిన తర్వాత మధ్యప్రదేశ్ పారిపోయిన భానుకిరణ్ సియోని ప్రాంతంలో తలదాచుకున్నాడు. అతడిపై నిఘా పెట్టిన బంజారాహిల్స్‌ పోలీసులు జహీరాబాద్ వద్ద అదుపులోకి తీసుకుని తుపాకీ, మూడు సెల్‌ఫోన్లు, బ్యాంకు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భానుకిరణ్‌పై నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం నిందితుడు ప్రయత్నించినా దొరకలేదు. ముందుగా కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు తర్వాత కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత సీసీఎస్ నుంచి ఈ కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. ఈ కేసులో మొత్తం 117 మంది సాక్ష్యాలను సేకరించిన పోలీసులు..92 మంది వాంగ్మూలం తీసుకున్నారు. భానుకిరణ్‌తోపాటు మన్మోహన్‌సింగ్, సిబ్బయ్య, వంశీ, హరిబాబు, వెంకటరమణలపై 302, 202, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసులు మొత్తం మూడు ఛార్జిషీట్లను ఇప్పటిదాకా దాఖలు చేశారు. న్యాయ విచారణ పూర్తి కావడంతో న్యాయస్థానం ఇవాళ తుదితీర్పు చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories