Top
logo

ప్రేమించి పెళ్లి చేసుకోవడం వెంటాడి చంపాల్సినంత నేరమా?

X
Highlights

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలకు.. కన్నవాళ్లే పగవాళ్లవుతున్నారు. బయటి సమాజం కన్నా ఎక్కువగా కక్ష గడుతున్నారు....

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలకు.. కన్నవాళ్లే పగవాళ్లవుతున్నారు. బయటి సమాజం కన్నా ఎక్కువగా కక్ష గడుతున్నారు. పనికిమాలిన పరువు కోసం కన్నబిడ్డల ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడటం లేదు. మరికొన్ని చోట్ల.. సొంత కులంలోనే ఇష్టపడ్డ వ్యక్తిని చేసుకున్న పెళ్లిళ్లకూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కన్న కూతురికే గుండు గీయించి అమానుషం చాటుకున్న తల్లిదండ్రులు.. ఎక్కడో దూరంగా బతుకుతున్న జంటను, నమ్మించి రప్పించి మరీ కడతేర్చేందుకు స్కెచ్ వేసిన ఉదంతాలు కూడా ఇటీవలే బయటపడ్డాయి. ఈ పెడపోకడలు సామాజికవేత్తల్ని సైతం ఆందోళనకు గురి చేస్తోంది.

ప్రేమను పంచే తల్లిదండ్రులు బిడ్డల ప్రాణాలు తీస్తారా? తమ వంశాంకురాలను తామే చిదిమేసుకుంటారా? దీనికి ఎవరైనా కాదనే జవాబు చెప్తారు. కానీ.. అమ్మానాన్నలంతా విస్తుపోయే ఉదంతాలు కూడా అక్కడక్కడా బయటపడుతున్నాయి. ఇదిగో.. కరీంనగర్ జిల్లా గంగాధరమండలం ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన నేరెళ్ల నవీన్... అక్కడే గోపాల్ రావుపల్లి కి చెందిన జ్యోతి.. మండల కేంద్రంలోని ఓ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి కులాలు వేరైనా.. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ విషయంలో అబ్బాయి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పకపోయినా... అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం సమేమిరా అన్నారు. తమ పెళ్లికి పెద్దలు ఎలాగూ ఒప్పుకోరని, దొరికితే చంపేస్తారని నిర్ధారించుకున్న ఈ జంట.. ఊరికి దూరంగా ఉండాలనుకుంది. దూరతీరాలకు పారిపోతూ ఓ దేవాలయంలో... పెళ్లి తతంగం పూర్తి చేసుకుని, స్నేహితుల సాయంతో ముంబై వెళ్లిపోయారు. అనేక ఎత్తుగడలు వేసి అమ్మాయి తల్లిదండ్రులు కొత్త జంటను రప్పించగలిగారు. వచ్చిన తరువాత నవీన్ ను దారుణంగా కొట్టి జ్యోతిని అజ్ఞాత ప్రాంతానికి తరలించారు. నవీన్ ఇప్పుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సొంత కులానికి చెందిన యువకుడినే ప్రేమించిన కూతురిపై తల్లిదండ్రులే ఎంత అమానుషానికి ఒడిగట్టారో ఈ ఘటనలో చూడొచ్చు. వరంగల్‌ జిల్లా హసన్‌‌పర్తికి చెందిన వీణ ప్రవీణ్ అనే యువకుడు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సొంత కులమే అయినప్పటికీ అమ్మాయి బంధువులు వారి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వారు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. రహస్య జీవితమే గడుపుతున్నారు. ప్రవీణ్ పిన్ని వాళ్ల ఇంట్లో కాపురం పెట్టారన్న విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు.. ఎవరూ లేని సమయంలో దాడి చేసి వీణను బలవంతంగా తీసుకుపోయారు. అమానుషంగా గుండు గీయించారు. ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించడంతో అమ్మాయిని అప్పగించారు.

ఇక నిర్మల్ జిల్లాలో మరో రకమైన ఉదంతం. కడెం మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన జుంబర్తి సత్తెన్న, శంకరమ్మల రెండో కూతురు.. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుణ్ని ప్రేమించింది. వారిది ఒకే కులం కావడంతో పెళ్లికి ఇరుపక్షాలూ అంగీకరించాయి. అయితే అప్పటికే పెద్దకూతురు పెళ్లి చేసి అప్పుల్లో కూరుకుపోయిన సత్తెన్న రెండో కూతురి పెళ్లి కోసం సమయం కావాలన్నాడు. ఈ క్రమంలోనే ఆయన గల్ఫ్ వెళ్లిపోయాడు. ఇక ప్రేమికుడి ఒత్తిడికి తలొగ్గిన సత్తెన్న కూతురు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. వారి పెళ్లి విషయంలో రెండు కుటుంబాలకూ అభ్యంతరం లేకున్నా.. కులపెద్దలకు మాత్రం అవమానంగా తోచింది. ఇంటి యజమాని ఇంట్లో లేని సమయం అని కూడా చూడకుండానే.. వారిని కులం నుంచి బహిష్కరించారు. ఏ శుభ కార్యాలకూ పిలవడం లేదు. వారితో ఎవరూ మాట్లాడవద్దని ఆంక్షలు విధించారు. సొంత కులస్తులే ఇలా వ్యవహరిస్తుండడంతో సత్తెన్న కుటుంబం మొత్తం ఆ ఊరికే పరాయిదైపోయింది.

కొద్ది రోజుల క్రితమే ఖమ్మం నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఇది మతాంతర వివాహం కావడమే కాక.. ప్రేమ జంటను చంపేందుకు సినిమా ఫక్కీలో చేజ్ చేయడం.. ఈ క్రమంలో ఇద్దరి ప్రాణాలు పోవడం సమాజాన్ని నివ్వెరపరిచాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోతున్న ప్రేమజంట.. వెనకాల తమను వెంటాడుతున్నవారిని తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదం సంభవించింది. దీంతో డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయాడు. తీవ్రగాయాలైన మరో వ్యక్తి ఆ తరువాత చనిపోయాడు. ఇప్పుడీ జంట రహస్య జీవితం గడుపుతోంది.

Next Story