భూరికార్డుల ప్రక్షాళన పూర్తయినట్లేనా?

భూరికార్డుల ప్రక్షాళన పూర్తయినట్లేనా?
x
Highlights

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం తానుగా విధించుకొన్న వందరోజుల గడువు పూర్తి కావొచ్చింది. దాదాపు 1400 గ్రామాల్లో...

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం తానుగా విధించుకొన్న వందరోజుల గడువు పూర్తి కావొచ్చింది. దాదాపు 1400 గ్రామాల్లో అత్యంత అస్తవ్యస్తంగా భూమి రికార్డులను ఎలాంటి వివాదరహితంగా చేయడానికి ఎనిమిది దశాబ్దాల తర్వాత టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన ఈ పనిని గడువులోగా పూర్తవుతుందని ప్రభుత్వం చెప్తున్నది. తెలంగాణలోనే కాదు.. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రెవెన్యూ వ్యవస్థ ఉన్నంత అస్తవ్యస్తంగా ఏ విభాగమూ ఉండి ఉండదు. భూములకు సంబంధించిన వ్యవస్థ అయితే అత్యంత దారుణం. రెవెన్యూ విభాగంలో జడలు విప్పిన అవినీతి భూముల రికార్డులను ఎంత దారుణంగా మార్చిందో తెలుసుకోవాలంటే ఆయా జిల్లాల కోర్టుల నుంచి రాష్ట్ర హైకోర్టు దాకా నమోదైన లక్షలాది సివిల్ కేసుల సంఖ్యను చూస్తే అర్థమవుతుంది. డబుల్ ఖాతాలు..నిల్ ఖాతాలు..డెత్ ఖాతాలు..ఇలా ఎన్నెన్నో.. పట్టాదారు పాస్ పుస్తకంలో ఒకపేరు.. లావణిలో మరోపేరు, పహాణిలో ఇంకోపేరు సవాలక్ష ఖాతాలతో..అనేక చిక్కుముడులతో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించడం అంత తేలికైన పని కాదు. దశాబ్దాల తరబడి పట్టించుకోకపోవడంతో విడదీయరాని స్థాయిలో భూ రికార్డులు జటిలమయ్యాయి. కేసీఆర్ సర్కారు నూరు రోజుల గడువు విధించుకొని తెలంగాణ అంతటా భూరికార్డులను సవరించాలని నిర్ణయించింది.

ప్రతి రైతుకు తన భూమి రికార్డులో ఎంత ఉన్నది? రికార్డుల్లోకి ఎక్కించాల్సినది ఎంత ఉన్నది? తదితర వివరాలన్నింటిని క్లీన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు బృందాలుగా 10744 గ్రామాలలో సర్వేలు చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ఇప్పటివరకు ఉన్న నిరుపయోగమైన ఖాతాలు, డబుల్ ఖాతాలన్నీ తొలిగించారు. కొందరు రైతులకు చెందిన భూములు డబుల్ ఖాతాలలో ఉన్నా, వీటన్నింటినీ ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి ఒకే ఖాతా కిందకు తీసుకొచ్చి, మిగతావాటిని తొలిగించారు. మరికొందరు రైతులు భూములు అమ్ముకున్న తరువాత కూడా పేరు మారని ఖాతాలను ఖాతాలను తొలగించారు. చనిపోయినవారి పేరున ఉన్న ఖాతాలోని భూములను వారి వారసులకు ఫౌతి కింద కేటాయించి వాటిని తొలిగించారు. వీటన్నింటి తొలిగింపులు కొత్త మార్పుల తరువాత గ్రామ భూమి సమగ్ర స్వరూపాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటివరకు 17 జిల్లాల్లో పూర్తయిందని అధికారులు విస్పష్టంగా ప్రకటించారు. ఇక మిగిలింది నాలుగువందల పైచిలుకు గ్రామాల్లో తుది దశకు చేరుకున్నదని ప్రకటించారు. ఈ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 10,875 రెవెన్యూ గ్రామాలుండగా, 10,450 గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళనను అధికారులు పూర్తిచేశారు. మొత్తం 2.45కోట్ల ఎకరాల భూమిలో.. రెండు కోట్ల ఎకరాల భూమికి రికార్డులు పక్కాగా మారాయి. మిగతా గ్రామాల్లో రాష్ట్రంలో భూమి రికార్డుల ప్రక్షాళన పూర్తి కావచ్చింది. మరో వారం రోజుల్లో మొత్తం రికార్డుల ప్రక్షాళన పూర్తవుతుంది. రాష్ట్రంలో 50.09 లక్షల మంది రైతులు ఉండగా 48.5 లక్షల మంది రైతుల భూములకు క్లియరెన్స్ ఇచ్చారు. మిగతా నాలుగువందల గ్రామాల్లో కూడా భూ రికార్డుల సవరింపులు పూర్తయితే, రాష్ట్రంలో ఆటవీ భూములతోపాటు అసైన్డ్, భూదాన్, వక్ఫ్, ప్రభుత్వ భూముల వివరాలు పక్కాగా తేలుతాయి. ఇప్పటివరకు గ్రామాల్లో భూ ప్రక్షాళన చేశారు. ఇంకా పట్టణాల్లో చేయాల్సి వచ్చింది. ఇక్కడే చాలా సమస్యలు రానున్నాయి. ఇక్కడ మరిన్ని సమస్యలు రానున్నాయి. బడాబాబులు ఆక్రమించిన స్థలాలను ఏమేరకు క్లియర్ చేస్తారన్నది ప్రశ్నార్థకమే. హైదరాబాద్ లోనే ఎన్ కన్వెన్షన్, అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్ భూములు వంటి వివాదాలను పరిష్కరిస్తారా లేదా అన్నది చూడాలి.

ఎన్నికల సమయంలో దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్నహామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వానికి సరిపోయినంత భూమి సరిపోలేదు. అక్కడి నుంచి పుట్టిందే భూ రికార్డుల ప్రక్షాళన ఆలోచన. ఏయే భూమి ఎంతెంత ఉన్నది స్పష్టమయితే.. దాని ప్రకారం ముందుకు పోవచ్చన్నది ప్రభుత్వ వ్యూహం. అంతకుమించి రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచనతో చేసిన సర్వేలో భయంకరమైన వాస్తవాలు బయటపడటంతో ప్రభుత్వానికి ఏమీ పాలుపోలేదు. రాష్ట్రంలో ఉన్న భూమికి మించి రైతుల సంఖ్య.. వారికి ఉన్న పొలాల లెక్క అడ్డగోలుగా రావడంతో వాస్తవాలను బయటపెట్టేందుకు రికార్డుల ప్రక్షాళన తప్పనిసరి అయింది. ఏటా రైతులకు రుణాలు ఇప్పించడం, ఆ తర్వాత రుణమాఫీ అనడం కంటే ఎకరానికి నాలుగువేలు పెట్టుబడి పెట్టడం సరైందని ప్రభుత్వం భావించింది. దీనివల్ల ప్రభుత్వాలు చేస్తున్న రుణమాఫీ కంటే ప్రభుత్వం వహించే భారమే తక్కువవుతుంది. కాబట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకొన్నారు. మరోవైపు అసైన్డ్ భూములపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పీవోటీ సవరణ చట్టం ప్రకారం ఒకవేళ భూమిలేని పేదలు కొనుగోలు చేస్తే వాటిని కొన్నవారికి రీ అసైన్డ్ చేయాలని నిర్ణయిస్తే బీ క్యాటగిరిలో చేరే భూముల సంఖ్య కూడా భారీగా తగ్గుతుంది. ఇప్పటివరకు 90 శాతం భూమి రికార్డులు పక్కాగా ఉన్నాయని అధికారులు చెప్తున్నా కోర్టు కేసుల్లో చిక్కుకుపోయిన భూముల విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

ఈ కేసులు ఎప్పటికి తేలుతాయో తెలియదు. ఇవి తేలకుండా ఈ భూములకు పెట్టుబడి డబ్బు ఇచ్చే అవకాశం లేదు. అన్నింటికీ మించి పట్టణాల్లో ఉన్న భూ వివాదాల పరిష్కారం తెలంగాణ ప్రభుత్వానికి పెను సవాలుగా మారుతుంది. భూకబ్జాలు చేసిన వీవీఐపీల విషయంలో ప్రభుత్వం గతంలోనే వెనుకడుగు వేసింది. సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వ్యవహారంలో ఒకటి రెండు రోజులు హడావిడిచేసిన సర్కారు తర్వాత చప్పబడిపోయింది. అయ్యప్ప సొసైటీ విషయంలోనూ జరిగింది అదే.. హైదరాబాద్ నగరంలోనే ఇలా ఉంటే మిగతా పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో కాస్తంత తేలిగ్గా పరిష్కారమైనప్పటికి పట్టణాల విషయంలో వీటిని ఎలా పరిష్కరిస్తారన్నది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories