Top
logo

హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో లేడీస్‌ స్పెషల్‌ కోచ్‌‌

హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో లేడీస్‌ స్పెషల్‌ కోచ్‌‌
X
Highlights

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లలో మాదిరిగా...

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లలో మాదిరిగా ప్రతి మెట్రో రైల్‌లో మహిళల కోసం ఒక ప్రత్యేక కోచ్‌‌ను కేటాయించారు. ఈరోజు నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అమీర్‌పేట్‌ స్టేషన్‌లో లేడీస్‌ స్పెషల్‌ కోచ్‌ను హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌ అండ్‌ డీ అధికారులు ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌ మెట్రో ప్రారంభమై 6 నెలలు కావొస్తుండటంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకొస్తోంది. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రోలో ఇప్పటివరకూ వృద్ధులకు, దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయించడం మినహా... ఏ వర్గానికీ ప్రత్యేక కోచ్‌ అంటూలేదు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సైతం కొన్ని సీట్లు రిజర్వు చేశారు. దీనికి మహిళల నుంచి మంచి స్పందన రావడంతో... మరో నిర్ణయం తీసుకున్నారు. మహిళా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సుఖవంతమైన ప్రయాణం చేయడానికి... ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లలో మాదిరిగా ప్రతి మెట్రో రైల్‌లో ఒక ప్రత్యేక కోచ్‌‌ను కేటాయించారు. దాంతో రద్దీ సమయాల్లో సైతం ఉద్యోగినులు, గృహిణులు, విద్యార్ధినులు కూర్చొని ప్రయాణం చేసే అవకాశం లభించనుంది.

మహిళలు సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఒక కోచ్‌ను మహిళలకు కేటాయిస్తున్నట్లు మెట్రోరైలు అధికారులు తెలిపారు. మెట్రో రైల్లో లేడీస్‌ స్పెషల్‌ కోచ్‌ ఏర్పాటు చేయడంపై మహిళలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. భద్రతతోపాటు కూర్చొని ప్రయాణించే అవకాశం లభిస్తుందని అంటున్నారు.

Next Story