సొంత గూటికి కిరణ్‌‌కుమార్‌రెడ్డి?

x
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌‌కుమార్‌రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరేందుకు రంగంసిద్ధమైంది. హైదరాబాద్‌లోని కిరణ్‌ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌‌కుమార్‌రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరేందుకు రంగంసిద్ధమైంది. హైదరాబాద్‌లోని కిరణ్‌ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా సమావేశమైన కాంగ్రెస్‌ ఎంపీ సుబ్బిరామారెడ్డి అరగంటకి పైగా చర్చలు జరిపారు. తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. కిరణ్‌ చేరిక దాదాపు ఖాయమైందన్న సుబ్బిరామిరెడ్డి కిరణ్‌రెడ్డి త్వరలోనే హైకమాండ్‌ను కలుస్తారంటూ చెప్పుకొచ్చారు. మాజీ సీఎంగా కిరణ్‌‌కు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా 2014 ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు కోల్పోవడంతో పొలిటికల్‌‍‌గా లోప్రొఫైల్‌ మెయింటైన్‌ చేస్తోన్న కిరణ్‌రెడ్డి‌ మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్‌ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లినా ఘోర పరాజయాన్ని చవిచూడటంతో అసలు ప్రజల్లోకి రావడమే మానేసిన ఈ మాజీ ముఖ్యమంత్రి తిరిగి సొంత గూటికే చేరబోతున్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమైనట్లు తెలుస్తోంది. కిరణ్‌‌ రాకను ఆహ్వానించిన రాహుల్‌ ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించేందుకు సుముఖత వ్యక్తంచేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్ ఉమెన్ చాందీ కూడా కిరణ్‌ రాకను ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఇక ఇటీవల తన స్వగ్రామం నగిరిపల్లి వచ్చిన కిరణ్‌‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

తన రాజకీయ గురువు, కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ చిదంబరం సలహా, సూచనతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తున్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల పల్లంరాజు, ఇప్పుడు సుబ్బరామిరెడ్డి.... కిరణ్‌‌తో సమావేశమై... తిరిగి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories