ఫ్రంట్‌ సక్సెస్‌ అవుతుందా..చంద్రబాబు సై అంటారా?

x
Highlights

థర్డ్ ఫ్రంట్.. ఈ మాటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పడి.. అది ఎలాంటి మార్పులు తీసుకొస్తుందన్నది వేరే విషయం. కానీ కేసీఆర్...

థర్డ్ ఫ్రంట్.. ఈ మాటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పడి.. అది ఎలాంటి మార్పులు తీసుకొస్తుందన్నది వేరే విషయం. కానీ కేసీఆర్ లాంటి ఓ రాజకీయ ఉద్దండుడు.. ఆ మాటను ఉపయోగించడం అందరి నోళ్లలోనూ నానుతోంది. మరి... థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందా? ఏర్పడినా సక్సెస్ అవుతుందా?

కేసీఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్ లో టీఆర్ఎస్ ఎత్తుగడల కోణమే కాక.. కేసీఆర్ ఉటంకించిన దేశ స్థాయి రాజకీయ పరిస్థితులను కూడా కొట్టిపారేయలేమంటున్నారు పరిశీలకులు. అంటే రాజకీయాలన్నాక పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం తప్పదని.. కానీ లీడర్ చెబుతున్న కారణాలు కూడా అంతే బలంగా ఉండడం గమనించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశ రాజకీయ పరిస్థితులు సమూలంగా మారాల్సిన అవసరం ఉందంటూ.. అవసరమైతే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు నాయకత్వం వహిస్తానని బాంబు లాంటి స్టేట్ మెంట్ పేల్చిన కేసీఆర్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కేసీఆర్ స్టేట్ మెంట్లో ఎత్తుగడను గూర్చి మాట్లాడుతున్నవారు సైతం మొన్నటి కామెంట్ల వెనుక గల వాస్తవ పరిస్థితులను కూడా కొట్టిపారేయలేకపోతున్నారు. మన దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ ఫ్రంట్లు గతంలో విఫలమైన అనుభవాలు ఉన్న దరిమిలా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న థర్డ్ ఫ్రంట్ మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అదే సమయంలో థర్డ్ ఫ్రంట్ అవసరం ఉందంటూ కేసీఆర్ సూచిస్తున్న కారణాల్ని రాజకీయ నిపుణులు స్వాగతిస్తున్నారు.

దాదాపు 30 పార్టీల ఎన్డీయే కూటమికి 320 దాకా ఎంపీల సంఖ్య ఉంది. ఒక్క బీజేపీకే 280కి పైగా ఎంపీల బలం ఉంది. అటు యూపీఏ కూటమికి గట్టిగా 60 సీట్లు కూడా లేవు. వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఖాళీ చేస్తూ ఒక్కో రాష్ట్రాన్నే బీజేపీ కబ్జా చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో బీజేపీతో స్నేహంగా ఉంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా థర్డ్ ఫ్రంట్ అంటూ కొత్తపల్లవి వినిపించారు. 2004, 2009లో కేంద్రంలో యూపీఏ సర్కారు కొలువు దీరడానికి నాటి ఉమ్మడి ఏపీ కీలకంగా వ్యవహరించింది. 2004లో 29 మంది ఎంపీలు, 2009లో 33 మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు మూడంకెలకు మించి ఎంపీలు గెలవరని, బీజేపీ కూడా చరిష్మా కోల్పోతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా థర్డ్ ఫ్రంట్ ను లేవనెత్తారంటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీయే భాగస్వామిగా ఉన్నా... కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విసిగిపోయారు. అటు తెలంగాణ ప్రభుత్వ పథకాల్ని కేంద్ర మంత్రులు ప్రశంసిస్తున్నా నిధుల విషయంలో మొండిచేయి చూపుతున్నారు. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కేంద్రంతో ఒకే తరహా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే మొదట్నుంచీ కేంద్రంతో మధ్యే మార్గాన్ని అవలంబిస్తున్న కేసీఆర్.. థర్డ్ ఫ్రంట్ అంటూ తాజా ప్రకటన ముందుకు తేవడంతో... చంద్రబాబు లాంటి అసంతృప్త నేతలు త్వరగా మనసు మార్చుకునే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు థర్డ్ ఫ్రంట్ ఆలోచనను స్వాగతిస్తున్నట్లు వార్తలు రావడం రాజకీయంగా ఓ మలుపులాంటిదేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్ రాజకీయంగా మంచిదే అయినా... ఆయనతో జత కలిసే నమ్మకమైన పార్టీలు.. వాటి ఎజెండా ఎలా ఉంటుందీ.. ఆ కూటమిని కేసీఆర్ ఎలా నడిపిస్తారన్నదే కీలక ప్రశ్నగా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories