పొలిటిక‌ల్ హీట్ ర‌గిలిస్తున్న కేసీఆర్

పొలిటిక‌ల్ హీట్ ర‌గిలిస్తున్న కేసీఆర్
x
Highlights

ఇంత కాలం పార్టీ ఎమ్మెల్యేలకు సమయమివ్వని కేసీఆర్... ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ అవుతున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల...

ఇంత కాలం పార్టీ ఎమ్మెల్యేలకు సమయమివ్వని కేసీఆర్... ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ అవుతున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను ఎమ్మెల్యేల ద్వారా తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరును కూడా బేరీజీ వేస్తున్నారు. వాస్తవ పరిస్థితుల మీద కేసీఆర్ కు సాధికారత ఉండడంతో ఎమ్మెల్యేలు డైలమాలో పడుతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో.. అన్ని రాజకీయపార్టీలూ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీలో పొలిటికల్ హీట్ రగిలిస్తున్నారు. ఒకవైపు తెలంగాణవ్యాప్తంగా పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సర్వేలు చేయిస్తూనే.. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఓసారి జరిపించిన సర్వే రిపోర్టును నియోజకవర్గాలవారీగా అందించిన కేసీఆర్.. తాజాగా ఇటీవల వచ్చిన సర్వే రిపోర్టులతో నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మూడేళ్లుగా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యాక్రమాలు అమలు చేస్తోంది. అధికారపగ్గాలు చేపట్టినప్పటినుంచీ కేసీఆర్ పాలనపైనే దృష్టి సారించారు. ఇక ఎన్నికల హీట్ పెరుగుతుండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై వారితో వ్యక్తిగతంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, వాటి అమలు తీరును అడిగి తెలుసుకుంటున్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిన నేపథ్యంలో అవి అర్హులకు అందుతున్నాయా లేదా? సర్కారు పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు తదితర వివరాలు రాబట్టుతున్నట్లు సమాచారం.

నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరును వారినే అడుగుతున్నట్లు సమాచారం. వారంలో ఎన్ని రోజులు గ్రామాల్లో పర్యటిస్తారు మూడున్నర ఏళ్లుగా ఎన్ని గ్రామాల్లో పర్యటించారు ఆ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చూపుతున్న చొరవ తదితర వివరాలను తెలుసుకుంటున్నారు. ఇక నిరంతర ఉచిత విద్యుత్ పై రైతులు ఏమనుకుంటున్నారు ఇంకా నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ది పనులు ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్దిదారులతో సమావేశం అవుతున్నారా లేదా అనే విష‌యాల‌ు రాబడుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో ఈ తరహా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో మిగతా ఎమ్మెల్యేలతోనూ చర్చించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల నుంచి సమాచారం సేకరిస్తూనే వారి నియోజకవర్గాల్లో ఉన్న వాస్తవ పరిస్థితుల నివేదికను వారికే అందచేస్తున్నారు సీఎం. దీంతో పార్టీ నేతల్లో వణుకు పుడుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలపై గులాబీబాస్ కు సరైన సమాచారం ఉండటంతో అధినేతకు సమాధానం చెప్పలేక తెగ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు మిగిలిన తక్కువ సమయంలో ఎమ్మెల్యేలు వారి లోపాలను సరిదిద్దుకుంటారా సరిదిద్దుకోలేక రాబోయే పరిణామాలకు సిద్ధపడతారా అన్నది పార్టీలో ఆసక్తి రేపుతుండగా ఎమ్మెల్యేలకు గుబులుగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories