కేసీఆర్‌ ప్రగతి నివేదన సభలో ఎన్నికల రణభేరి మోగిస్తారా...ప్రగతి నివేదనతో ఏం తేల్చబోతున్నారు?

x
Highlights

ముందస్తు వ్యూహమైనా.... ఎన్నికల రణతంత్రమైనా... సందర్భం ఏదైనా సరే. గమ్యం మాత్రం ఒక్కటే. గమనాన్ని చూపెడుతూ లక్ష్యం వైపు పరిగెత్తే పాలనే ప్రగతి నివేదన...

ముందస్తు వ్యూహమైనా.... ఎన్నికల రణతంత్రమైనా... సందర్భం ఏదైనా సరే. గమ్యం మాత్రం ఒక్కటే. గమనాన్ని చూపెడుతూ లక్ష్యం వైపు పరిగెత్తే పాలనే ప్రగతి నివేదన అంటూ సర్కార్ సంకల్పించిన సభపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నాలుగేళ్లలో తాను సాధించి పెట్టిన ప్రగతి పరుగులు పెడుతుంటే.. తాను కలలు గన్న బంగారు తెలంగాణ లక్ష్యం కనుచూపు మేరలో కనిపిస్తుందన్న భరోసా ముఖ్యమంత్రిని సభా ప్రాంగణం వైపు నడిపిస్తోందిప్పుడు. మరి ప్రగతి నివేదన సభ నుంచి ముఖ్యమంత్రి ఎన్నికల రణభేరి మోగిస్తారా? లేక యుద్ధ తంత్రాన్ని బోధిస్తారా? అడ్డుతగిలే అంశాలకు అంటుకున్న గులాబీ ముళ్లను... కేసీఆర్‌ ఏ పంటి వ్యూహంతో బయటకు తీస్తారు? ప్రగతి నివేదనతో ఏం తేల్చబోతున్నారు?

యుద్ధంలో ఏదో వైపున ఉండేవారితో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. శత్రువు కదలికలు కళ్లముందే కనిపిస్తూ వ్యూహాలు, ఎత్తుగడల్లో పథకరచనకు పనికొచ్చేలా ఉంటాయి. గెలుపు ఎంత బలాన్నిస్తుందో ఓడిపోతామేమోనన్న భయం అంత బలహీనులను చేస్తుంది. కానీ నాలుగేళ్లలో తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ చేశామన్న ధీమా ముఖ్యమంత్రి కేసీఆర్‌లో తొణికిసలాడుతోంది. ప్రతిపక్షాలను చెడామడ తిడుతూ రెచ్చిగొట్టి మరీ గిచ్చి రేపెట్టుకుంటునే కేసీఆర్‌ తాను మాట్లాడే ప్రతి మాట చర్చకు వచ్చేలా వ్యూహాత్మకంగా మాట్లాడతారు. వాస్తవానికి కేసీఆర్ అమ్ముల పొదిలో ఇదే ప్రధాన అస్త్రం. విపక్షాల మీద ఆగ్రహం, తనలోని ఆలోచన, మేధావుల ద్వంద్వనీతి మీద తిరస్కారం ఇలా కేసీఆర్‌లో ఏకకాలంలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి అనతి కాలంలోనే విజయపథాన దూసుకెళ్తున్న తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు కొన్ని దేశంలో పలు రాష్ట్రాలను ఆకర్షించాయి. అయితే ఇదే సమయంలో కమ్ముకొస్తున్న ముందస్తు మేఘాల మధ్య
ప్రగతి నివేదన అంటూ ముఖ్యమంత్రి సంకల్పించిన సభ టీఆర్‌ఎస్‌ గమ్యాన్ని, గమనాన్ని నిర్దేశించబోతోంది.

నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఆర్థిక అసమానతలు తొలిగించే కార్యక్రమాలతో పాటు సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు భారీగానే జరిపింది. యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందిస్తూ పథకాలకు పథక రచన చేసింది. సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలాన్నీ పునరుత్తేజం చేస్తామని చెబుతూనే బంగారు తెలంగాణ సాధిస్తామని చెబుతున్నారు ముఖ్యమంత్రి. తనను తాను నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి దోహదం చేస్తున్నామని మొన్నటి పంద్రాగస్టు ప్రసంగంలో చెప్పారాయన. నాలుగేళ్ల విలువైన కాలాన్ని తెలంగాణ భవిష్యత్తు కోసమే కేటాయించామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాష్ట్ర ప్రస్థానం సాగుతుందని గోల్కోండ కోట సాక్షిగా తెలంగాణ జాతికి తేటతెల్లం చేశారు ముఖ్యమంత్రి.

మాటే మంత్రదండంగా చమక్కులతో ప్రసంగాన్ని రక్తి కట్టిస్తూ వెటకారంతో ప్రత్యర్థులను వేడెక్కించే కేసీఆర్‌.. తన రాజకీయ వ్యూహరచనా సామర్థ్యంతో విమర్శకులను ఆకట్టుకోవాలంటే ప్రజలకు మెరుగైన పరిపాలన అవసరమని భావిస్తున్నారు. అలాంటి పరిపాలన మళ్లీ అందించాలంటే పటిష్టమైన పార్టీ అవసరం. ఈ లాజిక్కు ఎరిగిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి పటిష్టమైన సైన్యాన్ని తయారుచేసే ప్రణాళిక రచిస్తున్నారు. మొన్న ఏకధాటిగా ఏడు గంటల పాటు సాగిన మంత్రుల
సమావేశంలో కూడా ముఖ‌్యమంత్రిగా కేసీఆర్‌ ఈ దిశనే నిర్దేశించారు. నాలుగేళ్ల నుంచి తాము ఏం చేశామో ప్రజలకు అన్నీ తెలిసినా దేశం మొత్తం చర్చించుకునేలా ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలన్నది కేసీఆర్‌ ఆలోచన.

రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ బహుముఖ పథకాలతో ప్రజల్లోకి వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయమైన రైతాంగాన్ని ఆదుకుంటామంటూ రైతబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎల్ఐసీతో కలసి అన్నదాతలకు అండగా రైతుబీమాను అందించారు. ఇక మిషన్ భగీరథ, మిషన్‌ కాకతీయ, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా అంటూ పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెబుతూ డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లంటూ ఇలా ఎన్నో ప్రజాపయోగ పథకాలకు అంకురార్పణ చేసిన కేసీఆర్‌ అవి ఏ మేరకు ప్రయోజనకరంగా మారాయో దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఎలా ఆదర్శంగా తీసుకున్నాయో ప్రగతి నివేదని సభా వేదికపై నుంచి మరోసారి బహిర్గతం చేయాలన్నది కేసీఆర్‌ వ్యూహంగా కనపడుతోంది. ఎందుకంటే పార్టీ విషయంలో ఒకలా, ప్రయోజనాల విషయంలో మరోలా విజయవంతంగా వ్యవహరించగలగడమంటే సామాన్యమైన విషయం కాదు. నూటికి నూరుపాళ్లు ఇదే సూత్రాన్ని సెప్టెంబరు 2 ప్రగతి సభ నుంచి నివేదించబోతున్నారు కేసీఆర్‌.

ప్రజాపోరాటం ద్వారా సాధించిన తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగమే ప్రగతి నివేదన సభ లక్ష్యంగా కనిపిస్తోంది. గతం మిగిల్చిన విధ్వంసాల విషాదాలను వర్తమానంలో అధిగమించాలన్నది కేసీఆర్ తన సహచరులకు చెబుతున్న హితబోధ. భవిష్యత్‌లోనూ విజయాల పరంపరను నమోదు చేయాలన్నది గులాబీ బాస్‌ ఆశాభావం. ఇదే విషయాన్ని ప్రగతి నివేదన సభా వేదికపై నుంచి ఆయన మరోసారి ఢంకా బజాయించి చెప్పబోతున్నారు. ప్రతీపశక్తుల ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగాలని ఆ సభ నుంచి క్షేత్రస్థాయి కేడర్‌లో ఉత్సాహం నింపబోతున్నారు. అలజడులు సృష్టించే ప్రయత్నాలను తిప్పికొడుతూ రాజకీయ సుస్థిరతను నెలకొల్పామని ప్రజలకు బహిరంగ పరచబోతున్నారు. రాజకీయ అవినీతి లేని పాలన టీఆర్‌ఎస్‌ వల్లే సాధ్యమైందని తెలంగాణ సమాజానికి చెప్పాలన్నది కేసీఆర్‌ అభిమతం. అగమ్య గోచరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, వృద్ది దిశగా నడిపించామని చెప్పాలన్నది కేసీఆర్‌ భావన. పురోగామి రాష్ట్రంగా దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నామని, తెలంగాణను దేశానికే మార్గనిర్దేశనం చేసే రాష్ట్రంగా నిలబెట్టుకోగలిగామని ప్రగతి నివేదన సభ వేదిక నుంచి తేటతెల్లం చేసి ప్రజల మెప్పు పొందాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. పటిష్టమైన సంకల్ప బలంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకితమవుతున్నామని, ఈ ప్రయాణంలో ప్రజలే తనకు అండదండగా ఉండాలని వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణ విజయయాత్ర కొనసాగేందుకు తగిన బలాన్ని ఇవ్వాలని తెలంగాణ సమాజాన్ని ప్రగతి నివేదన సభా వేదిక నుంచి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories