కేటీఆర్ కు లైన్ క్లియర్ చేయాలంటే సీనియర్లను ఢిల్లీకి పంపాల్సిందేనా?

x
Highlights

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఢిల్లీలో చక్రం తిప్పాలని...

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్నారా? అందుకే పలువురు మంత్రులను ఎంపీలుగా పోటీ చేయించడం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం అందుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

నిజమే.. మొన్న కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అవసరం ఉందన్న కామెంట్లతో అనేక అంశాలు ఇప్పుడు తెరమీదికొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలు రాబట్టేందుకే కేసీఆర్ బహుముఖ వ్యహాలకు తెరలేపారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హస్తినలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని అంచనా వేస్తున్న కేసీఆర్.. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని సీట్లను గెలుచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పార్టీ సీనియర్లు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే పలువురు మంత్రుల చేత ఎంపీలుగా పోటీ చేయించాలనుకుంటున్నారు.

విపక్షాల నుంచి బలమైన అభ్యర్ధులు రంగంలోకి దిగే అవకాశం ఉండటంతో దీటైన అభ్యర్థులు ఉంటే తప్ప మెజారిటీ స్థానాలు ఖాతాలో వేసుకోవడం కష్టం. అందుకే సీనియర్ మంత్రులందరినీ లోక్ సభకు పోటీ చేయించడమే మార్గమని కేసీఆర్ నమ్ముతున్నారు. తద్వారా ఎంపీ సీట్లతో పాటు ఆ పార్లమెంట్ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా సీనియర్ మంత్రులను పార్లమెంట్ కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

మంత్రి హరీష్ రావును మెదక్ పార్లమెంట్ సీటుకు పోటీ చేయించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. హరీష్ కు క్లీన్ ఇమేజ్ ఉండటం ఉద్యమ సమయం నుంచీ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడంతో మెదక్ ఎంపీగా ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన్ను ఒప్పించి మెదక్ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం నడుస్తోంది.

ఇక ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ను కరీంనగర్ ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలో మొదట్నుంచీ బీసీ నాయకుడిగా ఈటల ముందువరుసలో ఉన్నారు. ఆయన్ను ఎంపీగా ఎలివేట్ చేయడం ద్వారా బీసీల ఓట్లు రాబట్టుకోవాలనే యోచనలో గులాబీ బాస్ ఉన్నారు. అందుకే ఆయన్ని కరీంనగర్ ఎంపీగా పంపి.. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఆయన సతీమణి జమునకు అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయన్న చర్చ పార్టీలో నడుస్తోంది.

ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరిని మరోసారి ఢిల్లీకి పంపించాలనుకుంటున్నారు కేసీఆర్. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఆయన.. అనంతర రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను మరోసారి వరంగల్ నుంచి బరిలో నిలపాలని భావిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు అంతగా పట్టు లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం గెలుచుకుంది. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నా పార్టీ బలపడిందని నిర్ధిష్టంగా చెప్పే పరిస్థితి లేదు. అందుకే అక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎంపీగా పోటీ చేయించడం ద్వారా ఖమ్మం పరిధిలోని ఏడు నియోజకర్గాలు గెలుచుకుని కాంగ్రెస్ కు షాకివ్వాలని కేసీఆర్ తలపోస్తున్నారు.

ఇక నిజమాబాద్ ఎంపీగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని కూడా సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ కూతురు కవిత కన్నా ఆయన్ను పోటీ చేయిస్తే కుటుంబపాలన అన్న అపవాదును పోగోట్టుకోవడంతో పాటు సీనియర్లకు ప్రాధాన్యం కల్పించినట్టవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇక దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. అందుకే ఇక్కడి నియోజకవర్గాల నుంచి మంత్రులను ఎంపీలుగా పోటీ చేయిస్తే గట్టి పోటీ ఇవ్వవచ్చని భావిస్తున్నారు కేసీఆర్. నల్గొండ ఎంపీగా మంత్రి జగదీష్ రెడ్డిని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడైతే సూర్యాపేటలో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. అదే సందర్బంలో నల్గొండ ఎంపీగా కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి ఉన్నారు. వారిని కట్టడి చేయాలంటే నల్గొండ ఎంపీగా గట్టి అభ్యర్థిని రంగంలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే జిల్లాకు చెందిన ఏకైక మంత్రి జగదీష్ రెడ్డిని బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఇక రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డిని చేవెళ్ల నుంచి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్న కవిత, వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి కేంద్రంలో కొంత మేర పార్టీ వాయిస్ వినిపిస్తూ అక్కడ కీ రోల్ పోషిస్తున్నారు. ఆ ముగ్గురికి కొత్త ఎంపీలు కూడా తోడైతే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories