రైతు యాత్ర...రైతులను కలిసేందుకు పంట పొలాల వద్దకు...

x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. రైతు బంధు పథకం ప్రకటించిన తర్వాత వారిలో ఎటువంటి మార్పు వచ్చిందో...

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. రైతు బంధు పథకం ప్రకటించిన తర్వాత వారిలో ఎటువంటి మార్పు వచ్చిందో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే రైతు యాత్ర పేరుతో రైతులను కలిసేందుకు పంట పొలాల వద్దకు వెళ్లనున్నారు.

రైతు బంధు పథకం పట్ల అనుకూల స్పందన రావడంతో సీఎం కెసీఆర్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. రైతులకు ఆర్ధిక సాయం అందాక వారిలో ఎటువంటి మార్పు వచ్చిందో స్వయంగా తెలుసుకునేందుకు కెసీఆర్ రంగంలో దిగనున్నారు. ఆగస్టు 15న రైతు బీమా పథకం ప్రకటన తర్వాత రైతు యాత్ర పేరుతో ఎంపిక చేసిన జిల్లాలో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతకన్నా ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని రైతు సమన్వయ సమితి ఇచ్చే నివేదికను కెసీఆర్ పరిశీలించనున్నారు.

గత కొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న రైతులు ప్రభుత్వం అందించిన ఆర్ధిక సాయంతో ఏ విధంగా పంట సాగుచేస్తున్నారు ? వారిలో ఎటువంటి మార్పులు వచ్చాయి ? తదితర అంశాలను వ్యవసాయ శాఖ సహకారంతో రైతు సమన్వయ సమితి పరిశీలించనుంది. ఈ అంశాలను క్రోడీకరించి ముఖ్యమంత్రి కెసీఆర్‌కు నివేదిక అందించనుంది. నివేదికను పరిశీలించిన అనంతరం కెసీఆర్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు. నేరుగా రైతులను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకోనున్నారు. రబీ సీజన్ నాటికి మరింత సహకారం అందేలా రైతులకు భరోసా ఇవ్వనున్నారు.

మే 10 వ తేదీన తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం దిగ్విజయంగా ప్రారంభించింది. ప్రతి ఎకరానికి 4వేల రూపాయల ఆర్ధిక సాయం అందించేందుకు కెసీఆర్ సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 58 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుంది. రైతు బంధు చెక్కుల పంపిణీ, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జూన్ 20 నాటికి పూర్తి చేయాలని కెసీఆర్ డెడ్‌లైన్ విధించారు. రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు వల్ల చాలా చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే సవరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories