కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు..ప్రధాని మోదీతో ఏం చర్చించబోతున్నారు..?

x
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయా ? ఇప్పటికీ రాష్ట్రంలో హడావుడి చేసిన అధికార పార్టీ ఢిల్లీ వేదికగా కార్యకలాపాలు...

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయా ? ఇప్పటికీ రాష్ట్రంలో హడావుడి చేసిన అధికార పార్టీ ఢిల్లీ వేదికగా కార్యకలాపాలు చేపట్టిందా ? ముందస్తు ఎన్నికల అజెండాతోనే నిన్న మంత్రి కేటీఆర్ .. నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ బాట పడుతున్నారా ? ముందస్తు వ్యూహం ప్రకారమే అన్ని పనులు జరుగుతున్నాయా ?

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు హడావుడి జరుగుతున్న నేపధ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ చేపట్టడం వెనక ముందస్తు ఊహగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్‌ మూడో కంటికి తెలియకుండా ఢిల్లీ వెళ్లి రావడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. కేటీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన కొద్దిసేపటికే సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో గంట పాటు భేటీ కావడం వెంట వెంటనే జరిగాయి. ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది.

ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన కేసీఆర్‌ రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. అక్టోబరు మొదటి వారంలో వీటికి షెడ్యూల్ వెలుబడే అవకాశాలున్నాయి. వీటితో పాటే తెలంగాణకు కూడా ఎన్నికల షెడ్యూలు వచ్చేలా కేసీఆర్‌ ఢిల్లీ స్ధాయి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమచారం. అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నామనే సంకేతాలు ప్రధాని చాలా కాలం క్రితమే ఇచ్చారని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. అయితే అసెంబ్లీ రద్దు చేశాక నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల షెడ్యూలు ఇవ్వకపోతే ఎలా అనే అనుమానం అధికార పార్టీని ఇప్పుడు వెంటాడుతోంది. అనుకున్న ప్రకారం ఎన్నికలు రాకపోతే అసలుకే మోసం వస్తుందనే భయం అధికార పార్టీలో వ్యక్తమవుతోంది.

ఈ అనుమానాలను తొలగించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను కేసీఆర్‌ రంగంలోకి దింపారు. నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో మంతనాలు జరిపారు. గతంలో రాజీవ్ శర్మ ఢిల్లీలో కేంద్ర సర్వీసు లో పనిచేసినప్పుడు తనకున్న పరిచయాలతో ఎన్నికల సంఘం వద్ద అసలు విషయాన్ని రాబట్టే పనిలో పడ్దారనే ప్రచారం ఉంది. రాజీవ్ శర్మతో పాటు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజీత్ కుమార్ కూడా ఉండటంతో నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో తెలంగాణలో ఎన్నికలు జరిగేలా వ్యూహం రచిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అంతా అనుకున్నట్టు జరిగితే ప్రగతి నివేదన సభ అనంతరం అసెంబ్లీ నిర్వహించాలనే భావనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. సభా వేదికగా నాలుగేళ్ల పాలనను వివరిస్తూ అనంతరం ప్రభుత్వం రద్దు కోరే సూచనలున్నట్టు భావిస్తున్నారు. ఇందుకోసమే పలువురు కీలకనేతలకు ఢిల్లీ పరిణామాలపై నిఘా ఉంచే బాధ్యతను అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories