కేసీఆర్ అను నేను ఎక్కడి నుంచి

కేసీఆర్ అను నేను ఎక్కడి నుంచి
x
Highlights

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశ రాజకీయల్లో చక్రం తిప్పాలంటే ముందు ఎంపీగా...

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశ రాజకీయల్లో చక్రం తిప్పాలంటే ముందు ఎంపీగా వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అందుకు వచ్చే ఎన్నికల నాటికి నల్గొండ లేదా మెదక్ నుండి పోటీ చేసేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీ ప్లీనరీ కూడా నల్గొండలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దేశ రాజకీయల్లో మార్పులు తీసుకు రావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. ఇప్పుడున్న రెండు జాతీయ పార్టీలతో ప్రజలు వంచనకు గురవుతున్నారని ఆ వంచన నుంచి ప్రజల్ని బయట పడేయాలంటే ఫెడరల్ ఫ్రంట్ అవసరమని అందుకు నాయకత్వం వహించేందుకు తాను సిద్ధమన్న కేసీఆర్ ప్రకటనకు పలు రాష్ట్రాల నుండి మద్దుతు లభించింది. దీంతో తెలంగాణ ఉద్యమ తరహాలోనే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకు రావాలని నిర్ణయించారు.

ఇక దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలంటే కేసీఆర్ ఢిల్లీకి మకాం మార్చాల్సి ఉంటుంది. అందువల్ల వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు ఆయన రెండు ఆప్షన్లు ఎంచుకున్నట్లు సమాచారం. నల్గొండ లేదా మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నల్గొండ నుండి పోటీ చేసేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే ఏప్రిల్ లో నిర్వహించబోయే పార్టీ ప్లీనరీ కూడా నల్గొండలోనే నిర్వహించి దాని వేదికగానే ఫెడరల్ ఫ్రంట్ విధివిధానాలు ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గుజరాత్ ను మోడల్ గా చూపించి ఎలా దేశ రాజకీయాల్లోకి వచ్చారో తాను కూడా తెలంగాణ అభివృద్ధి నమూనాతో ఇక్కడ అమలవుతున్న పధకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేలా ప్రంట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఎకరాకు 4 వేల పెట్టుబడి సాయం, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూం, దళితులకు మూడెకరాల భూమితో పాటు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను ప్రతి రాష్ట్రంలో చేపట్టేలా ఎజెండా రూపొందించాలని భావిస్తున్నారు. నిపుణుడైన రాజకీయవేత్తగా, మంచి మాటకారిగా పేరున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ అయితే దేశ పురోగతిలో గుణాత్మకమైన మార్పులు తప్పక వస్తాయని దేశ ప్రజలకు వివరించాలనుకుంటున్నారు. ఇక ఫెడరల్ ఫ్రంట్ నమూనా ఎలా ఉంటుందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories