కేసీఆర్ రాక కోసం నేతల ఎదురుచూపు

x
Highlights

కేసీఆర్ రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు. ఒక్కసారి కేసీఆర్ ప్రచారానికి వస్తే అసమ్మతి కొలిక్కి రావడంతోపాటు తమకు బీ. ఫాం పక్కా అని...

కేసీఆర్ రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు. ఒక్కసారి కేసీఆర్ ప్రచారానికి వస్తే అసమ్మతి కొలిక్కి రావడంతోపాటు తమకు బీ. ఫాం పక్కా అని అభ్యర్థులు నమ్ముతున్నారు. దీంతో వీలైనంత త్వరగా కేసీఆర్‌ను తమ నియోజకవర్గానికి రప్పించాలని చూస్తున్నారు నేతలు. స్వయంగా గులాబీ బాస్‌ను కలిసి ప్రచారానికి రావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థుల భయం అంతా ఇంత కాదు. అభ్యర్థులుగా అధికారికంగా ప్రకటించినా వారిలో టెన్షన్ తగ్గడం లేదు. మెజార్టీ నియోజకర్గాల్లో అసమ్మతి నేతలు టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అనుచరులతో కలసి నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో చివర్లో తమను తప్పించి టికెట్లు ఇతరులకు ఇస్తే ఎలా అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. పైగా విపక్ష అభ్యర్థులను బట్టి పలువురు అభ్యర్థులను మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. అభ్యర్థులపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న చోట కొత్త వారికి బీ.ఫార్మ్‌లు ఇవ్వాలని చూస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

అభ్యర్థుల మార్పు ఊహాగానాలతో వీలైనంత త్వరగా కేసీఆర్ చేత తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయించుకోవాలని నేతలు ఆరాట పడుతున్నారు. ఎలాగూ కేసీఆర్ 50 రోజుల్లో వంద నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కసారి కేసీఆర్ తమ నియోజకవర్గంలో ప్రచారానికొస్తే చాలు అసమ్మతి అంతా సద్దుమణుగుతుందని భావిస్తున్నారు. పెద్ద బాసే ప్రచారానికి వస్తే అసమ్మతి నేతలు నోరెత్తరని అనుకొంటున్నారు.

కేసీఆర్ రాక కోసం అభ్యర్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొందరు కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసి తమ నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించాలని వేడుకుంటున్నారు. తేదీ ఖరారు చేస్తే సభ ఏర్పాట్లను పూర్తి చేసుకుంటామంటున్నారు. అయితే, సీఎం ప్రచార రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు. హుస్నాబాద్ సభ తర్వాత బ్రేక్ ఇచ్చిన సీఎం గణేష్ నిమజ్జనం తర్వాత దక్షిణ తెలంగాణ నుంచి ప్రచారాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. దీంతో వీలైనంత త్వరగా బాస్ ను రప్పించుకునేందుకు తెగ కష్టపడుతున్నారు నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories