logo

కన్నడ వేదికగా సంకీర్ణ రంగస్థలం

కన్నడ వేదికగా సంకీర్ణ రంగస్థలం

కర్ణాటక పరిణామాలు, రాబోయే పొత్తులకు పొద్దుపొడుపా...మోడీని గద్దెదించడమే లక్ష్యంగా అన్ని పక్షాలు ఏకమయ్యేందుకు వేదికనిస్తోందా....మూడో కూటమి ప్రయత్నాలకు జోష్‌ నింపుతున్నాయా...లేదంటే కాంగ్రెస్‌ సారథ్యానికి ప్రాంతీయ పార్టీలు జైకొడతాయా? కన్నడ సంకీర్ణ రంగస్థలం సాక్షిగా, పొత్తుల ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి?

కర్ణాటక బలపరీక్షలో కాంగ్రెస్, జేడీఎస్‌ కూటమి గెలుస్తుండటం, రాబోయే పరిణామాలకు సంకేతంగా కనపడుతోంది. 2019లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా, కాంగ్రెస్‌ ఎన్నో నెలల నుంచి అన్ని పక్షాలనూ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. సోనియా గాంధీ విందు రాజకీయం కూడా చేశారు. కానీ కేసీఆర్‌, మమత, శరద్‌ పవార్‌‌, చంద్రబాబు, ఇలా ప్రాంతీయ పార్టీల అధినేతలందరూ, కాంగ్రెసేతర, బీజేపీయేతర మూడో కూటమి రాగాలు తీస్తుండటం, కాంగ్రెస్‌ జట్టుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని కూడా, మమతతో పాటు శరద్‌పవార్ వ్యతిరేకిస్తుండటంతో, యూపీఏ ముందరి కాళ్లకు బంధం వేశాయి. కానీ మొన్నటి యూపీ, బీహార్ బైపోల్, నేటి కర్ణాటక సంకీర్ణ ఫలితం, మూడో కూటమి ఆశలపై నీళ్లు చల్లడమే కాదు, కాంగ్రెస్‌కు కొత్త బలాన్నిస్తున్నాయని విశ్లేషకుల అంచనా.

ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ మొదట ప్రత్యామ్నాయ రాగం అందుకుంది కేసీఆర్. మమత, కరుణానిధి, అఖిలేష్, హేమంత్ సోరెన్‌లను కలిశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన బాగుందని వీరంతా అన్నారు కానీ, కేసీఆర్ కూటమిలో చేరతామని మాత్రం ఖరాకండిగా చెప్పలేదు. ఎందుకంటే, కాంగ్రెస్ లేకుండా ఏ కూటమైనా బతికిబట్టకట్టడం, బీజేపీని ఎదుర్కోవడం కష్టమని మమతా బెనర్జీ నిశ్చితాభిప్రాయం. కర్ణాటకలోనూ, కాంగ్రెస్-జేడీఎస్‌ ముందే జట్టుకట్టి ఉంటే, ఫలితం వేరేలా ఉండేదని మమత అన్నారు కూడా. కేసీఆర్‌ వాదనపైనా వీరికి గురి కుదరలేదు. ఎందుకంటే, తెలంగాణలో టీఆర్ఎస్‌ శత్రుపక్షం కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్‌ కూటమిలో చేరలేరు కేసీఆర్. అలాగని కమలంతోనూ చేయి కలపలేరు. అందుకే కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి నినాదం ఎత్తుకున్నారని మమత, అఖిలేష్‌, స్టాలిన్ అభిప్రాయంగా తెలుస్తోంది.

కర్ణాటకలో బీజేపీ కంగుతినడాన్ని ఎస్పీ, బీఎస్పీ స్వాగతించాయి. డీఎంకే హర్షించింది. ప్రజాస్వామ్యం గెలిచిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్ణాటక పరిణామాలపై ఈ పార్టీలనేతందరూ హర్షం వ్యక్తం చేయడం, త్వరలో కాంగ్రెస్‌ కూటమి గూటికి చేరతాయనడానికి సంకేతమని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అన్యాయంతో పాటు బీజేపీ తనను టార్గెట్ చేయడంపై గుర్రుగా ఉన్న బాబు, కాంగ్రెస్‌తో కలిసినా ఆశ్చర్యంలేదన్న విశ్లేషణలు జోరందుకున్నాయి. ఎన్డీయే మిత్రులనూ కాంగ్రెస్‌వైపు తిప్పే చాణక్యం బాబు సొంతమన్న అంచనాలున్నాయి.

కర్ణాటక పరిణామాల సాక్షిగా, మోడీ వ్యతిరేక పార్టీలు ఒక్కచోటికి చేరేందుకు రెడీగా ఉన్నాయనడానికి, కుమారస్వామి ప్రకటన కూడా దోహదం చేస్తోంది. తన ప్రమాణస్వీకారానికి, అన్ని ప్రాంతీయ పార్టీలనూ ఆహ్వానిస్తున్నానని కుమారస్వామి ప్రకటించారు. అంటే కర్ణాకట వేదికగా కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి సిద్దం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ వామపక్షాల దారే తెలీదు. మొత్తానికి ఒకవైపు కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటూనే, మరోవైపు యూపీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేస్తున్న మోడీ, అమిత్‌షాలపై రగిలిపోతున్న పక్షాలకు, కర్ణాటక ఘటనలు కొత్తదారి చూపిస్తున్నాయి. యూపీ ఉప ఎన్నికలు, కర్ణాటక తాజా పరిణామాలు సమైక్యంగా ఉంటేనే మోడీని ఎదుర్కోగలమన్న విశ్వాసాన్ని కాంగ్రెస్, మిగతా రీజినల్‌ పార్టీల్లో కాన్ఫిడెన్స్‌ నింపుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి కట్టడం అంటే, మూడో ఫ్రంట్‌ ముచ్చట లేనట్టే. అంటే వచ్చే ఎన్నికలు ఆల్‌ పార్టీస్ వర్సెస్ మోడీగా మారబోతున్నాయి.

santosh

santosh

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top