కన్నా నియాకమకంపై కమలనాథుల కన్నెర్ర చేశారా?

కన్నా నియాకమకంపై కమలనాథుల కన్నెర్ర చేశారా?
x
Highlights

బీజేపీ అధిష్టానం ఏపీపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పాగా వేయాలంటే రథసారథి ముఖ్యమని భావించిన అగ్రనేతలు ఎట్టకేలకు అధ్యక్షుడిని ఎంపిక చేశారు. ఎన్నికల...

బీజేపీ అధిష్టానం ఏపీపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పాగా వేయాలంటే రథసారథి ముఖ్యమని భావించిన అగ్రనేతలు ఎట్టకేలకు అధ్యక్షుడిని ఎంపిక చేశారు. ఎన్నికల ఈక్వెషన్స్, కులాల లెక్కలు, ప్రత్యర్ధుల బలహీనతలు, బలాబలాల బేరీజు అనంతరం మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణకు పట్టం కట్టారు. టీడీపీపై దూకుడు స్వరం వినిపించే సోము వీర్రాజును ఎన్నికల నిర్వాహణ కమిటీ కన్వీనర్‌గా నియమించారు.

ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు చందంగా ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఎట్టకేలకు మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ దక్కించుకున్నారు. టీడీపీతో పొత్తు చిత్తైన వేళ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్న అధినాయకత్వం కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మి నారాయణను అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. గత రాజకీయ అనుభవం, విస్తృతమైన అనుచరగణం, రాజధాని అమరావతితో పాటు గోదావరి జిల్లాల్లో మంచి పట్టు ఉండటం కన్నాకు కలిసి వచ్చాయి.

వాస్తవానికి పార్టీ కండువా కప్పుకున్న సమయంలోనే అధ్యక్ష పదవి ఆశించిన కన్నా ... ఎంతకీ పదవి దక్కకపోయేసరికి పార్టీని వీడాలని గత నెలలో నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. చివరి నిమిషంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎంట్రీతో కన్నా చేరికకు బ్రేక్ పడింది. అమిత్ షా బుజ్జగింపుతో పార్టీ మారకుండా ఆగిన కన్నాకు పెద్ద పదవే వరించింది. కన్నాకు అధ్యక్ష బాధ్యతలు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఎన్నికల నిర్వాహణ కమిటీ కన్వీనర్‌ పదవులను అప్పగిస్కతూ మలనాధులు నిర్ణయం తీసుకున్నారు.

సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్న సీనియర్లను కాదని కన్నాకు అధ్యక్ష పీఠం అప్పగించడంపై ఆసక్తికరంగా మారింది. తాజా రాజకీయ పరిస్ధితులు, కులాల లెక్కలు, 2019 ఎన్నికలను పరిగణలోకి తీసుకుని కన్నాను ఎంపిక చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్ధితిలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కన్నా నియామకం అక్కరకు వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి అందించిన సాయంపై త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని కన్నా అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా నియమింతులైన కన్నాతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏకాంత చర్చలు జరిపారు. కాపుల రిజర్వేషన్లతో పాటు ఇతర అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చుతున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు కన్నా జతకలిస్తే రాజకీయ విమర్శలు హోరెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories