మానవత్వం చాటుకున్న జవాన్లు...గర్భిణీని ఏడు కిలోమీటర్లు మోసుకెళ్లిన కూంబింగ్ పార్టీ

x
Highlights

మందుపాతరలు, బాంబు పేలుళ్లు, తుపాకుల మోతలతో నిత్యం రక్తమోడే ఛత్తీస్‌ఘడ్‌లో మానవత్వం పరిమళించింది. నిత్యం తుపాకులతో గర్జించే అటవీ ప్రాంతం మానవత్వ...

మందుపాతరలు, బాంబు పేలుళ్లు, తుపాకుల మోతలతో నిత్యం రక్తమోడే ఛత్తీస్‌ఘడ్‌లో మానవత్వం పరిమళించింది. నిత్యం తుపాకులతో గర్జించే అటవీ ప్రాంతం మానవత్వ విలువను చాటి చెప్పింది. అపక్రటిత యద్ధవాతావరణంలో కంటి మీద కునుకు లేకుండా మావోయిస్టులతో పోరాటం చేస్తే కూంబింగ్ బలగాలు తొలి సారి తమ తుపాకులను పక్కన బెట్టాయి. ఓ గర్భిణి ప్రాణాలు కాపాడేందుకు జవాన్లు చేసిన సాహసం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

కొండగావ్ అటవీ ప్రాంతంలోని హడేలికి చెందిన రుక్మిణికి నెలలు నిండటంతో పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఓ వైపు భారీ వర్షం మరో వైపు సరైన రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో రుక్మిణి భర్త సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీస్ అసిస్టెంట్ కమాండర్‌ ప్రవీణ్‌ కుమార్ తన బృందంలోని జవాన్లను గ్రామానికి పంపి ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. మంచం మీద గర్భిణిని ఉంచి ఏడు కిలోమీటర్ల పాటు మోసుకెళ్లారు.

ఓ వైపు మందుపాతరల మార్గం మరో వైపు చిత్తడి నేలలు ఎప్పుడు ఎటు వైపు నుంచి మావోయిస్టులు దాడి చేస్తారో తెలియని పరిస్ధితి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఓ పార్టీ కూంబింగ్ నిర్వహిస్తూ రక్షణ కల్పిస్తే మిగిలిన వారు గర్భిణీని మోసుకెళ్లారు. ఏడు కిలోమీటర్ల పాటు ఎక్కడా కిందకు దించకుండా జవాన్లు తమ నడక కొనసాగించారు. రెండు గంటల్లోనే రహదారి మార్గానికి చేర్చారు. అంతకు ముందే ఆర్మీ వైద్యులకు ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వడంతో ఘటనా ప్రాంతంలో అంబులెన్స్ సిద్ధం చేశారు. ఆసుపత్రిలో చేర్చిన అనంతరం వైద్యులు ప్రసవం జరిపారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.

ప్రజల రక్షణే కాదు సంరక్షణ ఆపద సమయంలో ఆదుకునే తత్వం తమదని జవాన్లు మరో సారి చాటుకున్నారంటూ స్ధానికులు, చుట్టుపక్కల వారు ప్రశంసలు కురిపించారు. కూంబింగ్‌ను పక్కనబెట్టి గర్భిణీని కాపాడేందుకు చేసిన ప్రయత్నం సైన్యానికి ఎంతో గర్వకారణమంటూ పలువురు కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories