logo
ఆంధ్రప్రదేశ్

కరువు యాత్రను కడదాకా లాగుతారా..మధ్యలోనే రాంరాం చెబుతారా?

కరువు యాత్రను కడదాకా లాగుతారా..మధ్యలోనే రాంరాం చెబుతారా?
X
Highlights

అసలు సేనాధిపతి రణక్షేత్రం ఏమిటి? నాలుగేళ్లు దాటుతున్నా జనసేనకు పార్టీపరమైన సంస్థాగత నిర్మాణం లేదు. జనసేన అంటే...

అసలు సేనాధిపతి రణక్షేత్రం ఏమిటి? నాలుగేళ్లు దాటుతున్నా జనసేనకు పార్టీపరమైన సంస్థాగత నిర్మాణం లేదు. జనసేన అంటే ఇంకా ఒక్క పవన్‌కల్యాణ్‌ మాత్రమే వేదికల మీద కనపడుతున్నాడు. ఇంకా ఆయనలో ఓ క్లారిటీ మిస్‌ అవుతూనే ఉందని ఫ్యాన్స్‌ ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. ఇంతకీ తన ఎజెండా ఏమిటి? సమస్యల కేస్‌ స్టడీ చేస్తున్నానని చెబుతూ జనానికి కనెక్ట్‌ అవుదామనుకుంటున్న పవన్‌ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అన్ని సమస్యలను టచ్‌ చేసి చూడు... అన్నట్టుగానే కరువు యాత్రలో కూడా క్లారిటీ మిస్‌ అవుతారా? కన్ఫ్యూజన్‌ లేకుండా ముందుకు సాగుతారా?

ఏదో ఆవేశం వచ్చినప్పుడో.... ప్రజల్లోకి వెళ్లాలన్న మూడ్‌ వచ్చినప్పుడో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడితే నిలదొక్కుకోవడం కష్టమే. ఇది ఏ రాజకీయ నాయకుడికైనా వర్తించే సూత్రం. ట్వీట్లతో రాజకీయం చేయాలన్నా... తానింకా పార్ట్‌టైమర్నేనని చెప్పుకున్నా... రాజకీయ రణక్షేత్రంలో రాణించలేననుకున్నారు పవన్‌. మంచిదే. స్టెప్‌ తీసుకున్న తర్వాత ఇక మాట తప్పనని, మడమ తిప్పనని మొన్నటి కరీంనగర్‌ సభలో కదంతొక్కిన పవన్‌కల్యాణ్‌... ఆ దిశగా ప్రజాపోరాట మార్గాన్ని ఎంచుకున్నాడు. పార్ట్‌టైమర్‌ నుంచి ఫుల్‌టైమర్‌గా మారిన పవన్‌క్యలాణ్‌ ఇప్పటికైనా తను చెప్పే విషయాలపై క్లారిటీ మిస్‌ అవకుండా చూసుకోవాలన్నదే అభిమానుల ఆకాంక్ష.

ఒక సినిమా ఓపెనింగ్‌ బాగుండాలంటే... ఫ్యాన్స్‌ కావాలి. ఏ హీరోకు ఉండాల్సిన ఫ్యాన్స్‌ వాళ్లకుంటారు. కానీ అదే మూవీని గ్రాండ్‌ సక్సెస్‌ చేయాలంటే మాత్రం కావల్సింది ప్రేక్షకబలం. అలాగే రాజకీయాలను ఫైనల్‌గా టచ్‌ చేయాలంటే... ఆ రుచిని ఆస్వాదించాలంటే ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే ఆ తపన ఉండాలి. మరి పవన్‌కల్యాణ్‌కు ఉన్న బలమేంటి? శాశ్వతంగా రాజకీయాల్లో రాణించాలంటే ఏం చేయాలి? ఇంతకు ముందు అన్నింటిని ఇలా టచ్‌ చేసి అలా వదిలి పెట్టినట్టు... అనంతపురం కరువు యాత్రను కడదాకా లాగుతారా? మధ్యలోనే రాంరాం చెబుతారా.? ఇప్పుడివే సగటు అభిమానులను, జనసైనికులను వెంటాడుతున్న ప్రశ్నలు.

హీరో స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే అందుకు ఎంతో కృషి కావాలి. నిరంతరం ప్రజల్లో ఉండాలి. కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. వెండితెరపై తనను చూసి ఈలలు వేసి గోల చేసే అభిమానులంతా ఓటరే అనుకుంటే కచ్చితంగా పొరపడినట్టే. ఎన్టీఆర్‌ నుంచి ఎంజీఆర్, జయలలిత ఇలా సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు రాజకీయాల్లోకి ఎంటర్‌ అయిన తర్వాత అందులోనే మునిగి తేలారు. ఇవన్నీ గమనించి, పరిశీలించి ఇక తాను పూర్తిస్థాయి పొలిటికల్‌ లీడర్‌ అనుకొని తెలంగాణ నుంచి తన రాజకీయయాత్ర మొదలు పెట్టిన పవన్‌కల్యాణ్‌ తన ప్రయాణాన్ని ఎంతవరకు సాగిస్తాడన్నదే అందరిలోనూ ఆసక్తికరమైన చర్చ.

సినిమాలు వేరు... రాజకీయాలు వేరు. వెండితెరపై ఆదరించిన అభిమానులే... రాజకీయాల్లోకి వచ్చాక అభిమాన హీరోలను ఈసడిస్తుండొచ్చు. తాను వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతీ మాట ఇందుకు కారణమవుతుందన్న విషయం తెలుసుకుంటే... రాణించడానికి ఓ అవకాశం ఉంటుంది. నిజానికి జనంలో ఉండటమంటే... రంగుల ప్రపంచంలో బతకడం కాదు. విమర్శలను, ఆరోపణలను సమర్థంగా ఎదుర్కొవాలి. అన్నింటికి మించి సత్తా చాటగలగాలి. రాజకీయ తెరపై విజేయుడిగా రాణించాలంటే... అంతకుముందున్న హీరోయిజాన్ని పక్కన పెట్టాల్సిందే. కానీ పవన్‌కల్యాణ్‌లో ఆ సంయమనం, ఆ సహనం ఇంకా కనిపించట్లేదంటున్నారు అభిమానులు. మొన్న ఖమ్మం పర్యటన సమయంలో చిన్న విషయానికే అసహనానికి గురై మధ్యలోనే వెళ్లిపోవడాన్ని దాన్ని ఉదహరిస్తున్నారు.

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు అటు ఇటు పోరాడి ఓ కొలిక్కి తెచ్చారు పవన్‌. ఈ రకంగా ఆయన ఉత్తరాంధ్రలో కాస్త క్రేజ్‌ సంపాదించారనే చెప్పాలి. అదే రాజధాని రైతుల సమస్యను ఇలా టచ్ చేసి అలా వదిలేశారు. పోలవరం పరిస్థితీ అంతే. కానీ... అనంతపురం కరువు యాత్ర మాత్రం ఇలా కొనసాగించొద్దంటున్నారు జనసేన కార్యకర్తలు. పార్టీకి ఆయువుపట్టు అనంతపురమేనని గతంలో ప్రకటించిన పవన్‌కల్యాణ్‌... నాలుగేళ్ల పార్టీని సుదీర్ఘయాత్ర చేయించాలని వారు కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా పవన్‌కల్యాణ్‌ అడుగులు వేస్తారా? పూర్తిస్థాయి నాయకుడై నడిపిస్తారా? కాలం చెప్పే ఈ సమాధానం కోసం వేచిచూడాలి.

Next Story