దౌత్య యుద్ధంలో మనదే విజయం

దౌత్య యుద్ధంలో మనదే విజయం
x
Highlights

భారత్ - పాకిస్థాన్... ఈ రెండు దేశాలు 1947లో వేరు పడినప్పటి నుంచి రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతూనే వస్తోంది. ఒకసారి యుద్ధం, మరోసారి దాదాపు చిన్నపాటి...

భారత్ - పాకిస్థాన్... ఈ రెండు దేశాలు 1947లో వేరు పడినప్పటి నుంచి రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతూనే వస్తోంది. ఒకసారి యుద్ధం, మరోసారి దాదాపు చిన్నపాటి యుద్ధం లాంటి కార్గిల్ ఘటన, ఇంకోసారి సర్జికల్ స్ర్టైక్స్.. ఇలా తరచూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్.. రెండు దేశాలతోనూ భారతదేశానికి సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇద్దరూ మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూడటమే అందుకు ప్రధాన కారణం. భారతదేశం కావాలని ఏ దేశంతోనూ శత్రుత్వం కొని తెచ్చుకోదు. పైపెచ్చు దాదాపు అందరితోనూ కాస్తలో కాస్త సత్సంబంధాలే కొనసాగిస్తుంది. కానీ పక్కనే ఉంటూ పక్కలో బల్లెంలా మారిన ఈ రెండు దేశాలు మాత్రం మనకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దానికితోడు.. శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లు ఇటీవలి కాలంలో చైనా, పాకిస్థాన్ కూడా భాయీభాయీ అనుకుంటూ భుజాలు రాసుకుని తిరుగుతున్నాయి.

సిల్క్ కారిడార్ అంటూ కొత్తకొత్త వ్యవహారాలు, వాణిజ్యాల కోసం చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ రెండు దేశాలూ మన దేశాన్ని రెచ్చగొడుతూ యుద్ధానికి సై అంటున్నాయి. నిన్న మొన్నటి వరకు చైనాతో సిక్కింలోని డోక్లాం ప్రాంతంలో దాదాపు యుద్ధమేఘాలు కమ్ముకునే ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఆ పరిస్థితులు క్రమంగా దూరమయ్యాయి. అదృష్టం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. యుద్ధం అంటూ వస్తే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేదాంతో సంబంధం లేకుండా అందరూ సర్వనాశనం అవుతారు.

యుద్ధంతో ఆత్మ వినాశమే: రెండు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ధరలకు అడ్డు అదుపు ఏమాత్రం ఉండదు. పెట్రోలు దగ్గర నుంచి నిత్యావసరాల వరకు అన్నీ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈ రెండు దేశాలతో భౌతికంగా ఏమాత్రం సంబంధం లేకపోయినా వాణిజ్యపరంగా సంబంధాలున్న దేశాల్లో కూడా ఇబ్బందులు తప్పవు. గల్ఫ్ యుద్ధానికి ముందు, ఆ తర్వాత పెట్రోలు ధరల్లో వచ్చిన మార్పే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. నిజానికి ఆ యుద్ధం అంతా మనకు సంబంధం లేని ప్రాంతాల్లో జరిగింది. కానీ అంతకుముందు లీటరు 20 రూపాయలుండే పెట్రోలు ఒక్కసారిగా రెట్టింపు అయిపోయింది. ఇలా యుద్ధాల వల్ల ఒక మాదిరిగా ఉండే ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతాయి.

సరిగ్గా ఈ విషయాన్ని నూటికి నూరుపాళ్లు అర్థం చేసుకున్న భారతదేశం.. ఇప్పుడు పాకిస్థాన్‌తోగానీ, చైనాతోగానీ యుద్ధానికి దిగడం అంత తెలివైన నిర్ణయం కాదని భావిస్తోంది. వీలైనంత వరకు దౌత్యపరంగానే వివాదాలు పరిష్కరించుకోవాలని చూస్తోంది. అవసరాన్ని బట్టి దౌత్య విధానం విషయంలో దూకుడు ప్రదర్శించాలా, లౌక్యంగా ఉండాలా.. ఏయే దేశాలతో ఎలాంటి విధానాలు అనుసరించాలి అన్న అంశాన్ని అత్యంత జాగ్రత్తగా డీల్ చేస్తోంది. ఇందుకు మంచి ఉదాహరణ చైనా, పాకిస్థాన్‌లతో మన దేశం అనుసరిస్తున్న విధానమే. చైనా మీద మనం అటు దౌత్యపరంగా గానీ, ఇటు సైనికపరంగా గానీ పెద్దగా గెలిచే పరిస్థితి లేదు. తనకున్న బలం, బలగం దృష్ట్యా చైనా మనకంటే పెద్దస్థాయిలో ఉందని చెప్పుకోక తప్పదు. అందుకే ముళ్ల కంప మీద చీర పడినప్పుడు ఎంత జాగ్రత్తగా దాన్ని తీయాలో.. అంతే జాగ్రత్తగా చైనా బారినుంచి మనం తప్పించుకోగలిగాం.

బతిమాలారో, బెదిరించారో, మరేం చేశారో గానీ.. ఆ దేశంతో మనకు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు మాత్రం రాలేదు. ఇది చాలావరకు అభినందించాల్సిన విషయం. ఎందుకంటే, డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు రాజ్యమేలుతున్న సమయంలో కూడా అప్పటి భారత వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బీజింగ్ వెళ్లి, అక్కడ ఆ దేశానికి చెందిన పారిశ్రామిక వర్గాలతో చకచకా ఒప్పందాలు చేసుకుని వచ్చేశారు. దాంతో చైనా కూడా తమకు ఆధిపత్యం కంటే వ్యాపార ప్రయోజనాలు ముఖ్యమని గుర్తించింది. పొరుగు దేశం ఒకవైపు మేకిన్ ఇండియా అని చెబుతున్నా, తమకు కూడా తగినంత ప్రాధాన్యం ఇస్తోందని, చైనా నుంచి పెద్ద సంఖ్యలో దిగుమతులు చేసుకుంటోందని, ఒకవేళ యుద్ధం వస్తే ఆ మార్కెట్ మొత్తం ఆగిపోతుందని తెలుసుకుంది.

నిజానికి చైనా తర్వాత ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న భారతదేశం.. అందరికీ మంచి మార్కెట్ లాగే కనపడుతుంది. అలాంటి మార్కెట్‌ను వదులుకోవడం అంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదు. ఒకవైపు శత్రుత్వం అంటూ తాము కాలు దువ్వుతున్నా మరోవైపు భారత్ మాత్రం తమతో వాణిజ్య బంధాలకు ప్రాధాన్యం ఇస్తోందన్న సంకేతాలు నిర్మలా సీతారామన్ పర్యటనతో కనిపించాయి. అంతే.. ఆ తర్వాత ఒక్కసారిగా చైనా తీరులో మార్పు వచ్చింది. అప్పటివరకు దూకుడు ప్రదర్శించిన డ్రాగన్.. ఆ తర్వాత నెమ్మదిగా ఊరుకుంది. అలా ఆ విషయంలో మనం కొంతవరకు దౌత్య విజయం సాధించినట్లే అయ్యింది. నిజానికి ఆ సమయంలోనే చైనాతో మనకు యుద్ధం వస్తే.. మన ఆయుధ సామగ్రి ఎంతవరకు దాన్ని తట్టుకోగలిగే స్థితిలో ఉందన్నది కూడా అనుమానమే. ఇంకా చాలావరకు దిగుమతులు పూర్తి కావాల్సి ఉంది. అందుకే యుద్ధమేఘాలు కమ్ముకోవడం అంత మంచిది కాదని దౌత్యమార్గంలో పని సులభం చేసుకున్నాం.

ఈంట్‌కా జవాబ్ పత్తర్ సే: ఇక పాకిస్థాన్ విషయానికొస్తే మాత్రం దౌత్యమార్గంలోనే అయినా.. ఏమాత్రం తగ్గకుండా భారత్ పూర్తిస్థాయి దూకుడు ప్రదర్శిస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి విధానాన్ని మనం అనుసరించలేదు. అంతర్జాతీయ వేదికల మీద పాక్ దురాగతాలను పరోక్షంగా ఎండగట్టడమే తప్ప.. ప్రత్యక్షంగా దునుమాడలేదు. చెప్పాల్సి వచ్చినా తమలపాకుతో సుతారంగా కొట్టినట్లే ఉండేది తప్ప గట్టిగా నాలుగు తగిలించింది లేదు. కానీ, ఇటీవలి కాలంలో మాత్రం పాకిస్థాన్ విషయంలో మన దౌత్య విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. ‘ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే’ అంటున్నారు. అంటే.. అవతలివాడు ఇటుకతో ఒక దెబ్బ వేస్తే మనం నాలుగు బండరాళ్లు వాడి నెత్తిన వేస్తామని అర్థం. అంతర్జాతీయ వేదికలలో పాకిస్థాన్ ప్రస్తావన తేకూడ దని ఇతర దేశాలు షరతులు పెట్టినా ఆ ఒక్క పేరు మాత్రం ప్రస్తావించకుండా వదిలేసి, ఆ దేశం చేస్తున్న పాపిష్టి పనులన్నింటినీ ఏకరువు పెడుతూ, చివరకు అందరినీ ఆ విషయంలో ఒప్పిస్తున్నా రు. ఇటీవల జరిగిన బ్రిక్స్ దేశాధినేతల సదస్సు సమయంలో కూడా చైనా మనకు ఇలాగే చెప్పింది. అయితే, చివరకు ఉగ్రవాదానికి ఊతం ఇస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలను ఇతర దేశాలన్నీ బహిష్కరించాలని ప్రధాని నరేంద్రమోదీ గట్టిగా చెప్పడంతో పాటు దానిపై తీర్మానం చేయాలని పట్టుబట్టడంతో చివరకు చైనాయే స్వయంగా ఆ తీర్మానం చేయాల్సి వచ్చింది. ఇక అప్పటినుంచి భారత్ చెలరేగిపోతోంది.

పాకిస్థాన్ మీద అప్రకటిత దౌత్య యుద్ధం చేస్తూ ఎక్కడ దొరికితే అక్కడే చీల్చి చెండాడుతోంది. తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో కూడా అదే జరిగింది. అసలది అసలు సిసలైన ఉగ్రవాద భూమి అని, అది పాకిస్థాన్ కాదు టెర్రరిస్థాన్ అని ఘాటుగా స్పందించింది. రైట్ ఆఫ్ రిప్లై కింద పాకిస్థాన్కు దిమ్మదిరిగే సమాధానమిచ్చింది. ఐక్య రాజ్య సమితికి భారత్ తరఫున ఫస్ట్ సెక్రటరీగా ఉన్న ఈనామ్ గంభీర్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడారు. పాకిస్థాన్ ఇప్పుడు టెర్రరిస్థాన్, అక్కడ అంతర్జాతీయ ఉగ్రవాదం వర్ధిల్లుతోందని కుండబద్దలుకొట్టారు. ఉర్దూలో పాక్ అంటే స్వచ్ఛమైనది అని అర్థమని, కానీ అందుకు తగినట్లు ఉండటం ఆ దేశం ఎప్పుడో మరచిపోయిందని, పాక్ అనే పదం ఉగ్రవాదానికి నిర్వచనంలా మారిపోయిందని ఆమె చెప్పారు.

పాకిస్థాన్ తనకున్న కాస్త చరిత్రలోనే అంతర్జాతీయ ఉగ్రవాదానికి మారుపేరుగా మారిందని ఈనామ్ అన్నారు. గురువారం ఇదే జనరల్ అసెంబ్లీ వేదికగా తన తొలి ప్రసంగాన్ని వినిపించిన పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీకి భారత్ బదులిచ్చింది. అబ్బాసీ తన ప్రసంగంలో ఉగ్రవాదాన్ని సమర్థించడంతోపాటు మరోసారి కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ తెరపైకి తెచ్చారు. వాస్తవానికి కశ్మీర్ అంశం కేవలం ద్వైపాక్షికమని, ఇందులో మూడోపక్షం జోక్యానికి ఏమాత్రం ఆస్కారం లేదని భారత్ ఎప్పటినుంచో చెబుతోంది. అయినా పాక్ మాత్రం పదేపదే ఇదే పని చేస్తోంది. కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణకు అబ్బాసీ డిమాండ్ చేశారు. ఓ కమిషన్‌ను కశ్మీర్‌కు పంపించాలని కోరారు. దాంతో ఆయన వాదనను భారత్ తిప్పికొట్టింది.

లాడెన్, ముల్లా ఒమర్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశం.. తామే ఉగ్రవాద బాధితులమని ఏడవడం ఏంటని ఈనామ్ ప్రశ్నించారు. ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్థాన్‌లోనే పట్టుకుని అమెరికన్ నేవీ సీల్స్ హతమార్చిన విషయం అన్ని దేశాలకూ తెలియడంతో ఇక దాన్ని కాదనలేని పరిస్థితి పాకిస్థాన్‌కు ఏర్పడింది. ఒకవైపు తాలిబన్లు, మరోవైపు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలన్నింటికీ పాకిస్థానే కేంద్రంగా ఉందన్న విషయాన్ని ఈనామ్ గట్టిగా చెప్పడంతో ఇక నోరెత్తలేని పరిస్థితి పాక్‌కు వచ్చింది. దాంతో భారత్ మరోసారి పాకిస్థాన్ విషయంలో దౌత్యవిజయం సాధించినట్లయింది. అంతేకాదు.. పాక్ విషయంలో భారత్ మరోవిధంగా కూడా పైచేయి సాధించింది.

దౌత్య విజయం: కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, ఆ విషయాన్ని భారతదేశంతోనే పాక్ తేల్చుకోవాలని ఐక్యరాజ్యసమితి సాక్షిగా చైనా చెప్పింది. ఇన్నాళ్ల పాటు పాకిస్థాన్‌కు అన్ని విషయాల్లో గట్టి మద్దతుదారుగా నిలిచిన చైనా ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా చెప్పడంతో.. పాక్ షాక్ తింది. కశ్మీర్ వివాదం ద్వైపాక్షిక సమస్య అన్న భారత విధానానికే చైనా కూడా మద్దతిచ్చింది. ఐక్యరాజ్య సమితి సమావేశం నేపథ్యంలో ఈ అంశంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ సమస్యపై చైనా వైఖరి సుస్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. అది చరిత్ర వదిలేసిన సమస్య అన్నారు.

భారతదేశం, పాకిస్థాన్ పరస్పరం చర్చలు జరుపుకోవాలని, సంబంధిత సమస్యలను సరైన రీతిలో పరిష్కరించుకోవాలని, శాంతి, సుస్థిరతలను కాపాడుకోవాలని తెలిపారు. దాంతో పాకిస్థాన్‌కు దిమ్మ తిరిగింది. ఇన్నాళ్లూ చైనా అండగా ఉందన్న ఏకైక ధీమాతోనే పాక్ రెచ్చిపోతోంది. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా నీరుగారిపోయింది. దాంతో ఇక అన్నివైపుల నుంచి ఓటమి తప్పలేదని అర్థమై తోకముడవాల్సి వచ్చింది. ఈ రకంగా దౌత్య క్షేత్రంలో భారత్ ప్రదర్శించిన దూకుడు అన్నిరకాలుగా మంచి ఫలితాలనిచ్చింది. యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండానే శత్రువు మీద విజయం సాధించడం, బోలెడంత ధన, ప్రాణ నష్టాలను నివారించడం, దేశాన్ని పెద్ద ఆర్థిక సంక్షోభం బారి నుంచి కాపాడటం.. ఇన్ని లక్ష్యాలను ఒకేసారి సాధించినట్లయింది.

చంద్రశేఖర శర్మ

Show Full Article
Print Article
Next Story
More Stories