logo
జాతీయం

ఆగస్టు నుంచే ఆయుష్మాన్‌ భారత్‌!

ఆగస్టు నుంచే ఆయుష్మాన్‌ భారత్‌!
X
Highlights

దేశవ్యాప్తంగా వైద్యబీమా సంరంభం మొదలవుతోంది. దేశంలోని 50 కోట్ల మంది పేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు తాజా...

దేశవ్యాప్తంగా వైద్యబీమా సంరంభం మొదలవుతోంది. దేశంలోని 50 కోట్ల మంది పేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు తాజా బడ్జెట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం భారీస్థాయిలో ‘జాతీయ ఆరోగ్య బీమా’ పథకాన్ని తెర మీదికి తెచ్చింది. వాస్తవానికి ఇదే తరహా పథకం మన తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్‌ వైద్యసేవ పేరిట గత 11 ఏళ్లుగా అమలవుతోంది. ఇలా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత ఆరోగ్య బీమా పథకాలను పరిశీలించాకే తాము కేంద్ర పథకానికి రూపకల్పన చేసినట్టు నీతిఆయోగ్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రాల్లో ఈ వైద్య బీమా సేవలపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైనదిగా భావిస్తోన్న ‘ఆయుష్మాన్‌ భారత్‌’ ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పథకం. జాతీయ ఆరోగ్య భద్రత పథకం పేరుతో అమలుచేయబోయే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ‘మోడీ కేర్‌’గా కూడా వ్యవహరిస్తున్నారు. తొలి దశలో 10 కోట్ల నిరుపేద కుటుంబాలు లేదా 50 కోట్ల మంది ప్రజలు దీని పరిధిలోకి వస్తారు. జబ్బుపడిన వారికి 5 లక్షల విలువైన ఆరోగ్యసేవలను పూర్తి ఉచితంగా అందిస్తారు.

వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర చికిత్సలు నిరుపేదలకు అందని ద్రాక్ష పండే అవుతోంది. మధ్య తరగతి ప్రజలు సైతం కుటుంబ సభ్యులకు అనూహ్యమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆ ఖర్చులను భరించటానికి తలతాకట్టుపెట్టాల్సి వస్తోంది. దేశంలో సాలీనా ఆరోగ్య సేవల కోసం 5లక్షల కోట్లు ఖర్చవుతోంది. 60% మందికిపైగా ప్రజలు చికిత్సల కోసం సొంతంగానే డబ్బు ఖర్చుచేస్తున్నారు. ప్రపంచంలో ఇంత పెద్దస్థాయిలో ప్రజలు ఎక్కడా ఆరోగ్య సేవల కోసం ఖర్చు చేయడంలేదు. ఈ పరిస్థితి నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య భద్రత పథకాన్ని తీసుకొస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆర్‌ఎస్‌బీఐ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఉచిత ఆరోగ్య బీమా పథకాలను పరిశీలించిన అనంతరం కేంద్రం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమైందని నీతిఆయోగ్‌ సభ్యుడు వినోద్‌పాల్‌, సీఈఓ అమితాబ్‌కాంత్‌లు వెల్లడించారు. ఈ పథకం భారత ఆరోగ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ పథకాన్ని తొలి దశలో 50 కోట్ల మందితో ప్రారంభించి.. అంతిమంగా 130 కోట్ల మందికి దీన్ని విస్తరించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. మరి ఈ ‘ఆయుష్మాన్‌ భారత్‌’ రాకతోనైనా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశిద్దాం.

అత్యంత ఖరీదైన వైద్య సేవలను సైతం పేద ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని సాధ్యమైనంత త్వరగా అమలుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద 2011 నాటి సామాజిక, ఆర్థిక, కుల జనాభా గణన ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. దీనికి లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పథకంలో పేరు నమోదు చేసుకున్న లబ్ధిదారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. అయితే, దేశంలోని కొన్నిరాష్ట్రాలు 2 లక్షలు, మరికొన్ని 3 లక్షల వరకు బీమా కల్పిస్తుండగా...5లక్షల ప్రయోజనం కల్పించడం దేశంలో ఇదే మొదటిసారి.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకానికి 2011 నాటి సామాజిక ఆర్థిక కుల జనాభా గణన ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ గణనలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి వివరాలు పక్కగా ఉన్నాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆ సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు ఈ ఎస్‌ఈసీసీ లెక్కలతో విభేదిస్తున్నందున అలాంటి రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరిపి ఒక ప్రామాణిక డేటాను ఖరారు చేస్తుంది. దాని ఆధారంగా పథకాన్ని అమలుచేస్తారు.

‘ఆయుష్మాన్‌ భారత్‌’ కింద ప్రతి కుటుంబానికి 5లక్షల వార్షిక వైద్య ఖర్చులు చెల్లిస్తారు. కుటుంబ సభ్యుల గరిష్ఠ సంఖ్యపై పరిమితి లేదు. ఎంతమంది అయినా ఉండొచ్చు. కుటుంబం మొత్తానికి 5 లక్షలయినా, లేదంటే ఒకే వ్యక్తికి 5 లక్షలయినా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఈ పథకం కింద లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఆ మొత్తాన్ని సమకూరుస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఈ వాటా 90:10 నిష్పత్తిలో ఉంటుంది.

ఆరోగ్య పథకంలో పేరు నమోదుచేసుకున్న లబ్ధిదారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఉచిత వైద్యసేవలు పొందొచ్చు. ఒక రాష్ట్రంలో చిరునామా ఉన్న వ్యక్తి పనిమీద దేశంలో ఏదైనా ప్రాంతానికి వెళ్లి అనారోగ్యానికి గురయితే అక్కడే వైద్యసేవలు పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. అందుకయ్యే ఖర్చును అతని సొంత రాష్ట్రం చెల్లిస్తుంది. అన్నిరకాల తీవ్రమైన వ్యాధులు, ప్రమాదం, అత్యవసర సేవలను దీని కిందికి తెస్తారు. అన్నిరకాల మాధ్యమిక, సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఇందులో అవకాశం కల్పిస్తారు.

అయితే,ఈ పథకం వల్ల ప్రైవేటురంగానికి ఎక్కువ లబ్ధిచేకూరి ప్రభుత్వ వైద్య రంగం బలహీనపడుతుందన్న వాదన ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని అంగీకరించడంలేదు. ఇక్కడ ప్రైవేటు, పబ్లిక్‌ అన్న తేడా లేదని ఎక్కడ మెరుగైన వైద్యసేవలు అందితే రోగి అక్కడి వెళ్తాడని, రోగి వెళ్లిన ఆస్పత్రికే డబ్బు వెళ్తుందని పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వరంగం కూడా తన శక్తిసామర్థ్యాలను పెంచుకొని ప్రైవేటుతో పోటీపడే పరిస్థితి వస్తుందని విశ్వసిస్తోంది.

Next Story