హైదరాబాద్‌లోని జూపూడి ప్రభాకర్ ఇంట్లో పోలీసుల సోదాలు

x
Highlights

ప్రచారం ముగిసింది.. ప్రలోభాలకు తెరలేచింది. తెలంగాణలో మరికొన్ని గంటల్లో పోలింగ్‌ జరగనుండగా.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. పార్టీలన్నీ పక్కదార్లు...

ప్రచారం ముగిసింది.. ప్రలోభాలకు తెరలేచింది. తెలంగాణలో మరికొన్ని గంటల్లో పోలింగ్‌ జరగనుండగా.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. పార్టీలన్నీ పక్కదార్లు తొక్కుతున్నాయి. మందు, మనీతో ఓట్లను గంపగుత్తగా తమ అకౌంట్లో వేసుకునేందుకు తప్పుదారి పడుతున్నాయి. ఓటుకింత రేటు కట్టి.. అడ్డంగా కొనేస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడటం.. కలకలం రేపుతోంది.

ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. పోలింగ్‌కు ముందు అన్ని పొలిటికల్‌ పార్టీలు ఓటర్లపై నోట్ల కట్టలను కుమ్మరిస్తున్నాయి. మందులో ముంచేస్తున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియగా ఆ తర్వాతే అసలు సినిమా స్టార్ట్‌ చేశారు. ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునేందుకు ఓటర్లకు డబ్బులను ఇష్టానుసారం పంచుతున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో టీడీపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ జూపూడి ప్రభాకర్‌ ఇంట్లో పోలీసుల సోదాలు చేశారు. బాలాజీనగర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు చేసే సమయంలో ఇంటి వెనుక ద్వారం గుండా డబ్బుల సంచితో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. అయితే అక్కడే ఉన్న టీఆర్ఎస్‌ కార్యకర్తలు వారిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి సమక్షంలోనే పోలీసులు సంచిని తెరవగా అందులో 17 లక్షలకు పైగా నోట్ల కట్టలు వెలుగుచూశాయి.

దీంతో జూపూడీని అరెస్ట్ చేయాలంటూ టీఆర్ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో ఆయన నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే తన ఇంట్లో మాత్రం ఎలాంటి డబ్బు దొరకలేదని జూపూడి చెబుతున్నారు. ఎక్కడో బయట దొరికిన డబ్బులను తనవని చెప్పడం సరికాదన్న ఆయన ఇది దళితుడిని వేధించే కుట్ర అని ఆయన చెప్పారు. మరోవైపు వరంగల్ జిల్లా కాజీపేట మండలంలో 3 కోట్ల 30 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ప్రాంతానికి చెందిన గోపాలరావు అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను సీజ్ చేశారు.

అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న చీరల గోదాములపై పోలీసులు దాడులు చేశారు. ఈ సోదాల్లో 2 వేల 200 చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు టిఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సీజ్ చేసిన చీరల విలువ 8 లక్షల వరకు ఉంటుందని అడిషనల్ డిసిపి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories