ప్లీనరీలో పసందైన వంటలు

x
Highlights

పార్టీ ప్రతినిధుల సభకు గులాబీపార్టీ రెడీ అవుతోంది. ఈ నెల 27న కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ జరగనుంది. సమావేశంలో చర్చించనున్న...

పార్టీ ప్రతినిధుల సభకు గులాబీపార్టీ రెడీ అవుతోంది. ఈ నెల 27న కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ జరగనుంది. సమావేశంలో చర్చించనున్న తీర్మానాలు కొలిక్కివచ్చాయి. ఇక సమావేశానికి వచ్చే వారందరికి పసందైన వంటకాలు వడ్డించేందుకు మెనూ కూడా సిద్ధమైంది. ఘుమఘుమలాడే 27 రకాల రుచికరమైన తెలంగాణ వంటకాలు వడ్డించనున్నారు.

మటన్ బిర్యాని.. ధమ్ చికెన్ ఫ్రై.. నాటుకోడి పులుసు.. ముర్రెల ఫిష్ ఫ్రై.. ప్రత్యేక కూరగాయల భోజనం.. పచ్చిపులుసు.. మరెన్నో ప‌సందైన వంట‌కాలు.. వింటుంటూనే నోరూరుతుంది కదూ... ఇదేదో హోట‌ల్ మెనూ కాదు.. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు వడ్డించే వంటల జాబితా. ప్లీనరి సమావేశానికి సుమారు 15 వేలమంది హాజరయ్యే అవకాశం ఉండటంతో... గులాబీ పార్టీ అందుకు త‌గిన‌ట్టే భోజ‌నాలు సిద్ధం చేస్తోంది.

ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం భోజన ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. సుమారు 15 వేల ప్రతినిధుల వరకు వస్తారని అంచనా వేసినా.. 20 వేల మందికి సరిపోయేలా రుచికరమైన వంటలను చేయించనున్నారు. వీవీఐపీలు, వీఐపీలు, మీడియా, సెక్యూరిటి సిబ్బందికి వేరువేరుగా డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. వేదిక ప్రాంగణంలో మొత్తం 8 భోజనశాలలను ఏర్పాటు చేస్తున్నారు.

ప్లీనరిలో వడ్డించే మెనూపై గులాబీపార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అచ్చ తెలంగాణ రుచులతో భోజనాలు వడ్డించనున్నారు. మటన్ బిర్యానీ, ధమ్ చికెన్ ఫ్రై, మటన్ షారువా, ముర్రెల ఫిష్ ఫ్రై, రొయ్యల ఫ్రై, ఎగ్ పులుసు, నాటుకోడి పులుసు, మటన్ దాల్చా... ఇలా అనేక నాన్ వెజ్ ఐటమ్స్ మెనూలో ఉన్నాయి. శాకాహారుల కోసం వెజ్ బగారా రైస్, మిర్చి కా సాలన్, ఆలూ టమాట కర్రీ, గంగబావి యంజి దాల్, గ్రీన్ సలాడ్, అనియన్ సలాడ్, పప్పుచారు, పచ్చిపులుసు తదితర ఐటమ్స్ వడ్డించనున్నారు. ఫ్లమ్ కేక్ ఐస్ క్రీం, ఫైనాపిల్ ఫెర్ని స్వీట్, ఫ్రెష్ కట్ ప్రూట్స్ అందించనున్నారు.

ప్లీనరి ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. వేదిక ప్రాంగణం, భోజనశాలలు, ప్రతినిధులు కూర్చునే ప్రాంతాన్ని పరిశీలించారు. సుమారు 15 వేలమందికి పైగా పార్టీ ప్రతినిధుల సభకు రానుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. వేసవికాలం కావడంతో ప్రతినిధులకు మంచినీటి క్యాన్స్, వాటర్ బాటిల్స్, మజ్జిగ, అంబలిని అందుబాటులో ఉంచనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories