31 గంటల విచారణలో..150 ప్రశ్నలు...ఐటీ అధికారులకు ధీటైన సమాధానమిచ్చిన రేవంత్

x
Highlights

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ, ఈడీ సోదాలు ముగిసాయి. రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించిన 15...

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ, ఈడీ సోదాలు ముగిసాయి. రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించిన 15 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండున్నర కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న అధికారులు .... రేవంత్ నివాసంలోని రెండు కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లు , ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. దీంతో పాటు సోదాల్లో లభ్యమైన పత్రాలను మూడు సూట్‌కేసుల్లో తరలించారు.

తనిఖీల సందర్భంగా రేవంత్‌ రెడ్డిని ఈడీ,ఐటీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. బృందాలుగా విడిపోయిన అధికారులు... విడతల వారిగా రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. 31 గంటల పాటు రేవంత్‌ రెడ్డి, ఆయన సతీమణి గీతను ఐటీ అధికారులు ప్రశ్నించారు. డొల్ల కంపెనీలు, విదేశీ అకౌంట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణకోసం ఢిల్లీ, బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన అధికారులు 2009, 2014 ఎన్నికల అఫిడవిట్లలోని వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ విచారించారు. ప్రధానంగా సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్‌పై ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ సంస్ధ నుంచి మూడు వందల కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తున్న అధికారులు విదేశీ లావాదేవీలపై ప్రశ్నలు గుప్పించారు. అయితే సాయి మౌర్యతో తనకెలాంటి సంబంధం లేదన్న రేవంత్‌ రెడ్డి తన భార్య గీతకు ఇందులో కేవలం భాగస్వామ్యం మాత్రమే ఉందన్నారు .

విదేశాల్లోని రేవంత్‌ రెడ్డి అకౌంట్లపై ఈడీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. అయితే తనకు విదేశాల్లో ఒక్క అకౌంట్ కూడా లేదని భారత పౌరసత్వమున్న తనకు విదేశాల్లో అకౌంట్లు ఎలా ఉంటాయని ప్రశ్నించినట్టు సమాచారం. వివిధ సంస్ధల నుంచి వ్యక్తిగత అకౌంట్లలోకి డబ్బు ఎందుకు వచ్చి చేరిందన్న ఉన్నతాధికారుల ప్రశ్నలకు రేవంత్ తీవ్రంగా స్పందిచనట్టు తెలిసింది. వ్యాపార లావాదేవీల వ్యవహారాలు ఆడిటర్లకు తెలుసన్న రేవంత్ రెడ్డి తనకు తెలిసింది మాత్రమే చెబుతానన్నారు. మీరు కోరుకున్న సమాధానం చెప్పమంటే ఎలాగంటూ తిరుగు ప్రశ్నించినట్టు సమాచారం.

రేవంత్ రెడ్డి భార్య గీత బ్యాంకు లాకర్లలో లభించిన పత్రాల ఆధారంగా భూములు, ఇతర ఆస్తులపై కూడా ఐటీ అధికారులు ప్రశ్నల వర్షం గుప్పించారు. లాకర్లలో బంగారం భారీగా ఉండటంతో 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. అయితే 2014 ఎన్నికల తరువాత తన కుమార్తె వివాహ సమయంలో బంగారం కొనుగోలు చేసినట్టు అధికారులకు వివరించారు.

ఇదే సమయంలో ఓటుకు నోటు కేసుపై కూడా ఐటీ అధికారుల ప్రశ్నించారు. 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారు ? ఎవరిచ్చారు. అనే కోణంలో ప్రశ్నలు గుప్పించారు. రేవంత్ సమాధానం చెప్పిన అనంతరం ఇదే కేసులో నిందితుడుగా ఉన్న ఉదయ్ సింహతో కలిసి విచారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories