మంత్రి ఇలాఖాలో రెచ్చిపోతున్న వాటర్‌ మాఫీయా

x
Highlights

భూగర్భ జలాల్ని జలగల్లా పట్టి పీడిస్తోంది వాటర్‌ మాఫియా. ఖాళీ జాగా కనిపిస్తే చాలు బోర్లు వేయడం నీటిని తోడేయం. ఇలా వాటర్‌ మాఫియా భూమాతకు పోట్లు పోడుస్తూ...

భూగర్భ జలాల్ని జలగల్లా పట్టి పీడిస్తోంది వాటర్‌ మాఫియా. ఖాళీ జాగా కనిపిస్తే చాలు బోర్లు వేయడం నీటిని తోడేయం. ఇలా వాటర్‌ మాఫియా భూమాతకు పోట్లు పోడుస్తూ కోట్లు కొల్లగొడుతోంది. ఇదంతా ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు సాక్షాత్తూ మంత్రి ఇలాఖాలో. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పేరున్న పోలెపల్లి సెజ్‌ నుంచి సాగుతున్న నీటి దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్‌ రిపోర్ట్‌.

పోలేపల్లి సెజ్‍ ఈ సెజ్‍ ప్రభుత్వానికి కాసులు కురిపిస్తుండగా భూములు కోల్పోయిన వారికి మాత్రం పుండుమీద కారంలా మారింది. ఆర్థిక మండలి ఏర్పాటుతో భూములు కోల్పోయి ఇప్పటికే అవస్థలు పడుతుంటే ఇప్పుడు నీటి మాఫీయా ఆగడాలతో మూలిగే నక్కపై గుమ్మడికాయ పడ్డ చందంగా మారింది అక్కడి రైతులు పరిస్థితి.

కాసుల కోసం పుడమి గర్భానికి అడ్డంగా తూట్లు పొడుస్తుంది వాటర్‌ మాఫియా. అధికార పార్టీ నేతల అండదండలతో నీటి వ్యాపారం చేస్తూ జలగలలా పీల్చి పిప్పి చేస్తున్నారు. నీటి దందాకు అడ్డు వస్తే దాడులకు దిగి గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. నీటి మాఫీయా రెండు గ్రూపులుగా మారి దందా చేస్తూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇదంతా రాష్ట్ర మంత్రి సొంత ఇలా‌ఖాలో జోరుగా కొనసాగుతుండటంతో అధికారులకు అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరం.

మహబూబ్‍‌నగర్‌ జిల్లా పోలేపల్లి గ్రామంలో వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకొని మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగిస్తోంది మాఫియా. రోజుకు లక్షల లీటర్ల నీటిని బోరుబావుల నుంచి తోడేసి ట్యాంకర్ల ద్వార సెజ్‍ కంపెనీలకు అమ్ముకుంటున్నారు. ఏడాది కాలంగా ఈ నీటి దందా కొనసాగుతున్నా అడ్డుకునే నాథడే లేడు. నీటి దందాలో లక్షల రూపాయాల ఆదాయం వస్తుంది. అందులో అనుమానం లేదు. ఇక్కడే మాఫియాకు కలసి వచ్చింది. రెండు గ్రూపులుగా విడిపోయి తమ వ్యాపారాని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీరిద్దరి ఆధిపత్య పోరులో పోలేపల్లి గ్రామస్తులు నీటి కోసం కొట్టుకోవల్సిన దుస్థితి తలెత్తుతుంది.

స్వలాభం కోసం అమాయక రైతులకు డబ్బుల ఆశచూపి వ్యవసాయ బోర్లను స్వాధీనం చేసుకుంటుంది ఈ మాఫియా. నీటిని వ్యాపారానికి ఇక్కడే తెరలేపి ఎలాంటి అనుమతులు లేకున్నా రోజుకు లక్షలాది లీటర్ల నీటిని విక్రయిస్తూ.. కాసులు గడిస్తున్నారు. ఈ ఆగడాలపై ఎవరైన ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం మాఫియాకు వెరీ కామన్‌. గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిన ప్రజాప్రతినిధులే అండదండలు అందిస్తున్నారన్నది పోలేపల్లి గ్రామస్థుల ఆరోపణ. తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌ వరకు ఫిర్యాదులు చేసినా అధికారుల్లో మాత్రం స్పందన కరువైంది. ఈ విషయం పొరపాటున మాఫియాకు తెలిసిందా ఎందుకు ఫిర్యాదులు చేసావంటూ చితకబాదిన ఘటనలు, బూతు పురాణం ఎత్తుకున్న ఘటనలు ఎన్నో.

ఈ నీటి మాఫియా ఒక్క పోలేపల్లి గ్రామంలోనే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలకూ విస్తరించింది. కొద్దిపాటి నీరున్న వ్యవసాయ బోరులోని నీటిని ట్యాంకర్ల ద్వారా పోలేపల్లి సెజ్‍ లోని కంపెనీలకు తరలిస్తున్నారు.
రైతుల బోర్ల నుంచి ట్యాంకర్‌ నీటిని నింపుతే బ్రోకర్‌ ద్వారా రైతుకు 250 రూపాయాలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అదే బ్రోకర్‌ 1400 రూపాయలిచ్చి ఫిల్టర్‌ చేయించుకుంటాడు. అక్కడి నుంచి మరో బ్రోకర్‌ సాయంతో సెజ్‍‌లోని కంపెనీలకు 2 నుంచి మూడు వేల వరకు అమ్ముకుంటూ లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇన్నాళ్ళు నీటితో వ్యాపారం చేస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు వేసవి కాలం ప్రారంభమైంది.. నీటి కష్టాలు మరింత తారాస్థాయికి చేరే అవకాశాలుంటాయి. ఇలాంటి సమయంలోనైనా స్పందించి నీటి దోపిడిని అరికట్టాలని పోలెపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories