బల్దియాలో గోల్ మాల్ గోవిందం

x
Highlights

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పనేదైనా పర్సెంటేజీనే ఫైనల్ చేస్తుంది. అందుబాటులో ఉన్న...

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పనేదైనా పర్సెంటేజీనే ఫైనల్ చేస్తుంది. అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానం అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. తాజాగా జీహెచ్ఎంసీ చెత్త తరలింపు వాహనాల టెండర్ల విషయమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. బల్దియా ట్రాన్స్ పోర్ట్ విభాగంలో జరిగిన అవినీతిపై సీరియస్ అయిన కమీషనర్ ఆ విభాగాన్ని రెండు ముక్కలు చేసినా పాత కథే రిపీటవుతోంది.

జీహెచ్ఎంసీలో నిత్యం 4000-4,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అందులోని 40% వ్యర్థాలను బల్దియా రవాణా విభాగం అద్దె వాహనాలతో జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు చేర్చుతుంది. గతేడాది మార్చిలో వేర్వేరు వాహనాలను అద్దెకు ఏర్పాటు చేయాలని టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఏడాదికి 73లక్షల అంచనా అద్దె విలువతో రెండు హిటాచీలు, 20కోట్ల58 లక్షలతో 25టన్నుల సామర్థ్యం కలిగిన 36 భారీ ట్రక్కులు, 4కోట్ల 13లక్షలతో 18 జేసీబీలు, 9కోట్ల 92లక్షలతో 56 మినీ టిప్పర్లు కావాలంటూ రవాణా విభాగం టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మామూలుగా అయితే ఆయా పనులను దక్కించుకునేందుకు విపరీతమైన పోటీ ఉంటుంది. కానీ బల్దియాలో అలాంటి వాతావరణం ఉండదు. దేశంలోని వేర్వేరు పురపాలికలు, ఇతర సంస్థల్లో పనిచేసిన మూడేళ్ల అనుభవంతోపాటు బల్దియాతో అనుబంధమున్న గుత్తేదారులే టెండర్లలో పాల్గొనేందుకు అర్హులంటూ నిబంధన పెట్టారు. దాంతో జీహెచ్ఎంసీలో 2009 నుంచి పనిచేస్తున్న పలువురు కాంట్రాక్టర్లకే ఆయా పనులు దక్కినట్లయింది. ఉన్న కొద్ది మంది రింగై తమకు కావాల్సిన పనులు దక్కించుకుంటున్నారు. నిబంధనలను మార్చాలని బయటి వ్యక్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రవాణా విభాగం పట్టించుకోవట్లేదు.

ఈ విషయాలు బయటికి పొక్కకుండా రవాణా విభాగం ఉన్నతస్థాయి అధికారులు.. కాంట్రాక్టర్లు అద్భుతమైన అవగాహనకు వచ్చారు. తమలో తాము పోటీపడిఎక్కువ టెండర్లు వేయకుండా తెల్లకాగితంపై సంతకాలు తీసుకున్నారు. 20 మంది కాంట్రాక్టర్లు వారిలో వారు చర్చించుకొని ఒప్పందం ప్రకారం టెండర్లు వేస్తే రద్దు చేసుకొనేలా అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నారు. వారికి అధికారులే దిశానిర్దేశం చేసారు. డ్రైవర్ల జీతాలు..చెత్త తరలించే అద్దెవాహనాల కాంట్రాక్టులు కోట్లలో ఉండటంతో ఈ విధంగా చేసినట్టు బల్దియా యంత్రాగమే చర్చించుకుంటున్నారు. దీంతో కమీషనర్ తీసుకున్న చర్యలకు అవినీతి తూట్లు పడుతోందని అంటున్నారు.

గతంలో రవాణా విభాగంలో జరిగిన అవినీతి, స్పేర్ పార్ట్స్ కొనుగోలు అవకతవకలపై కేసులు నడుస్తున్నాయి. కొందరు అధికారులు. కాంట్రాక్టర్లపై కేసులు నమోదై జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఇదే విభాగంలో 25 టన్నుల ట్రక్కులు నడిపిస్తున్న కొందరు యజమానులు.. నకిలీ బిల్లులతో పెద్దఎత్తున నిధులు దండుకున్నారనే విమర్శలున్నాయి. విషయం విజిలెన్స్‌ అధికారుల వరకు వెళ్లింది. బిల్లుల మంజూరు ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర కార్యాలయం డిజిటలీకరణ చేసింది. రెండేళ్ల క్రితమే కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి రవాణా విభాగాన్ని వికేంద్రీకించారు.

దాంతో మరమ్మతులు, ఇంధన వినియోగంలో జరిగే అవినీతి కొంతవరకు అదుపులోకి వచ్చింది. అయినా పనుల టెండర్లలో మాత్రం గోల్‌మాల్‌ యథాతథంగా కొనసాగుతోంది. జోనల్‌ స్థాయిలో వాహనాల వ్యయం, సిబ్బందికి జీతాల చెల్లింపు మాత్రమే జరుగుతాయని.. గుత్తేదారుల ఎంపిక ప్రక్రియ మొత్తం కేంద్ర కార్యాలయంలోనే నడుస్తుందని సీనియర్‌ అధికారులు అంటున్నారు. అయితే పనులు అప్పగించే క్రమంలోనే పెద్దయెత్తున ముడుపులు చేతులు మారుతున్నాయి. జీహెచ్ఎంసీలో ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన అవినీతి తిమింగలాలే కాంట్రాక్టర్లు, నాయకులతో చేతులు కలిపి గ్రేటర్ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories