పేక ముక్కల్లో సీక్రెట్ చిప్స్..

పేక ముక్కల్లో సీక్రెట్ చిప్స్..
x
Highlights

మీకు పేకాట అలవాటుందా? పేకాట క్లబ్బులకు వెళ్తున్నారా? మూడు ముక్కలాటలో మీకెంత పట్టున్నా ఎప్పుడూ ఓడిపోతున్నారా? ప్రతిరోజూ వేలకు వేలు పోగొట్టుకుంటున్నారా?...

మీకు పేకాట అలవాటుందా? పేకాట క్లబ్బులకు వెళ్తున్నారా? మూడు ముక్కలాటలో మీకెంత పట్టున్నా ఎప్పుడూ ఓడిపోతున్నారా? ప్రతిరోజూ వేలకు వేలు పోగొట్టుకుంటున్నారా? పేకాటలో ఏమాత్రం అనుభవం లేనివాళ్లు ఈజీగా గెలుస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నారా? అయితే ఇందులో మీ తప్పేమీ లేకపోవచ్చు ఎందుకంటే పేకాట క్లబ్బుల్లో మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు ఆడుతోన్న పేక ముక్కలేంటో మీ ప్రత్యర్ధులు ఈజీగా తెలుసుకుంటున్నారు. మూడు ముక్కలాటలో మూడో కన్నుతో లక్షలకు లక్షలు దోచేస్తున్నారు కేటుగాళ్లు.

మూడు ముక్కలాటలో మూడో కన్ను గురించి మీకు తెలుసా? పేకాటలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న కేటుగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తూ కోట్లు కొట్టేస్తున్నారు. గ్యాబ్లింగ్ గ్యాడ్జెట్స్‌తో ఘరానా మోసానికి పాల్పడుతున్నాడు. సూక్ష్మ పరికరాలతో మోసాలకు పాల్పడుతూ లక్షల్లో లూటీ చేస్తున్నారు. ఇదేమీ తెలియని ఎంతోమంది ఆస్తులన్నీ అమ్ముకొని రోడ్డుపాలవుతుండగా, మరికొందరు సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నయా మోసం ఒకటి గుంటూరు జిల్లా తెనాలిలో బయటపడింది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన పేక ముక్కలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలతో మూడు ముక్కలాటలో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా రూపొందిన ఈ పేక ముక్కల్లో సీక్రెట్‌ చిప్స్‌ను అమరుస్తారు. పేక ముక్కల్లో ఉన్న చిప్స్‌ను ఫోన్లకు అనుసంధానిస్తారు. రిస్ట్‌ బ్యాండ్‌లో స్కానర్‌ను, చేతివాచి, కళ్లద్దాల్లో కెమెరాలను అమర్చుకుంటారు. ఇక ఇందులో నడుముకు ధరించే బెల్టే సీక్రెట్‌ స్పాట్‌గా వినియోగిస్తారు. పేక ముక్కల్లో అమర్చిన చిక్స్‌ నుంచి వచ్చే తరంగాల ద్వారా ఎదుటి వ్యక్తి చేతిలో ఏఏ పేక ముక్కలు ఉన్నాయో ఈజీగా తెలుసుకుంటారు. సెల్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన యాప్‌ ద్వారా పేకాట ఆడే సమయంలో ఎదుటి వ్యక్తి చేతిలో ఎటువంటి పేకముక్క ఉందో ముందే చెప్పేస్తుంది. సూక్ష్మ కెమెరాలు అమర్చిన చేతి గడియారం, కళ్లలో పెట్టుకునే లెన్స్‌, చేతికి పెట్టుకునే చైన్‌, మైక్రో బ్లూటూత్‌, కార్లకు తగిలించే కీచైన్‌, నడుంకు పెట్టుకునే బెల్టు ఇలా అన్నింటి ద్వారా ఎదుట వ్యక్తి చేతిలోని పేకముక్కల వివరాలు ముందే తెలిసిపోతాయి. ఇలా పేకాటలో మోసాలకు పాల్పడటమే కాకుండా ఈ పరికరాలను విక్రయిస్తూ వాటి ద్వారా ఎలా మోసాలకు పాల్పడాలో ఇతరులకు నేర్పిస్తూ లక్షలు దండుకుంటున్న ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠా చేతిలో మోసపోయిన ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ పరిజ్ఞానంతో నిందితులు అనేక మందిని లక్షల్లో మోసగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముఠా చేతిలో మోసపోయి 40లక్షలు పోగొట్టుకున్న రేపల్లె యువకుడు ఆత్మహత్యకు యత్నించాడని, కరీంనగర్‌‌కి చెందిన మరొకరు ఇదే తరహాలో 15లక్షలు మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 2లక్షల నగదు, ఎలక్ట్రానిక్ పేక ముక్కలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పామర్రుకి చెందిన మరో నిందితుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్న పోలీసులు త్వరలోనే అతడ్ని కూడా అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ముఠా వివరాలతోపాటు, ఎలా మోసాలకు పాల్పడతారో గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మీడియాకి వివరించారు. ఈ పరికరాలను చైనా నుంచి తెప్పిచినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories