తెలంగాణను కుదిపేసిన గాలి వాన బీభత్సం

తెలంగాణను కుదిపేసిన గాలి వాన బీభత్సం
x
Highlights

తెలంగాణలో కురిసిన అకాలవర్షం... రైతులకు ఆపార నష్టాన్ని కలిగించింది. గాలి వాన బీభత్సానికి...వందల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. అటు ఐకేపీ సెంటర్లలో సిద్ధంగా...

తెలంగాణలో కురిసిన అకాలవర్షం... రైతులకు ఆపార నష్టాన్ని కలిగించింది. గాలి వాన బీభత్సానికి...వందల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. అటు ఐకేపీ సెంటర్లలో సిద్ధంగా ఉంచిన వరిధాన్యం తడిసిపోయింది. చేతికి వచ్చిన పంట నోటికి అందకుండా పోవడంతో...అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఎండలో మండిపోతున్నాయ్. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ...పాత రికార్డులను బద్దలు కొడుతున్నాయ్. మరోవైపు తెలంగాణలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయ్. వేలాది ఎకరాల పంట ధ్వంసమయింది. క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావంతో...తెలంగాణ వ్యాప్తంగా వడగళ్ల వర్షం కురిసింది. ఐకేపీ సెంటర్లలో పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు నట్టేట మునిగిపోయారు. గన్నీ సంచులు లేకపోవడంతో...వందల క్వింటాళ్ల వరి పంట వర్షానికి తడిసిపోయింది.

ఖమ్మం జిల్లాలో చేతికి వచ్చిన పంట...భారీ వర్షానికి తడిసిపోయింది. మార్కెట్‌ గోడౌన్‌లో ఉంచిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయ్. అధికారులు సరైన సమయంలో గన్నీ సంచులు అందజేయకపోవడంతోనే పంట నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. తడిసిపోయిన పంటను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి...ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకాలవర్షానికి మామిడి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐకేపీ, పీఎసీఎస్‌ సెంటర్లలో ఉన్న ధాన్యం తడిసిపోయింది. భారీ వర్షానికి పొలాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది.

మెదక్‌ జిల్లాలోనూ వాన దంచి కొట్టింది. హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న వరి, మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. అటు సిద్దిపేట జిల్లాలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పంటను అమ్మేందుకు రైతులు ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చారు. వర్షానికి సగానిపైకి వరి ధాన్యం మునిగిపోతే...మిగతా పంట తడిసిముద్దయింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఈదురుగాలుల ధాటికి...మామిడి కాయలు నేలరాలాయ్. కమలాపూర్‌ మార్కెట్‌లో మొక్క జొన్న పంట మొత్తం తడిసిపోయింది. భూపాలపల్లి జిల్లాలో అకాలవర్షం...రైతులను నట్టేట ముంచింది. వందల ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. మరి కొన్ని చోట్ల వరి ధాన్యం...నీటిలో కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లాలోనూ వర్షం...రైతులకు కన్నీటిని మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షానికి వందల క్వింటాళ్ల ధాన్యం పనికిరాకుండా పోయింది. వరిధాన్యం కేంద్రాల్లో ఆరబెట్టిన పంట...పూర్తిగా తడిసిపోయింది. అధికారులు గన్నీ సంచులు అందించకపోవడంతో....రైతులకు ఆవేదనే మిగిలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories