జయహో సర్కారీ కాలేజ్

జయహో సర్కారీ కాలేజ్
x
Highlights

ఇలా విజయం గుర్తు చూపిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చేది సాధారణంగా కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థులు, వాటి యాజమాన్యం. కానీ వీళ్లు, కార్పొరేట్‌ లేదంటే ప్రైవేట్...

ఇలా విజయం గుర్తు చూపిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చేది సాధారణంగా కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థులు, వాటి యాజమాన్యం. కానీ వీళ్లు, కార్పొరేట్‌ లేదంటే ప్రైవేట్ ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ కాదు. ఒక్కసారి, వెనకాల ఉన్న బోర్డు చూడండి. పక్కా సర్కారీ కళాశాల. ఈసారి ఇంటర్‌ ఫలితాల్లో దుమ్మురేంది ప్రభుత్వ కాలేజే.

ప్రభుత్వ కాలేజీలు ఏ రేంజ్‌లో సత్తా చాటాయో తెలిస్తే, ఎవ్వరైనా షాక్‌ అవుతారు. ఇంటర్‌ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది ట్రైబల్ వెల్ఫేర్ కాలేజిలు. 87 శాతం పాస్ పర్సంటెజీతో ముందంజలో నిలిచాయి. ఇక సోషల్ వేల్ఫేర్ కాలేజిలు 86 శాతం ఉత్తర్ణీతతో సెకండ్ ప్లేస్‌ సాధించాయి. తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజిల ఉత్తీర్ణత 81 శాతం. గవర్నమెంట్ కాలేజిలు 70 శాతం రిజల్ట్స్. ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు కేవలం 69 శాతంతో చివరి స్థానంలో నిలిచాయి. అంటే మొత్తం ఐదుస్థానాల్లో నాలుగు ప్రభుత్వ కాలేజీలవే. ఐదోస్థానం కార్పొరేట్ కాలేజీది. గవర్నమెంట్‌ కాలేజీ విద్యార్థులు, ఇరగదీశారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఫలితాలతోనైనా తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ఆకాంక్షించారు తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. కనీస వసతులు కూడా లేని ప్రైవేటు కాలేజిలకు విద్యార్ధులను పంపి వారి మీద తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారే తప్ప, నాణ్యమైన చదువులు చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. బట్టి చదువులకు స్వస్థి చెప్పడానికి ప్రతి సంవత్సరం విద్యా విధానంలో మార్పు తెస్తున్నామన్నారు కడియం శ్రీహరి.

ఇప్పుడు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, లేదంటే ప్రైవేటు కొలువుల్లో పైస్థాయికి ఎదిగిన చాలామంది, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల నుంచి వెళ్లినవారే. కానీ వారి పిల్లలను మాత్రం, లక్షలకు లక్షలు పెట్టి, 24 గంటల ఒత్తిడి చదువుల మధ్య వదిలేస్తున్నారు. బట్టీ చదువులు, జీవితసారం నేర్పలేని, సమాజంలో ధైర్యంగా బతకలేని చదువులు. ఫలితం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వ, కార్పొరేట్‌ కాలేజీ మధ్య చదువుల తేడా గమనిస్తే, ఏది సరైనదో అర్థమవుతుంది. ప్రభుత్వ కాలేజీల్లోని ఉపాధ్యాయులు, చాలా నైపుణ్యమున్నవారని అందరికీ తెలుసు. బీఈడీ, ఎంఈడీ వంటి శిక్షణ తీసుకుని, డీఎస్సీ, జేఎల్ వంటి పోటీ పరీక్షల్లో నెగ్గిన మెరికలు. కానీ కార్పొరేట్‌ కాలేజీల్లో సగానికిపైగా అసలు క్వాలిఫైడ్‌ టీచర్లు లేరని అనేక సర్వేలు తేల్చాయి.

ప్రభుత్వ కాలేజీల్లో మౌలిక వసతులు ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, ల్యాబ్‌లుంటాయి. కానీ ఇరుకిరుకు భవనాల్లో, మరింత ఇరుకైన తరగతి గదులు కార్పొరేట్ కాలేజీలు. వీటిల్లో ఫీజులు లక్షల్లో ఉంటాయి. గవర్నమెంట్‌లో అసలు ఫీజులండవు. ఈ విధంగా చూసినా, ప్రభుత్వ కాలేజీలే చాలా మెరుగని విద్యావేత్తలంటున్నారు. కార్పొరేట్ కళశాలల్లో ఆటలు, పాటలు బంద్. తెల్లవారుజామున నాలుగు నుంచి రాత్రి 11 వరకు చదువులు, చదువులు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో ఆటలుంటాయి. పాటలుంటాయి. శారీరక, మానసిక ఉల్లాసం ఉంటుంది. ఒత్తిడి చదువులు అసలే ఉండవు. అందుకే టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్స్.

కానీ కార్పొరేట్ కాలేజీలో ఉన్నది, గవర్నమెంట్‌ కళాశాలలో లేనిది ఏంటంటే, అంకితభావం అన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ కొలువు కాబట్టి, బాధ్యతారాహిత్యంగా ఉపాధ్యాయులుండటమే, ఆదరణ కోల్పోవడానికి కారణమన్న ఆరోపణలున్నాయి. కానీ కార్పొరేట్‌లో అలా ఉండదు. క్వాలిఫైడ్ లెక్చరర్స్ కాకపోయినా, నిఘా ఉంటుంది. టార్గెట్లు ఉంటాయి. అన్నింటికీ మించి ప్రచార హంగామా ఎక్కువ. ఈ ప్రచారహోరుకు పడిపోయే తల్లిదండ్రులు, ఆస్తులు అమ్ముకుని, తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపైనా నిఘా ఉండి, ఎప్పటికప్పుడు స్కిల్స్‌ టెస్ట్‌లు ఉంటే, భయం, బాధ్యత పెరుగుతుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీలు సత్తా చాటడం ఒక శుభపరిణామంగా అందరూ భావిస్తున్నారు. గురుకులాలు, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్‌ కాలేజీల్లో వసతులు మెరుగుపడ్డాయని ప్రభుత్వం అంటోంది. ఫలితాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories