20 యేళ్లు సర్పంచ్ గా పనిచేసి.. ప్రస్తుతం విధివంచితుడిగా

20 యేళ్లు సర్పంచ్ గా పనిచేసి.. ప్రస్తుతం విధివంచితుడిగా
x
Highlights

అందరి శ్రేయస్సే.. తన శ్రేయస్సనుకుంటారు.. ఇతరుల బాగు కోసమే ఆలోచిస్తుంటారు.. మిగతావరి సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటారు.. అలాంటి వారు ఎక్కడో చోట...

అందరి శ్రేయస్సే.. తన శ్రేయస్సనుకుంటారు.. ఇతరుల బాగు కోసమే ఆలోచిస్తుంటారు.. మిగతావరి సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటారు.. అలాంటి వారు ఎక్కడో చోట మనకు కనిపిస్తుంటారు. ఏకంగా 20 యేళ్లు సర్పంచ్ గా పనిచేసి ఊరిని బాగుచేసిన ఆయన.. ప్రస్తుతం విధివంచితుడిగా మిగిలాడు. ఆపన్నహస్తాల కోసం వేచిచూస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రంగంపేట గ్రామ మాజీ సర్పంచ్ ధీనగాధపై హెచ్ ఎంటీవీ ప్రత్యేక కథనం.

ఇతని పేరు గ్యన్యా నాయక్. మంచంపై నుంచి లేచేందుకు కూడా ఇబ్బంది పడుతున్న ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామాన్ని 20 యేళ్ల పాటు ఏలాడు. రెండు దశాబ్దాలుగా సర్పంచ్ గా పనిచేసిన గన్యా నాయక్ నేడు ధీన స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. మారుమూల పల్లె అయిన రంగంపేట ఇటు పోలీసులు, అటు నక్సల్స్ తో సతమతమవుతున్న సమయంలో ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న గన్యా నాయక్ మండలాధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత గిరిజన నాయకుడిగా ఎదిగిన గన్యా నాయక్ ఆ తర్వాత సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 20 యేళ్ల పాటూ ఏకధాటిగా గ్రామాన్ని ఏలాడు.

తన హయాంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టాడు గన్యా నాయక్. అంతర్గత రహదారులు, స్కూల్, చెరువు పునర్నిర్మాణం, తాగునీటి వసతి కల్పించి ప్రజల నోట్లో నాలుకగా మారిపోయాడు. గ్రామాభివృద్దే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించాడు. గ్రామానికి ఏదైన అవసరమనుకునే పని కోసం పెద్దల చుట్టూ ఒకటికి పదిసార్లు తిరిగి మరీ సాధించుకుంటాడని గన్యా నాయక్ కు పేరుంది. అయితే యేళ్ల పాటూ ఊరికి సర్పంచ్ గా పనిచేసినా తన కోసం, తన వారి బాగుకోసం ఏనాడూ ఆలోచించలేదు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే నాయకులున్న ఈ రోజుల్లో తనకంటూ ఏదీ మిగిల్చుకోకుండా నిస్వార్థంగా గ్రామాభివృద్ది కోసం పనిచేశాడు.

ఇలా వెనకడుగే లేకుండా ముందుకు వెళ్తున్న గన్యా నాయక్ జీవితం ఐదేళ్ల క్రితం అనుకోని మలుపు తిరిగింది. విధి వక్రించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఓ చేయి, ఓ కాలుతో పనిచేయడం మానేశాయి. మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ తనకున్న రెండెకరాల పొలాన్ని అమ్ముకున్నాడు. అంతేకాకుండా రోజూవారీ చికిత్స కోసం నెలకు ఐదు నుంచి 6 వేల వరకు ఖర్చు చేస్తున్నా ఆరోగ్యం మాత్రం కుదుటపడటం లేదు. దీంతో ఆయన భార్య భూలవ్వ కూలీ చేస్తూ వచ్చిన డబ్బులతోటే భర్తకు వైద్యం చేయిస్తుంది.

కనీసం పక్కా ఇల్లు కూడా లేని గన్యా నాయక్ కుటుంబం ఇవాళ్టికీ కట్టెల పొయ్యిపైనే వంట వండుకోవడం అత్యంత దయనీయం. ప్రభుత్వం ఇస్తున్న 15 వందల పెన్షన్, 35 కిలోల బియ్యంతోటే కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా దీనావస్తలో ఉన్న గన్యా నాయక్ ఆదుకునే ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తున్నాడు. గతంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న గన్యా నాయక్ తనను ఆదుకునేవారి కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories