Top
logo

ఖమ్మం ప్రమాదం వెనుకు జీర్ణించుకోలేని చేదు నిజం

ఖమ్మం ప్రమాదం వెనుకు జీర్ణించుకోలేని చేదు నిజం
X
Highlights

చావు. అందరికీ భయమే. ఎప్పుడైనా ఏ రూపంలోనైనా కాటేసే మరణమంటే చచ్చేంత భయం. ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో...ఎవ్వరూ...

చావు. అందరికీ భయమే. ఎప్పుడైనా ఏ రూపంలోనైనా కాటేసే మరణమంటే చచ్చేంత భయం. ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో...ఎవ్వరూ చెప్పలేరు. కనీసం ఊహకు కూడా అందదు. అలాంటి చావు దుర్మార్గమా చిదిమేస్తుంది. కారుణ్యం చూపించనంత కఠినంగా కాటేస్తుంది. ఖమ్మం జిల్లాలో నిన్న అదే జరిగింది. పెళ్లయిన కేవలం ఆరంటే ఆరు గంటల్లోనే మృత్యువు దారుణంగా పాశం వేసింది. పాశవికంగా ప్రాణాలు తీసేసింది. చావు ఎదురయ్యే ఆ క్షణం ముందే తెలిసిపోయిన ఆ ప్రాణాలు ఎంత అవిసిపోయాయో... ఎంతగా అల్లాడిపోయాయో పాపం.

ఒక్క క్షణం... ఒకే ఒక్క క్షణం... ఏమరుపాటుగా ఉన్న ఆ క్షణం. జీవితాలను తలకిందులు చేసేసింది. తలరాతలను పూర్తిగా మార్చేసింది. రాత్రి పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా అలసిపోయిన ప్రాణాలు అలా కాస్త ఒరుగుదామనుకున్న ఆ క్షణాన్ని విధి తన వశం చేసుకుంది. ఎందరో జీవితాలను ఒంటరి చేసి తన కసి తీర్చుకుంది. అర్థరాత్రి ఖమ్మం ప్రమాదం వెనుకు జీర్ణించుకోలేని చేదు నిజం నిద్రలేమే. అవును. డ్రైవింగ్‌ చేసే వ్యక్తి కాస్త సేద తీరి ఉంటే... అందరూ సురక్షితంగా ఇంటికి చేరేవారు. వినోదం నిండాల్సిన పెళ్లింట విషాదానికి కారణంగా కాకుండా ఉండేవారు.

అర్థరాత్రి ప్రయాణాలు ఆషామాషీ కాదు. ప్రమోదం మాటున ప్రమాదాన్ని పంచే ఆ ప్రయాణాలను నీడలా వెంటాడుతుంది మృత్యువు. వాస్తవానికి అర్థరాత్రి నిద్ర ముంచుకొస్తుండగా జర్నీ ఏ మాత్రం సేఫ్‌ కాదు. ఈ నిజం అందరికీ తెలుసు. అయినా తెల్లారితే చేసుకోబోయే పనులు చాలా ఉన్నాయంటూ పరుగులు తీస్తారు. మృత్యువు తరుముకొచ్చేది అక్కడే. అర్థరాత్రి అతి నిద్రలో ప్రమాదాలకు దారితీసే పరిస్థితులకు కారణాలు ఎన్నో ఉంటాయి. అయినా అలాంటి ప్రయాణాల మాటున పొంచి ఉన్న ప్రమాదాలను మాత్రం ఏమాత్రం పట్టించుకోము. అదే పనిగా సుదీర్ఘంగా డ్రైవ్ చేస్తూ ఉండటం ఒక రీజన్‌.

ముఖ్యంగా అర్ధరాత్రి దాటాక 2 నుంచి 4 గంటలు అత్యంత ప్రమాదకరమైన సమయం. ఆ టైమ్‌లో డ్రైవ్ చేయడం చాలా డేంజర్‌. ఆ టైమ్‌లోనే కంపల్సరీగా డ్రైవింగ్ చేయాలంటే మాత్రం అంతకముందు తగినంత నిద్రపోవడం అవసరం. మత్తు కలిగించే మందులు తీసుకోవడం మానేస్తేనే బెటర్‌. మిడ్‌నైట్‌ జర్నీకి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నామా లేదా అన్న విషయం నిర్ధారించుకొని ఉపక్రమించడం మేలు.

అత్యవసరమైతే తప్పిస్తే... అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరుగంటల వరకు డ్రైవింగ్‌కు దూరంగా ఉండటమే మంచిదంటారు రవాణా రంగ నిపుణులు. ఆ సమయంలో పరిస్థితులకు తగ్గట్టుగా శరీరం స్పందించే అప్రమత్తత కొరవడుతుంది రెండు ప్రయాణాలకు మధ్య తగనంత వ్యవధి ఉంచుకోవాలి. డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి కాస్త బ్రేక్ తీసుకుంటూ డ్రైవ్‌ చేయాలి. డ్రైవ్ చేస్తున్నప్పుడు కునికిపాట్లు పడుతున్నట్లు అనిపిస్తే వాహనాన్ని సురక్షితమైన చోట ఆపి కాస్త కాఫీ తీసుకోవడమో లేదా కనీసం 15 నిమిషాల పాటు నిద్రపోవడమో చేయాలి. అంతేకానీ ఆ ఏం కాదులే అని మొండిగా డ్రైవ్ చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ప్రతి మనిషిలో బయో లాజికల్‌ క్లాక్ ఉంటుంది. అంటే మనం పగలు పనిచేయడం, రాత్రి పడు కోవడానికి అలవాటుపడ్డాం. దీనికి విరుద్ధంగా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు ముంచుకొచ్చేవి. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతేనే మనిషి శారీరకంగా బలంగా ఉంటాడు. మానసికంగా ఉత్తేజవంతుడవుతాడు. అయితే డ్రైవింగ్‌ వృత్తిలో ఉన్న వారిలో చాలా మందికి నిద్రలేమి సమస్య కచ్చితంగా ఎదురవుతుంది.

ఖమ్మం యాక్సిడెంట్‌లో కూడా డ్రైవర్‌ బహుశ ఇదే సమస్యతో బాధపడటానికి అవకాశం ఉంది. దాన్నే నాక్రొలెప్సీ అంటారు. ఈ జబ్బు ఉన్నట్టు కూడా మనకు తెలియదు. అతి నిద్ర అయినా, అసలు నిద్ర లేకుండా అయినా చేసే ఈ జబ్బు వల్ల అకస్మాత్తుగా నిద్ర ముంచుకొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. చదువుతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఇలా ఓ కునుకు తీస్తుంటారు. అదే ప్రమాదాలకు కారణమవుతుంది. కళ్ల ముందు అంతా క్లియర్‌గా ఉన్నట్టుగానే కనిపిస్తూ మబ్బు కమ్మేసి మరణం ముంచుకొచ్చేసింది. ఖమ్మం యాక్సిడెంట్‌లో కచ్చితంగా ఇదే జరిగి ఉంటుంది.

ఏమైనా డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని నడపాల్సిందే. కళ్ల ముందు ఏం జరుగుతుందో అంచనా వేయలేకపోతే ఈ లోకం నుంచి మాయపోవడం ఖాయం. చనిపోతే మనకు మనం వెళ్లిపోతామేమో కానీ మనల్నే నమ్ముకున్న వాళ్లు మన కోసమే బతుకుతున్న వాళ్లు ఎలా? జీవితాలు తలకిందులు కాకుండా ఉండాలంటే తలరాతలు మారకుండా ఉండాలంటే ప్రయాణాలు ప్రమాదంగా కాకుండా ప్రమోదంగా మారాలంటే డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్న వాళ్లు జాగ్రత్తలు పాటించి తీరాల్సిందే. అర్థరాత్రి అతి నిద్ర ముంచుకొస్తుండగా ప్రయాణాలు మానుకోవాల్సిందే.

Next Story