నకిలీ వేలిముద్రల కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు

నకిలీ వేలిముద్రల కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు
x
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ వేలిముద్రల కేసులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 2 రోజుల విచారణలో నిందితుడు సంతోష్ కుమార్ చెప్పిన విషయాలు అందరినీ...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ వేలిముద్రల కేసులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 2 రోజుల విచారణలో నిందితుడు సంతోష్ కుమార్ చెప్పిన విషయాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌తో సిమ్ కార్డులే కాదు రేషన్ బియ్యం కూడా టన్నుల్లో తినేశారు. తీగ లాగితే డొంక కదిలిందన్నట్లుగా ఊహించని రీతిలో అంతా ఒకేసారి బుక్కయ్యారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ వేలిముద్రల కేసు విచారణలో నిందితుడు సంతోష్ కుమార్ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. సిమ్‌కార్డుల యాక్టివేషన్ మాత్రమే కాదు రేషన్ డీలర్లతోనూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురు డీలర్లను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వేలిముద్రలతో వీళ్లంతా అక్రమంగా టన్నులకొద్దీ బియ్యం రవాణా చేసినట్లు గుర్తించారు. రెండో రోజు విచారణలో భాగంగా నిందితుడు సంతోష్‌కుమార్‌‌ను స్వగ్రామం ధర్మారంకు తరలించారు. అతని ఇళ్లు, షాపులో సోదాలు చేసిన పోలీసులకు సిమ్ కార్డులు కాల్చేసిన ఆనవాళ్లు కనిపించాయి. మరికొన్ని సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు.

సబ్సిడీపై అందిస్తున్న రేషన్ బియ్యాన్ని నొక్కేసేందుకు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, ధర్మారం, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లోని కొందరు డీలర్లతో సంతోష్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. బతుకుదెరువు కోసం ముంబై, హైదరాబాద్‌ వలసొచ్చిన కాలీల రేషన్‌ను చాలా సులువుగా నొక్కేశారు. ఆ బియ్యాన్ని రైస్‌మిల్లులకు రీసైక్లింగ్ కోసం పంపారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఏ రేషన్ షాపు నుంచి ఎంతెంత సరకు అక్రమంగా నొక్కేశారన్న దానిపై విచారణ చేపట్టారు.

సంతోష్ స్వగ్రామంలో సోదాలు పూర్తైన తర్వాత అతడని ధర్మవరం తరలించారు. అక్కడ ధనలక్ష్మి కమ్యూనికేషన్‌లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ నుంచి సంతోష్ డౌన్‌లోడ్ చేసిన 14 వందల వేలిముద్రలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కీలక పత్రాలు, ఆధార్, సిమ్ కార్డులు, ఫేక్ ప్రింగ‌ర్ ప్రింట్ త‌యారీకి వాడిన మొత్తం సామాగ్రిని సీజ్ చేశారు.

రిజిస్ట్రేషన్ శాఖలోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ వేలిముద్రలను తయారు చేసినట్టు నిందితుడు సంతోష్ విచారణలో తెలిపాడు. వాటిని ఆధార్ డేటా బేస్ నుంచి కేవైసీ అప్రూవల్ పొందడానికి వినియోగించిట్లు ఒప్పుకున్నాడు. మొత్తం 14 వందల డాక్యుమెంట్లతో 8 నెలల్లో 6 వేల సిమ్‌కార్డులను యాక్టివేట్ చేసినట్లు తెలిపాడు. కేవలం కమీషన్ల కోసమే ఇదంతా చేసినట్లు సంతోష్ విచారణలో ఒప్పుకున్నాడు.

కేంద్ర ఇంటెలిజెన్స్‌, సైబర్ క్రైమ్, ఐటీ, లా అండ్ ఆర్డర్, ఆధార్‌తో పాటు 18 విభాగాలకు చెందిన అధికారులు సంతోష్‌ను వివిధ కోణాల్లో విచారించారు. ఆధార్ చట్టబద్ధత, గోప్యతపై ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతున్న సమయంలో నకిలీ వేలిముద్రల వ్యవహారాన్ని కేంద్ర నేర పరిశోధన సంస్థలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories