నకిలీ డాక్టర్‌.. మాయమాటలతో ఐదు పెళ్లిళ్లు

నకిలీ డాక్టర్‌.. మాయమాటలతో ఐదు పెళ్లిళ్లు
x
Highlights

మాయమాటలతో వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న మరో నిత్య పెళ్లికొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. నడిపేది బోగస్‌ ఆస్పత్రి. దానిని అడ్డుపెట్టుకొని నాలుగైదు...

మాయమాటలతో వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న మరో నిత్య పెళ్లికొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. నడిపేది బోగస్‌ ఆస్పత్రి. దానిని అడ్డుపెట్టుకొని నాలుగైదు నెలలకు ఒకసారి పెళ్లికి ముస్తాబవుతాడు. తన పేరు మార్చుకోవడమే కాదు, నకిలీ ఎంబీబీఎస్‌ వైద్యుడిగా అవతారమెత్తుతాడు. డాక్టర్‌నని చెప్పుకొని ఇప్పటికి ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పేరు, వృత్తే కాదు పెళ్లి చూపులకు వెంట తీసుకెళ్లే అమ్మానాన్నలు కూడా బోగసే. అద్దెకు మనుషులను మాట్లాడుకొని పెళ్లి తతంగం నడిపించేస్తున్నాడు. కొన్నేళ్లుగా పలు జిల్లాల్లో ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు. వారి నుంచి అందినకాడికి దండుకొని మరో ప్రాంతానికి మకాం మార్చేస్తున్నాడు.

గుంటూరు జిల్లా జొన్నలగడ్డకు చెందిన ఓ యువతి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నిత్యపెళ్లికొడుగు అసలు బండారం బట్టబయలైంది. ప్రకాశం జిల్లా మల్లారం గ్రామానికి చెందిన చిలుకూరి వీరాంజనేయులు ఒంగోలులో కాంపౌండర్‌గా పని చేసేవాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోడంతో తన పేరును రాయవెంటి రమేశ్‌ బాబుగా మార్చుకున్నాడు. అదే పేరుతో ఆధార్‌ కార్డు తీసుకున్నాడు. ఎంబీబీఎస్‌, డీఏ, పీజీడీసీసీ చదివాననీ కార్డియాలజిస్టుననీ చెప్పుకుంటూ వైద్యుడి అవతారమెత్తాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో జొన్నలగడ్డకు చెందిన ఓ యువతి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లాడు. మ్యాట్రిమోనీలో ప్రొఫైల్‌ చూశాననీ పెళ్లి చేసుకుంటాననీ మాటలు కలిపాడు. తాను ఎంబీబీఎస్‌ వైద్యుడిననీ మాయమాటలు చెప్పాడు.

తన తల్లి హార్ట్ పేషెంట్ అని, అందుకే హడావుడిగా పెళ్లి చేసుకుంటున్నానని యువతి తల్లిదండ్రులను నమ్మించాడు కేటుగాడు. అద్దె తల్లి దండ్రులను కూడా సీన్ లోకి దింపాడు. దీంతో మార్చి 2న వీరికి పెళ్లైంది. అనంతరం ఆమె, వీరాంజనేయులు అలియాస్‌ రమేశ్‌ బాబుతో చెరుకుపల్లి వెళ్లింది. వీరాంజనేయులు ప్రవర్తన తేడాగా ఉండటంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. అతని వద్ద భారీగా సిమ్‌ కార్డులు ఉండటం, ఎప్పటికప్పుడు సిమ్‌లు మార్చి మాట్లాడుతుండటం గమనించింది. ఇంతలో నిత్య పెళ్లికొడుకు మరో నాటకానికి తెరలేపాడు. తనకు క్యాన్సర్‌ ఉందని కట్నంగా ఇచ్చిన 8లక్షలు తీసుకోవడంతో పాటు బాధితురాలికి చెందిన 15సవర్ల బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నాడు. ఇవి కాక ఇంకా డబ్బు తేవాలని వేధించాడు. దీంతో ఏ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నావని అడగ్గా ఓ ఆసుపత్రి పేరు చెప్పాడు. ఆమె ఆ ఆసుపత్రికి వెళ్లి విచారించినట్లు తెలుసుకుని తీవ్రంగా కొట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె కొద్ది నెలలకే పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత విచారించగా వీరాంజనేయులు లీలలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.


తాను ఎంబీబీఎస్‌ డాక్టర్‌ అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు చాలా మందిని పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కారంపూడికి చెందిన జయప్రద అనే యువతిని కూడా పెళ్లి చేసుకున్నాడని వారికి ఓ కొడుకు కూడా ఉన్నాడని బాధితురాలు తెలిపింది. అంతకన్నా ముందు ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని వారికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు చెప్పింది. అయితే వీరిలో ఎవరికీ విడాకులు ఇవ్వకుండా వరుస పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. చెరుకుపల్లిలో వెన్నెల ఆసుపత్రి పేరుతో కార్డియాలజిస్ట్‌ అంటూ కొద్ది నెలలు డాక్టర్‌గా చలామణి అయిన వీరాంజనేయులు గత నెల 27న రాత్రికి రాత్రే పరారయ్యాడు. నవంబర్‌ 23న రాజమహేంద్రవరానికి చెందిన కొందరు ఆసుపత్రికి వచ్చి పెళ్లి సంబంధం కుదుర్చుకున్నట్లు స్థానికుల ద్వారా బాధితురాలికి తెలిసింది.


ఈ కిలాడీ పెళ్లికొడుకు, ఎప్పటికప్పుడు తన ఇంటి పేరును కూడా మార్చుకుంటూ జాగ్రత్తపడ్డాడు. పాన్‌ కార్డులో రానవోయినగా, సర్టిఫికెట్లలో రాయవెంటిగా, లగ్నపత్రికలో రాయపాటిగా పేర్కొన్నాడు. అంతేకాక ఎంపీ రాయపాటి సాంబశివరావు తనకు బంధువు అనికూడా చెప్పుకుని తిరిగేవాడు. అయితే తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడిగా చెప్పుకుంటూ ఇప్పటి వరకు అదే సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేశాడు. అయితే, ఇప్పటి వరకు విచారణలో తేలింది ఐదు పెళ్లిళ్లే ఇంకా ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో విచారణలో తేలాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories