Top
logo

మొగుడే యముడు

X
Highlights

కట్టుకున్న భార్యను చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎత్తులు కూడా వేశాడు. దర్యాప్తు...

కట్టుకున్న భార్యను చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎత్తులు కూడా వేశాడు. దర్యాప్తు చేసే పోలీసులను తమకు అనుకూలంగా మార్చుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టే కంప్లీట్ చేశాడు. కాని తన అక్కది హత్యంటూ సోదరి తీవ్ర స్ధాయిలో పోరాటం చేసింది. అడుగుకో గండాన్ని దాటి సూత్రధారుల నాటకాన్ని బయటపెట్టింది.

2017 జనవరి 18...సమయం రాత్రి 8.30 గంటలు...బైక్‌ను ఫాలో అవుతున్న సఫారి...పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం–పాలకొల్లు మార్గం...దిగమర్రు కొత్తోట దగ్గర వెనక నుంచి యాక్టీవాను ఢీ కొట్టిన సఫారి...అక్కా,చెల్లెళ్లకి తీవ్ర గాయాలు...చికిత్స పొందుతూ అక్క శ్రీగౌతమి మృతి ...ప్రమాదంగా నిర్ధారిస్తూ కేసు క్లోజ్ ...ఇలా సరిగ్గా ఏడాదిన్నర క్రితం క్లోజ్ అయిన ఈ కేసులో అసలు వాస్తవాలు వెలుగుచూశాయి. కట్టుకున్న భర్త సూత్రధారిగా, కిరాయి హంతకులు పాత్రధారులుగా, రాజకీయ నేతలు సహకారం అందించిన ఈ క్రైమ్ కథా చిత్రమ్‌లో తీగ లాగితే డొంక కదిలింది.

ప్రమాదం జరిగిన 15 రోజుల తరువాత కోలుకున్న శ్రీ గౌతమి సోదరి పావని అసలు విషయాలను వెల్లడించింది. తమకు జరిగింది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని .. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడేనంటూ పోలీసులను ఆశ్రయించింది. అయితే సరైన ఆధారాలు లేవంటూ పోలీసులు ప్రమాదంగానే నిర్ధారిస్తూ క్లోజ్ చేశారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో సీఐడీని ఆశ్రయించి కేసుపై దర్యాప్తు చేయాలంటూ కోరింది.

జిల్లాలోని పాలకొల్లుకు చెందిన టీడీపీ నేత సజ్జా బుజ్జికి నరసాపురానికి చెందిన శ్రీగౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే పెళ్లయిన బుజ్జి ఈ విషయాన్ని దాచడంతో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. ఇదే సమయంలో సజ్జా బుజ్జి సోదరుడు పోలంపల్లి రమేష్‌తో శ్రీ గౌతమి సోదరి పావని ప్రేమలో పడింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ పావని ఒత్తిడి తెస్తూ ఉండగా .. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోతే కేసు పెడతానంటూ బుజ్జిని శ్రీ గౌతమి హెచ్చరించింది. వివాదం తీవ్ర స్ధాయికి చేరుకోవడంతో సోదరులిద్దరూ , అక్కాచెళ్లళ్లను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

తమ ప్లాన్ అమలు చేసేందుకు సంక్రాంతి పండుగను ఎంచుకున్నారు. ఇందుకోసం నరసాపురం టీడీపీ జెడ్పిటీసీ బాలం ప్రతాప్ సహాయం తీసుకున్నారు. ప్రతాప్ సలహాతో బాలం ఆండ్రూ ద్వారా సందీప్ ,దుర్గాప్రసాద్ అనే ఇద్దరు కిరాయి హంతకులను మాట్లాడుకున్నాడు. శ్రీగౌతమికి అనారోగ్యంగా ఉండటంతో ఇద్దరు కలిసి నరసాపురం చేరుకున్నారు. అప్పటికే ఇన్నోవాలో ఫాలో అవుతున్న నిందితులు యాక్టివాను వెనక నుంచి ఢీ కొట్టారు. ఈ ఘటనలో మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీ గౌతమి మరణించగా .. 15 రోజుల అనంతరం పావని కోలుకుంది. పావని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడి అన్ని కోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించింది.

కిరాయి హత్య కోణంలో విచారణ జరిపిన అధికారులు ప్రమాదానికి గురైన ఇన్నోవా డ్రైవర్ సందీప్‌ ఖాతాను పరిశీలించారు. రెండు దఫాలుగా సజ్జా బుజ్జి నుంచి అకౌంట్ నుంచి సందీప్‌ ఖాతాలో డబ్బు పడినట్టు గుర్తించారు. పూర్తి ఆధారాల కోసం కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు పక్కాగా ఆధారాలు రాబట్టారు. నూటికి నూరు శాతం హత్యగా గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారులు సజ్జా బుజ్జి, పోలంపల్లి రమేష్‌తో పాటు సహకరించిన నరసాపురం టీడీపీ జెడ్పిటీసీ బాలం ప్రతాప్, పాత్రదారులు బాలం ఆండ్రూలలను మీడియా ముందు హాజరుపరిచారు.

చట్టాన్ని చుట్టంగా మార్చుకుని రాజకీయ అండదండలతో కేసు నుంచి బయటపడాలని చూసిన సజ్జాబుజ్జికి తగిన శిక్ష విధించాలంటూ మహిళా సంఘాలతో పాటు స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. మానవత్వాన్ని మంటగలిపే ఇలాంటి నేతలకు బుద్ధి చెప్పేలా కఠిన శిక్ష విధించాలంటూ పోలీసులను కోరుతున్నారు.

Next Story