logo
తాజా వార్తలు

వ్యవసాయంలో డ్రోన్ల శకం !

X
Highlights

కాలం మారుతోంది. మారుతోన్న కాలంతో పాటే శాస్త్రసాంకేతిక రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. నిత్య నూతన...

కాలం మారుతోంది. మారుతోన్న కాలంతో పాటే శాస్త్రసాంకేతిక రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. నిత్య నూతన ప్రయోగాలు, పరిశోధనలతో సరికొత్త ఆవిష్కరణలు, యంత్రాలు పరిచయమవుతున్నాయి. మానవ శ‌్రమని తగ్గించే నూతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వస్తున్నాయి. ఈ కోవకి చెందినదే డ్రోన్. ఇది ఆధునిక సాగుగతిని మార్చగలిగే పరిశోధన ఫలంగా నిలుస్తోంది. వ్యవసాయ రంగంలో తన సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధమైన డ్రోన్‌ టెక్నాలజీపై ప్రత్యేక కథనం.

డ్రోన్ వ్యవసాయంలో దీని పాత్ర అమోఘం. అభివృద్ధి చెందిన దేశాల్లో విరివిగా సేవలందిస్తున్న ఈ పరికరం ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ అడుగుపెట్టింది. ము‌ఖ్యంగా వ్యవసాయ రంగ వెలుగు దివ్వెగా కనిపిస్తోంది. కూలీలు, మందుల పిచికారీ సమస్యలకు తరుణోపాయంగా ఆశలు కల్పిస్తోంది. మనిషితో ప్రమేయం లేకుండా ఆకాశంలో నడిచే వాహనమే డ్రోన్‌. రెండు దశాబ్దాల క్రితం వరకు నిఘా కార్యకలాపాలకే పరిమితమైన ఈ బుల్లిమానవ రహిత విమానం ప్రతి చోట తన ఉనికిని చాటుతోంది. రక్షణ, భద్రత మొదలు వైద్యం, ఆర్ధికం, మైనింగ్, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, సరకు రవాణా వరకు ప్రతి రంగంలో విశిష్ట సేవలందిస్తోంది. ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది.

తేనెటీగ లాగా శబ్ధం చేస్తూ ఎగురుతుంది కాబట్టి దీనికి డ్రోన్ అని పేరు వచ్చింది. పైలట్ లేకుండా పనిచేసే స్వభావం కారణంగా మానవరహిత బుల్లి విహంగం అంటారు. 4 వందల అడుగుల ఎత్తు, 20 కిలో మీటర్ల పరిధిలో గంటపాటు నిరంతరాయంగా ఎగరగలుగుతుంది. మనుషులు అడుగు పెట్టని ప్రాంతాలకి సైతం నిమిషాల్లో చేరి ఫోటోలు, దృశ్యాలను చిత్రీకరిస్తుంది. ఆహారం, మందులను అందిస్తుంది.

శతాబ్ధ కాలం క్రితమే ఆధునిక సమాజానికి పరిచయమైన డ్రోన్లని మొదట్లో సైన్యం అవసరాల కోసం వాడేవారు. నెమ్మదినెమ్మదిగా సరికొత్త రూపు సంతరించుకుని, బహుళ సౌకర్యాలతో నిఘా విభాగం, రక్షణ గోడలు దాటుకుని ఇప్పుడు పొలంలోకి అడుగు పెట్టింది. క్రాప్ డస్టింగ్ అనేవి రెండు దశాబ్ధాల క్రితం నుంచే జపాన్‌లో వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సహా అనేక దేశాల్లో వాడుతున్నారు.

పెద్ద కమతాల్లో పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా రైతులు, వ్యవసాయ, పారిశ్రామికవేత్తలు డ్రోన్ల మీదే ఆధారపడుతున్నారు. పెద్ద పెద్ద తోటలు , డెయిరీ ఫారాల్లో అడుగడుగునా నడవలేనిచోట డ్రోన్‌ని వినియోగించి క్షణాల్లో వీడియో తీసి ఆ దృశ్యాలని కంప్యూటర్లో చూసి పంటల స్థితిగతులు, చీడపీడల ప్రభావం అంచనావేసి తదనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు నిర్థారించుకుంటున్నారు.

మట్టి నాణ్యత విశ్లేషణ, వాతావరణం, పంట దిగుబడి అంచనాలకి సైతం డ్రోన్లనే వాడుతున్నారు. వ్యవసాయంలో డ్రోన్‌ల వాడకంలో జపాన్, చైనా, ముందుండగా ఇటీవల కాలంలో ఇతర దేశాల్లోనూ ఈ సాంకేతిక మాంత్రిక యంత్రాలను విరివిగా వాడడం మొదలుపెట్టారు. కంపెనీలు సైతం వ్యవసాయ రంగానికి అనువైన డ్రోన్‌లని ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి.

పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు రైతులకు కలిగే అరోగ్య సమస్యల అన్నీ ఇన్నీ కావు. పిచికారీ కోసం గంటల తరబడి రైతులు పొలాల్లో శ్రమిస్తుంటారు. సరైన రక్షణ లేకుండా ఈ క్రమంలో ఆ గాలిని పీలుస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంలా నిలుస్తున్నాయి డ్రోన్లు. డ్రోన్ల సహాయంతో పురుగుమందుల పిచికారీ చేపట్టవచ్చు. రైతు ఆరోగ్యం కాపాడవచ్చు.

వ్యవసాయరంగంలో కూలీల కొరత తీవ్రమైంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరిగిన పరిస్థితుల్లో పొలాల్లో పనిచేసేందుకు కూలీలు దొరకడం లేదు. ఈ ప్రభావం విత్తనం నాటడం నుంచి కలుపు, అంతరకృషి, కోత, నూర్పిళ్ల వరకు అన్ని రకాల పనులపై పడుతోంది. దీనివల్ల సకాలంలో కూలీలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంటల్లో చీడపీడలు, తెగుళ‌్ల తాకిడి అధికమై వెంటనే పురుగు మందులు పిచికారీ చేయాల్సిన సమయంలో కూలీల కొరత , ఒకేసారి పెద్దకమతాల్లో మందులు చల్లే అవకాశం లేక రైతులు పంటని రక్షించుకోలేకపోతున్నారు.

పొలాలకు పురుగు మందులు చల్లే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. డ్రోన్‌ వినియోగం వల్ల రైతులకు ఎలాంటి హాని ఉండదు. తక్కువ సమయంలో పని పూర్తి అవడమే కాక విస్తీర్ణాన్ని బట్టి పురుగు మందును అందుకు అవసరమైన నీటిని కలుపుకునే టెక్నాలజీని డ్రోన్‌లో పొందుపరిచారు. మామూలు స్ర్పే వల్ల పురుగు మందులు వృథా అయ్యే అవకాశం ఉంటుంది. డ్రోన్‌లో అందుకు ఆస్కారం ఉండదు.

పది మంది కూలీలు చేసే పనిని డ్రోన్ ఒక్కటే చేస్తుంది. పది నిమిషాల్లో ఎకరం పొలంలోని పంటనంతటిపై మందు చల్లేస్తుంది. అది కూడా నిర్దిష్ట పరిమాణంలో పొలంలోని మొక్కలన్నింటికీ సమానంగా మందు పిచికారీ చేస్తుంది.

సాధారణంగా పిచికారీ చేసే కంటే డ్రోన్‌ 40 నుంచి 60 శాతం సమర్థంగా మొక్కలకి మందు చేరవేస్తుంది. ప్రస్తుతం 3 లీటర్ల నుంచి 20 లీటర్ల వరకు పిచికారీ చేసే డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. డ్రోన్లతో పిచికారీ వల్ల నీరు, మందు సమయం, ఖర్చు చాలా ఆదా అవుతుంది.

పిచికారీ కోసం లీటర్ల కొద్దీ నీరు, పురుగుమందు వాడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా పొలాల్లో పురుగులు, కీటకాలకు బదులు పిచికారీ చేసే రైతుల ప్రాణాలని పొట్టనపెట్టుకుంటున్న ఉదంతాలకి అడ్డుకట్టపడుతుంది. డ్రోన్ల వాడకంతో మరో సౌలభ్యం కూడా ఉంది. మొబైల్ యాప్‌, జీపీఎస్‌ మ్యాపింగ్‌, వెబ్‌ల్యాండ్‌ అనుసంధానం ద్వారా పొలం సర్వే నంబర్లు, విస్తీర్ణం తెలియడంతో పాటు నిర్ణీత ప్రదేశంలోనే ఎగురుతూ మందుని చల్లుతుంది. మరోసారి అదే చోట మందు పిచికారీ చేయడం తేలికవుతుంది. రసాయన మందుల పిచికారీతో పాటు ఎరువులు వేసే డ్రోన్లని కూడా తయారీ సంస్థలు రూపొందించాయి.

పంటకు ఏ పురుగు ఆశించింది? ఏ తెగులు వచ్చిందో తెలుసుకునేందుకు , పంటని విహంగ వీక్షణం చేసి సమస్యని గుర్తించే డ్రోన్లు వచ్చేశాయి . అత్యాధునిక పరికరాలతో నిమిషాలలో పొలాన్ని చుట్టేసి తెగుళ్ల గుట్టు చెప్పే నవీన డ్రోన్లు సిద్ధమయ్యాయి.

ప్రస్తుతం అన్ని రకాల పంటల్లో చీడపీడలు, రోగాల బెడద పెరిగింది. వాతావరణ మార్పులు, నాసిరకం మందులతో సమస్య తీవ్రమైంది. రైతు స్థాయిలో చీడపీడల గుర్తింపు, నియంత్రణ కష్టంగా మారింది. పైగా పురుగులు, కీటకాల్లో మందులని తట్టుకునే శక్తి అధికమైంది. మరోవైపు పంటకు ఏ పురుగు ఆశించింది? ఏ తెగులు వచ్చింది? అనే విషయం శాస్త్రవేత్తలు పంటని పరిశీలించిన తరువాతగానీ తెలియడం లేదు. అయితే వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ప్రతి గ్రామంలోని పొలానికి వెళ్లి సమస్యని పరిశీలించలేరు. కాబట్టే రైతులు పురుగు మందుల వాడకంతో దుకాణదారులపై ఆధారపడి వారిచ్చిన మందులే కొట్టి నష్టపోతున్నారు. ఇక ముందు ఇలాంటి ఇబ్బందులకి చోటుండదు. పంటని విహంగ వీక్షణం చేసి సమస్యని గుర్తించే డ్రోన్లు వచ్చేశాయి. అత్యాధునిక పరికరాలతో నిమిషాలలో పొలాన్ని చుట్టేసి తెగుళ్ల గుట్టు చెప్పే నవీన డ్రోన్లు సిద్ధమయ్యాయి.

అత్యాధునిక డ్రోన్లు అన్ని కోణాల్లోనూ ఫోటోలు, వీడియోలు తీయగలవు. హెచ్‌డీ నాణ్యతతో, త్రీడైమెన్షన్‌లో దృశ్యాలని బంధించగలవు. అంతే కాకుండా డ్రోన్‌కి అనుసంధానం చేసిన కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోను ద్వారా పైలట్ కంట్రోలర్ పొలంలో కావాల్సన ప్రదేశంవైపు డ్రోన్‌, కెమెరాని తిప్పుతూ ఫోటోలు, దృశ్యాలు చిత్రీకరించే వెసులుబాటు ఉంది. అడ్వాన్స్‌డ్‌ సెన్సార్లు. డిజిటల్ ఇమేజింగ్ ద్వారా పంటకి సంబంధించిన నాణ్యమైన చిత్రాలు తీసుకుని విశ్లేషించే సౌలభ్యమూ ఉంది.

మనిషి చూపుకి అందని ఎన్నో విషయాలు డ్రోన్‌ సెన్సార్లు పసిగడతాయి. సాధారణంగా బర్డ్స్ ఐ వ్యూ, ఇన్‌ఫ్రారెడ్‌ వ్యూ అనే రెండు విధాలుగా చిత్రాలు తీయవచ్చు. నీటి సమస్య, నేలతీరు, చీడపీడల ప్రభావం వంటి వాటిని మొదటిదాని ద్వారా తెలుసుకోవచ్చు. రెండో దాని ద్వారా ఆరోగ్యంగా ఉన్న మొక్కలు, చీడపీడలబారిన పడ్డ మొక్కల మధ్య తేడాని గుర్తించవచ్చు. మొక్క ఆకుల ఆరోగ్యం, నాణ్యత ఆధారంగా డ్రోన్లకి అమర్చిన ఇన్‌ఫ్రారెడ్‌ లైట్లు వెలుగుతాయి. ఈ లైట్లు వెలిగే తీరు, రంగులు బట్టి మొక్కల ఆరోగ్యం తెలుసుకోవచ్చు.

ఇలా పొలంలో అణువణువునా తీసిన ఫోటోలు, దృశ్యాలని కంప్యూటర్ ద్వారా చూసి తదనుగుణంగా చీడపీడల నివారణ చర్యలు చేపట్టవచ్చు. పెద్ద కమతాల్లోని ప్రతి మొక్క, చెట్టు వద్దకి రైతులు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించడం కష్టం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో డ్రోన్లు ఎంతగానో సాయపడతాయి.

పంట విస్తీర్ణం అధికంగా ఉండి.. ప్రతిచోటుకూ రైతులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లను పంపించవచ్చు. దానికుండే ప్రత్యేక పరికరం రైతు సెల్‌కు ఫొటోతోపాటు మెసేజ్‌ను పంపిస్తుంది. అంతేకాకుండా నేల పరిస్థితి ఎలా ఉంది..? వాతావరణం ఎలా ఉంది..? వంటి విషయాలను ఎప్పటికప్పుడు రైతుకు అప్‌డేట్ చేస్తుంది.

పంట నష్టం అంచనాలో ప్రస్తుతం అమలు చేస్తున్న పద్ధతులు రైతులకి మేలు చేయడం లేదు. తుపాన్లు, అకాల వరదలతో పంటలు దెబ్బతిన్న సమయంలో నిర్వహిస్తున్న సాధారణ సర్వేలో కచ్చితత్వం ఉండడం లేదు. అధికారులు తూతూ మంత్రంగా లెక్కలు వేసి నివేదికలిస్తున్నారు. పొలంలో దిగడం సాధ్యం కాని చోట గాల్లో అంచనాలు కట్టి వివరాలు నమోదు చేస్తున్నారు. రైతుల సహనాన్ని పరీక్షించి చివరికి ఉసూరుమనిపించే ఈ విధానం ఇకముందు మారబోతోంది. విలువైన సమయాన్ని ఆదాచేసి మనుషులు అడుగుపెట్టలేని ప్రాంతాల్లో సైతం అత్యంత నాణ్యమైన ఫోటోలు తీసే విహంగాలు అందుబాటులోకి వచ్చాయి.

పంట నష్టం అంచనాలో సమగ్ర వివరాలకోసం అత్యాధునిక డ్రోన్ పరికరాల వాడకం ఈమధ్యకాలంలో మొదలైంది. మూడు కిలోమీటర్ల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల్లో పంటల స్థితిగతులను సర్వే చేసి ఫోటోలను తీసే డ్రోన్లను గతేడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాపట్లలో తొలిసారి ప్రయోగాత్మకంగా వాడింది. డ్రోన్‌ల వాడకం ద్వారా ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో వివరాల సేకరణ సులభమవుతుంది.

జీపీఎస్ పరిజ్ఞానం వల్ల ఏయే ప్రాంతాల్లో ఫోటోలు తీసిందనేది తెలియడమే కాకుండా. వాటి వివరాలను మ్యాపింగ్ చేస్తుంది. డ్రోన్ల ద్వారా అధికారులకి సర్వే నిర్వహణ తేలికవడంతో పాటు అటు రైతులకి సకాలంలో పరిహారం మంజూరయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఒక్క మందుల పిచికారీ, పంట నష్టం సర్వే మాత్రమే కాకు నీటి వనరులు, నేలలోని పోషకాలు గుర్తించే డ్రోన్లు తయారయ్యాయి.

సాంకేతిక పరిజ్ఞానం వాడకంలో ఏపీ సర్కార్ ముందుంది. క్లౌడ్ కంప్యూటింగ్ , ఈక్రాప్ నమోదు వంటి వాటితో వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానిస్తోంది. గోదావరి పుష్కరాల్లో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ, అనంతపురంలో కరవు వల్ల ఎండిపోయిన పంటల వివరాల నమోదు, భవనాలు, విద్యుత్‌ స్తంబాల సర్వేకు డ్రోన్లని ఉపయోగించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి అభివృద్ధి పథకాల అమలను సమర్థంగా పర్యవేక్షిచేందుకు వీలుగా 8 రంగాల్లో డ్రోన్‌లను వాడేలా కేంద్ర పౌర విమానయానశాఖ నుంచి అనుమతి పొందింది. విదేశాల నుంచి వీటి దిగుమతికి డీజీసీఏ నిరభ్యంతర పత్రం ఇచ్చింది. ఇలా అనుమతి తీసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. పైగా వివిధ రంగాల్లో డ్రోన్ల వాడకాన్ని పెంచడమే కాకుండా వీటి తయారీని సైతం చేపట్టింది.

ఒక ప్రాంతంలో ఒకేసారి సస్యరక్షణ చేపట్టడం వల్ల పురుగులు ఇతర పొలాల్లోకి పారిపోయే అవకాశం ఉండదని, ఫలితంగా చీడపీడలు అదుపులోకి వస్తాయని ఆలోచిస్తోంది. ఇలా చేయడం వల్ల కూలీలు, నీరు, మందుల వ్యయాలు భారీగా తగ్గుతాయని అంచనా వేస్తోంది. అందుకే యాంత్రీకరణ మాదిరిగా డ్రోన్‌లని కూడా రాయితీపై సరఫరా చేయాలని ప్రణాళిక రచిస్తోంది. దీనిపై రంగా వర్సిటీ నివేదిక రూపొందించింది.
తెలంగాణలోనూ డ్రోన్ల వాడకం ప్రారంభమైంది. అపరాలు, వాణిజ్య పంటల ఎదుగుదల, చీడపీడల ఉదృతని సమీక్షించడానికి డ్రోన్ తీసిన ఛాయాచిత్రాలు , దృశ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అసలు ఈ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి.? డ్రోన్ల వినియోగించాలంటే ఎలాంటి అనుమతులు తీసుకోవాలి.? కేంద్రం మార్గదర్శకాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

పైలట్ కంట్రోలర్, రెక్కలు, ఛార్జర్, బ్యాటరీలు, కెమెరాలు, నాజిల్స్ మెమొరీ కార్డులు, టాబ్లెట్‌, క్లౌడ్ ప్రాసెసింగ్‌ కి సమాచారం పంపే సాఫ్ట్‌వేర్ ఇవీ ప్రాథమికంగా డ్రోన్ పరికరాలు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్, చిన్నపాటి జీపీఎస్ మాడ్యూల్స్, అధిక శక్తి కలిగిన కంప్యూటర్ ప్రాసెసర్లు, చిన్నపాటి డిజిటల్ రేడియోస్ అన్నవి డ్రోన్లలోని నూతనత్వాలు. మన దశంలో ఐదు రకాల పరిమాణంలో డ్రోన్లు వాడడానికి కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. అవి నానో, మైక్రో, మిని , స్మాల్, లార్జ్‌. కనిష్టంగా 250 గ్రాములు, గరిష్టంగా 150 కిలోల వరకు బరువుంటాయి.

డ్రోన్లు వినియోగించడానికి దేశంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 250 గ్రాములకంటే తక్కువ బరువున్న నానోడ్రోన్ల వాడకానికి ఎటువంటి లైసెన్సు అవసరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం డ్రోన్ల వాడకానికి సంబంధించి కొత్త విధానం తీసుకొస్తోంది. పరిమాణాన్ని బట్టి వాటిని వర్గీకరించి, డ్రోన్‌లకు విశిష్ట గుర్తింపు సంఖ్యలను, రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌లనూ తప్పనిసరి చేయబోతోంది.

ఇక డ్రోన్ పనిచేసే విషయానికి వస్తే...పైలట్ కంట్రోలర్, మొబైల్ యాప్‌, స్మార్టు‌ఫోన్ లేదా కంప్యూటర్ ఆదేశాల ద్వారా పనిచేస్తుంది. వైమానిక ఇమేజింగ్ మ్యాపింగ్ ద్వారా నిర్దిష్ట ప్రాంతంలో నడిపించవచ్చు. డ్రోన్‌ ప్రత్యేకతలు, పనితనంరీత్యా రోజు రోజుకి వీటి అవసరం, వినియోగం పెరుగుతోంది.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. భవిష్యత్తులో వీటి స్థానాన్ని రోబోలు, డ్రోన్‌లు ఆక్రమిస్తాయని అధ్యయనాలు చాటుతున్నాయి. ప్రధానంగా సేద్య రంగంలో విప్తవాత్మక మార్పు తీసుకురానున్నాయని పాశ్చాత్య దేశాల అనుభవాలు వ్యక్తీకరిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా రోబోటిక్స్‌, డ్రోన్ల వినియోగం ఏటికేడు గణనీయంగా పెరుగతున్నట్లు అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ సైతం వెల్లడించింది. ఎన్నో రంగాల్లో వీటి కోసం పెట్టే ఖర్చు 2018 ఆఖరు నాటికి 103 బిలియన్ డాలర్లు అంటే సుమారు ఆరున్నర లక్షల కోట్లకి చేరుతుందని తాజాగా పేర్కొంది. ఇందులో డ్రోన్లు కీలక పాత్ర పోషించనున్నట్లు వెల్లడించింది.

ఇదే జరిగితే రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలోనూ డ్రోన్లని చూడవచ్చు. రైతులు ఎరువులు, పురుగుమందులు చల్లడానికి కూలీలను వెతుక్కోవాల్సిన తిప్పలు తప్పుతాయి. ఎంత పెద్ద కమతాల్లోనైనా పొలం గట్టుపైనే నిలబడి ఒక్క డ్రోన్‌తో నిమిషాల్లో మందులు పిచికారీ చేసేయవచ్చు. ఒక్కసారి డ్రోన్‌ని చేనంతా తిప్పేసి పంట ఎదుగుదల, చీడల జాడని పసిగట్టేయవచ్చు.

సూక్ష్మంలో మోక్షంలా బుల్లి విహంగాలతో అద్భుత ప్రయోజనాలున్నా ప్రస్తుతానికైతే ఖరీదు మాత్రం కాస్త ఎక్కువే. డ్రోన్ సైజు, సామర్థ్యాన్ని బట్టి లక్షన్నర నుంచి 10 లక్షల వరకు పలుకుతున్నాయి. మిగతా యంత్రాల మాదిరిగా ప్రభుత్వమే ప్రతి గ్రామానికి సరఫరా చేస్తే సామాన్య రైతులు వినియోగించుకోగలుగుతారు.

ఒకే రకం పంట పొలాల్లో ఒకేసారి పిచికారీ చేయడం వల్ల చీడపీడల తీవ్రత తగ్గుతుంది. ఈ పయనంలో కొన్ని సాంకేతిక అవరోధాలని అధిగమించాల్సిన అవసరముంది. నీడ, వెలుతురు సమస్యలతో ఫోటో నాణ్యత తగ్గే పరిస్థితులకి పరి‌ష్కారం కనుగొనాలి. అలాగే డ్రోన్లు తీసిన ఫోటోలని పరిశీలించి నివారణ మార్గాలు సూచించే వ్యవస్థ, వ్యక్తులను తయారు చేయాలి. చట్టపరంగా, భద్రతపరంగా డ్రోన్లను ఉపయోగించడానికి పైలెట్లకి శిక్షణ ఇవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా పంటలపై మూడు నాలుగు అడుగుల ఎత్తు నుంచి గాలిలో రసాయన పురుగుమందులు పిచికారీ చేయడం ద్వారా తలెత్తే సమస్యలు, పర్యావరణ కాలుష్య, ఆరోగ్య ముప్పు అంశాలపై దృష్టి పెట్టాలి.

అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారు డ్రోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు చల్లడానికి, శ్రమ, శక్తిని తగ్గించుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు చల్లడానికి ఉపయోగపడుతుండటంతో ఇవి ఎక్కువ మందినే ఆకర్షిస్తున్నాయి.

Next Story