కాళ్లు విరగ్గొట్టారు.. రామంతాపూర్‌లో దారుణం

కాళ్లు విరగ్గొట్టారు.. రామంతాపూర్‌లో దారుణం
x
Highlights

హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ల బాలుడికి ఫిజియోథెరపి చేస్తూ.. వైద్యుడు ఏకంగా కాలు...

హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ల బాలుడికి ఫిజియోథెరపి చేస్తూ.. వైద్యుడు ఏకంగా కాలు విరగ్గొట్టాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రికి చెందిన వైద్యుడు కిరణ్‌కుమార్‌ బాలుడికి ఫిజియోథెరపీ చేస్తూ.. కాలు విరగ్గొట్టాడు. డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి తమ చిన్నారి కాలు విరగ్గొట్టాడని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. దీనిపై వైద్యుడిని నిలదీశారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలని చెప్పి.. సదరు వైద్యుడు చేతులు దులుపుకొన్నాడు. వైద్యుడి నిర్వాకంపై ఫిర్యాదు చేసినా ఆస్పత్రి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని బాలుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు.

సంగారెడ్డికి చెందిన భాస్కర్ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. భాస్కర్ ఏకైక సంతానమైన అభిషేక్ రెండున్నరేళ్ల వయస్సు వచ్చినా నడవలేడు. కనీసం కూర్చోలేడు. ఎన్నిచోట్ల చూపించినా ప్రయోజనం దక్కలేదు. తెలిసిన వాళ్లు కొందరు హైదరాబాద్ రామాంతపూర్‌లోని హోమియో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తే నయమవుతుందని చెప్పడంతో అక్కడి వైద్యుడు కిరణ్‌కుమార్‌ను బాలుడి తల్లిదండ్రులు సంప్రదించారు. దీంతో కొడుకు వైద్యం కోసం దంపతులిద్దరూ సిటీకి మకాం మార్చి రామాంతపూర్‌లోని హోమియో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే, ఫిజియోథెరపీలో చేస్తున్న వైద్యుడు కిరణ్ గత నెల 14వ తేదీన తనకు వచ్చీరాని వైద్యంతో మోటు పద్ధతుల్లో వ్యవహరించాడు. బాబు కాలిని బలవంతంగా అతడి కనుబొమ్మలకు తాకే విధంగా మలిచాడు. అంతే ఆ అవస్థను భరించలేక ఒక్కసారిగా కేకలు పెట్టాడు. ఆ సమయంలో ఎముక విరిగినట్టు శబ్ధం కూడా వచ్చింది. అనుమానంతో తల్లిదండ్రులు డాక్టరును నిలదీస్తే వేరే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని సూచించాడు.

దీంతో చేసేదేమీ లేక మరో వైద్యుడి వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే.. తెలిసింది బాలుడి కాలు ఎముక విరిగిందని. అసలే పూట గడవని పరిస్థితిలో ఉన్న భాస్కర్ దంపతులకు కొడుక్కి చికిత్స చేయించడం భారంగా మారింది. దీంతో స్థానికులు తలోచేయి వేసి కాలు ఆపరేషన్‌కు సాయం చేశారు. తమ కొడుక్కి కాలు బాగై నడక వస్తుందని ఆశపడితే, ఆఖరికి ఆ డాక్టర్ కాలు విరగ్గొట్టాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ పడుతున్న బాధను చూడలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. తమ కొడుకు కాలు విరగ్గొట్టిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అంబర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories