అన్నదమ్ముల సవాల్...ఎన్నికల తర్వాత పార్టీ ఉండదు

x
Highlights

డిఎంకేలో అసమ్మతి నివురు గప్పిన నిప్పులా ఉందా? ఏ క్షణమైనా అది భగ్గుమంటుందా? కరుణానిధి శకం ముగిశాక డిఎంకే పతనం మొదలైందా? అన్నదమ్ములిద్దరూ చెరో వైపు...

డిఎంకేలో అసమ్మతి నివురు గప్పిన నిప్పులా ఉందా? ఏ క్షణమైనా అది భగ్గుమంటుందా? కరుణానిధి శకం ముగిశాక డిఎంకే పతనం మొదలైందా? అన్నదమ్ములిద్దరూ చెరో వైపు తండ్రి చరిష్మానీ, పార్టీని లాగితే, డిఎంకే భవిష్యత్తు ఏమవుతుంది? డిఎంకేలో విభేదాలు బిజెపికి వరంగా మారతాయా?

కరుణానిధి మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్న మొన్నటి వరకూ డిఎంకే లో విభేదాలున్నా అంతగా పైకి తేలలేదు. కరుణానిధి ఉన్నంత వరకూ అళగిరిని కంట్రోల్ చేస్తూ వచ్చారు కానీ ఆ సయోధ్య, సఖ్యత మూణ్ణాళ్ల ముచ్చటేనని తేలిపోయింది. కరుణానిధి అంత్యక్రియల సమయంలో అన్నదమ్ములిద్దరూ కలసినట్లే కనిపించారు. తండ్రి మరణం విషాదాన్ని కలసి పంచుకున్నారు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు.

కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి రివర్స్ అవుతున్నారా? తండ్రి సమాధి సాక్షిగా తిరుగుబాటుకు ప్లాన్ చేస్తున్నారా? పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. డిఎంకే వారసత్వ పగ్గాల కోసం తమ్ముడు స్టాలిన్ తో విభేదిస్తున్నారు. మెరీనా బీచ్ లోని అన్నా మెమోరియల్ హాల్ సందర్శించిన అళగిరి తన తండ్రి సమాధి దగ్గర శ్రధ్ధాంజలి ఘటించారు. తన తండ్రి సమాధి సమక్షంలో మనసులో ఆవేదన బయటపెట్టడానికి వచ్చానని అళగిరి అన్నారు అళగిరికి, కరుణ చిన్న కుమారుడు స్టాలిన్ కు అస్సలు పడదు వారం రోజుల మౌనం తర్వాత అళగిరి క్రియాశీలకంగా మారుతున్నట్లు ఆయన కదలికలు చెబుతున్నాయి. కరుణానిధి సమాధి దగ్గర కొంత సేపు గడిపిన అళగిరి కరుణానిధి అసలైన కార్యకర్తలంతా తనవెంటే ఉన్నారంటూ కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. తాను డిఎంకే పార్టీలో లేనని కుండబద్దలు కొట్టిన అళగిరి డిఎంకేకు సమాంతరంగా మరో కొత్త రాజకీయ పార్టీని స్థాపించే ఉద్దేశంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

డిఎంకేలో తనను చేర్చుకోడానికి స్టాలిన్ సిద్ధంగా లేడంటూ అళగిరి కామెంట్ చేశారు. పార్టీలో తానొక బలమైన నేతగా ఎదుగుతానన్న భయం వారిలో ఉందని అందుకే తనను చేరనివ్వరనీ వ్యాఖ్యానించారు. అంతేకాదు డిఎంకేలో కీలక పదవులన్నీ అమ్మేసుకున్నారని ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రానున్న ఆరు నెలల్లో తన భవిష్యత్తు నిర్ణయించుకుంటానన్నారు. డిఎంకేకు ఇప్పుడున్న నాయకత్వం పార్టీని భ్రష్టు పట్టిస్తుందన్నారు. డిఎంకేలో చాలా మంది రజనీతో మంతనాలు సాగిస్తున్నారని, ఎన్నికల తర్వాత పార్టీ తుడిచిపెట్టుకు పోతుందనీ చెప్పారు. తన మద్దతు దారులతో మాట్లాడుతున్నానన్న అళగిరి పార్టీకి చేటు చేసే వారందరినీ తలైవార్ శిక్షిస్తారంటున్నారు. డిఎంకే పార్టీ పరిస్థితి బాగుంటే.. ఆర్ కే నగర్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకపోడానికి కారణాలేంటని ప్రశ్నించారు. డబ్బులు తీసుకుని ఓటమిని అంగీకరించారన్నారు.

2014లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కరుణానిధి అళగిరిపై వేటేశారు. అప్పటినుంచీ ఆయన డిఎంకే కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అళగిరికి దక్షిణ తమిళనాడు పై తిరుగులేని పట్టుంది. కరుణానిధి మరణం తర్వాత నేడు తొలిసారిగా డిఎంకే పార్టీ సమావేశం జరుగుతున్న తరుణంలోనే అళగిరి ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి సమావేశంలో పార్టీలో సంస్థాగత మార్పులుంటాయని, కరుణ స్థానంలో పార్టీ అధ్యక్షునిగా స్టాలిన్ ను ఎన్నుకుంటారనీ తెలుస్తోంది. అళగిరి, స్టాలిన్ మధ్య సయోధ్య కుదర్చడం ఇప్పట్లో సాధ్యం కాదని 2019 ఎన్నికలే టార్గెట్ గా అడుగులేస్తున్న డిఎంకే అళగిరి విషయాన్ని పట్టించుకోకపోవచ్చనీ కొందరు డిఎంకే నేతలు చెబుతున్న మాట.

స్టాలిన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూనే పార్టీపై అపారమైన పట్టు సంపాదించారు. మరోవైపు అళగిరికి కూడా పార్టీలో మంచి పట్టే ఉంది. స్టాలిన్ ను తీవ్రంగా తిట్టడంతో మనస్తాపం చెందిన కరుణానిధి అళగిరిని సస్పెండ్ చేశారు. ఏనాటికైనా స్టాలినే డిఎంకే అధ్యక్షుడవుతారని కరుణానిధి ఆనాడే ప్రకటించారు. మరి మంగళవారం నాటి సమావేశంలో జరిగే పరిణామాల తర్వాత అళగిరి దూకుడు పెంచుతారా? వేరే కుంపటి పెడతారా అన్నది చూడాలి. డిఎంకేలో రేగిన ఈ అలజడిని కాసుకు కూర్చున్న బిజెపి తనకు అనుకూలంగా మార్చుకుంటుందా? జయ మరణానంతరం అన్నా డిఎంకేలో సంక్షోభంలో వేలు పెట్టేందుకు బిజెపి ప్రయత్నించింది. ఇప్పుడు డిఎంకే రాజకీయాల్లోనూ వేలు పెడుతుందా?

Show Full Article
Print Article
Next Story
More Stories