ముందస్తు టికెట్లు

x
Highlights

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుందా ? గెలుపే లక్ష్యంగా అధికార టీడీపీ మరోసారి కార్యాచరణ ప్రారంభించిందా ? తెలంగాణ తరహాలోనే అభ్యర్ధులను ముందస్తుగానే...

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుందా ? గెలుపే లక్ష్యంగా అధికార టీడీపీ మరోసారి కార్యాచరణ ప్రారంభించిందా ? తెలంగాణ తరహాలోనే అభ్యర్ధులను ముందస్తుగానే ప్రకటించాలని అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? నియోజకవర్గాల వారిగా సర్వేలను వేగవంతం చేస్తున్నారా ? పోటీ పడుతున్న అభ్యర్ధులతో పాటు అసంతృప్తుల జాబితాలు సీఎం చంద్రబాబుకు చేరాయా ? అంటే అవుననే సమాధానాలు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌ వరకు వినిపిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుందనే వార్తల నేపధ్యంలో అధికార టీడీపీ ఎన్నికలకు సమాయత్తమైంది. అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా అభ్యర్ధులను ఖరారు చేయడంతో పాటు నియోజకవర్గాల వారిగా అభ్యర్ధుల బలాబలాలు, ప్రత్యర్ధుల జాబితా, సొంత పార్టీలో అసంతృప్తులను పసిగట్టే పనిలో పడ్డారు. గత ఎన్నికల్లో సెంచరీ సాధించిన చంద్రబాబు ఈసారి క్లీన్‌ స్వీప్‌ చేయడమే లక్షంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల సమాయత్తంలో భాగంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు చేసిన అభివృద్ధితో గెలుపు ఏకపక్షం కావాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘మళ్లీ టీడీపీ రావాలి’ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలని నేతలకు వివరించారు.

నియోజకవర్గాల వారిగా నేతల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరులపై దృష్టి సారించిన చంద్రబాబు కట్టుబాట్లు తప్పితే కఠిన నిర్ణయాలు తప్పవంటూ నేతలను హెచ్చరించారు. ఇదే సమయంలో పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న బీసీలకు అండగా నిలిచేలా ఈ నెల 30న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జయహో బీసీ చేపట్టాలని సూచించారు. దీంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చేరవయ్యేలా సభలు సమావేశాలు నిర్వహించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు .

శాసనసభతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున జాతీయ స్ధాయి ప్రభావం ఉండే అవకాశాలున్నాయని చంద్రబాబు నేతలకు వివరించారు. ప్రస్తుతానికి బీజేపీ దేశ వ్యాప్తంగా బలహీనపడిందని అయిదు రాష్ట్రాల ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అన్నారు. రైతుల్లో తీవ్ర అసహనం నెలకొన్నందున బీజేపీకి సీట్లు భారీగా తగ్గే అవకాశాలున్నట్టు విశ్లేషించారు. దేశ రాజకీయాల్లో మూడో కూటమికి చోటు లేదన్న చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు పరోక్షంగా బీజేపీకే సహరిస్తాయన్నారు.

సమీక్ష సమావేశం సందర్బంగా టీఆర్ఎస్ తీరును చంద్రబాబు తప్పుబట్టారు. రోజుకో మాట పూటకో బాట పట్టే టీఆర్ఎస్‌ ప్రత్యేక హోదా విషయంలో సోనియా వ్యాఖ్యలను రాజకీయం చేసి తనకు అనుకూలంగా మార్చుకుందన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు సంబరాలు చేసుకోవడంతోనే బీజేపీతో ఆ పార్టీలకు ఉన్న లాలూచీ బయటపడిందన్నారు. పొత్తులపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాలు ఉండవన్న చంద్రబాబు నేతల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరుగుతోందని దేశ ప్రయోజనాలు, ప్రజా స్వామ్య పరిరక్షణ దృష్ట్యా కాంగ్రెస్‌తో కలవాలనే దానిపై మరోసారి చర్చిస్తామన్నారు. పొత్తులపై క్లారిటీ ఇవ్వకపోయినా పోటీకి కేడర్‌ను సిద్ధం చేయడంతో చంద్రబాబు ఏపీలో ఎన్నికల వేడిని రాజేసినట్టు పార్టీ నేతలు భావిస్తున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories