ఫోన్ ట్యాపింగ్ నిజమే..చట్టానికి లోబడే ఫోన్ల ట్యాపింగ్‌!

ఫోన్ ట్యాపింగ్ నిజమే..చట్టానికి లోబడే ఫోన్ల ట్యాపింగ్‌!
x
Highlights

తెలంగాణలో ఫోన్ల ట్యాపింగ్ నిజమేనని తేలింది. అయితే జాతీయ భద్రత, నేరాల నిర్మూలన కోసమే కట్టుదిట్టమైన విధివిధానాలకు లోబడే ఫోన్ల ట్యాపింగ్‌ చేస్తున్నామని...

తెలంగాణలో ఫోన్ల ట్యాపింగ్ నిజమేనని తేలింది. అయితే జాతీయ భద్రత, నేరాల నిర్మూలన కోసమే కట్టుదిట్టమైన విధివిధానాలకు లోబడే ఫోన్ల ట్యాపింగ్‌ చేస్తున్నామని తెలంగాణ ఎన్నికల సంఘానికి డీజీపీ వివరణ ఇచ్చారు. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా, అక్రమ పద్ధతుల ద్వారా ఫోన్ల ట్యాపింగ్‌ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్, వాహనాల తనిఖీ గురించి తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ కోరిన వివరణకు డీజీపీ మహేందర్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం అక్రమంగా ట్యాపింగ్‌ చేస్తోందని, విపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసు శాఖ వాహనాల తనిఖీలు నిర్వహిస్తోందన్న మహా కూటమి నేతలు చేసిన ఆరోపణలపై రెండు పేజీల వివరణ ఇచ్చారు. అంతా చట్ట ప్రకారమే జరుగుతోందంటూ తేల్చి పడేశారు.

జాతీయ భద్రత, రక్షణ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర హోమ్ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే అవసరమనుకుంటేనే ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నామని తెలంగాణ డీజీపీ ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. సమాజంలో అక్రమాల నిరోధానికి, చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌ను కాపాడేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి చట్టబద్ధ ఏర్పాట్లున్నాయని గుర్తు చేశారు. అలాగే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగానే పోలీసులు పని చేస్తున్నారని డీజీపీ స్పష్టం చేశారు. వాహనాల తనిఖీ సహా ఎన్నికల నియమావళికి సంబంధించి తాము ఎలాంటి వివక్షా చూపడం లేదన్నారు డీజీపి.

డీజీపి ఈసీకి ఇచ్చిన సమాధానంలో ఎక్కడా విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ గురించి ప్రస్తావించలేదు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందా లేదా అని తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ రజిత్ కుమార్‌ ప్రశ్నించగా చట్ట ప్రకారం మాత్రమే చేస్తున్నామని డీజీపీ సమాధానమివ్వడం విశేషం. ఫోన్ ట్యాపింగ్‌పై డీజీపీ సూటిగా సమాధానం చెప్పక పోయినా ఆయన వివరణపై రజత్ కుమర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ల ట్యాపింగ్‌ విషయంలో కేంద్ర హోంశాఖ నిబంధనలను అమలు చేస్తున్నామని చెప్పడం ద్వారా రాజకీయ పార్టీల నేతల ఫోన్లను ట్యాప్‌ చేయట్లేదని డీజీపీ పరోక్షంగా తెలిపారని రజత్ కుమార్ అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories