నాలుగో ముడి వేసుకుంటున్నానంటూ భర్తకు లేఖ రాసి...

నాలుగో ముడి వేసుకుంటున్నానంటూ భర్తకు లేఖ రాసి...
x
Highlights

జీవితంపై విసుగు చెందిన ఓ మహిళ తన కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన మహిళ, ఆమె మూడేళ్ల కూతురు హైదరాబాదులోని దిండిగల్‌లో గల...

జీవితంపై విసుగు చెందిన ఓ మహిళ తన కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన మహిళ, ఆమె మూడేళ్ల కూతురు హైదరాబాదులోని దిండిగల్‌లో గల తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని.. తాము రాకుండానే మృతదేహాన్ని పోలీసులు తరలించడమేంటని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా, బొప్పాపూర్‌ మండలం, రాఘవపూర్‌ గ్రామానికి చెందిన రేణికుంట నర్సింహులు, చంద్రవ్వ కూతురు కవిత అలియాస్‌ సృజన(23) ఎంబీఏ చదువుకుంది. అదే మండలం బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన శంకర్‌తో ఫిబ్రవరి 5, 2014న పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. బతుకుదెరువు నిమిత్తం భార్యతో నగరానికి వచ్చిన శంకర్‌ కొద్ది రోజులు బేగంపేట్‌ తర్వాత బాలానగర్‌ ప్రాంతాల్లో నివాసం ఉన్నాడు. సూరారం రాజీవ్‌గృహకల్పలో 41బ్లాక్‌, నెంబర్‌ 23వ ఇంటిని ఎనిమిది నెలల క్రితం కొనుగోలు చేసి అప్పటి నుంచి భార్య కవిత, కూతురు శ్రీజ(3)తో నివసిస్తున్నాడు. అతడు బేగంపేట్‌లోని మ్యారీగోల్డ్‌ హోటల్‌లో పనిచేస్తున్నాడు. పని నుంచి తిరిగి వచ్చిన భర్త శంకర్ తల్లీకూతుళ్లు ఉరేసుకున్న దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

భర్త శంకర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని, అందుకే తాము రాకుండానే మృతదేహాన్ని పోలీసులు తరలించారని సృజన తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. తాను మృతదేహాలను చూసి శంకర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సృజన సోదరుడు అంబయ్యకు ఫోన్ ద్వారా చెప్పాడు. సృజన కుటుంబ సభ్యులు రాకుండానే పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
తమ కుమార్తెకు ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నిత్యం వేధించేవాడని.. మగపిల్లాడిని కనాలని బెదిరించేవాడని తల్లి చంద్రమ్మ కన్నీటిపర్యంతమైంది. సృజన నాలుగు నెలల గర్భవతి అని.. తాము రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్‌ను విచారణ నిమిత్తం పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శంకరయ్య తెలిపారు.

ఐ లవ్‌ యూ శంకర్‌... చేసిన ప్రమాణాలకు, వేసుకున్న ముడులకు న్యాయం చేయలేకపోతున్నాను. నాలుగో ముడిని వేసుకుంటున్నాను. నీకు చాలా భవిష్యత్‌ ఉంది. దానిని నాశనం చేసుకోకు. నా వలన నీవు చాలా ఇబ్బంది పడ్డావు... నా కథ ముగిసిపోతోంది. ఈ విషయంలో ఎవరితో గొడవపడొద్దు. నీవు మళ్లీ పెళ్లి చేసుకోవాలి, నీ భవిష్యత్‌ బాగుండాలి. నీకు భారం కాకూడదని కూతురిని కూడా నా వెంటే తీసుకెళుతున్నాను. అమ్మా, నాన్నా మీరు చెప్పిన ధైర్యం నా గుండెకు సరిపోవడం లేదు. అందుకే దానిని ఆపేస్తున్నాను... అని కవిత రాసిన సూసైడ్‌ నోట్‌ గదిలో లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories