logo

ఒకరు బరాత్‌లో కుప్పకూలారు..మరొకరు రిసెప్షన్‌లో పడిపోయారు..ఎందుకిలా?

ఇనుప కండరాలు ఉక్కు నరాలు లేవు. నాడీ వ్యవస్థను డామినేట్‌ చేసే నర్వ్స్‌ కనిపించవు. ఏదీ జీర్ణించుకునే శక్తీ లేదు. ఏదో ఆకారం ఉందా అంటే ఉందీ అన్నట్టుగా ఉండే శరీర వ్యవస్థ. ఏంటీ ఈతరం యూత్‌కు ఏమవుతుంది.? ఏదీ తట్టుకోలేనంత నిస్సత్తువ ఎందుకిలా? మొన్నీ మధ్య రాజస్థాన్‌లో ఓ ఫ్యామిలీ పార్టీలో డ్యాన్స్‌ చేస్తూ ఉన్నదున్నట్టుగా కుప్పకూలిన యువకుడి విషాదాంతం.. యువతరానికి ఇస్తున్న మెసేజ్‌ ఏంటి?

యంగ్‌ కపుల్‌ డ్యాన్స్ ఇది... ఉత్సాహం ఉరకలెత్తే వయస్సు వారిది..కొత్తగా పెళ్లయిన సందర్భం అది..బంధువులు ఒకవైపు. స్నేహితులు మరోవైపు. ఈలలు... చప్పట్లు..అంతలోనే అనుకోని సంఘటన. ఏం జరిగింది?

అదేంటో తెలుసుకునే లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. అప్పుడే ఓ కొత్త రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ జంటను విధి అత్యంత కిరాతకంగా విడదీసింది. దారుణంగా వేటాడి వెంటాడింది. అనుకోని ఘటనతో అవాక్కయ్యేలా చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ జీవితాన్ని అథ:పాతాళానికి తొక్కేసింది.

రాజస్థాన్‌లోని బార్మర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బార్మర్‌లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన జంట స్టేజీపై తుజే దేకా తో హే జానా సనం' పాటకు డ్యాన్స్ చేశారు. ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్న సందర్భంలో ఆమె భర్త ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అతనేదో సరదాకి ఆటపట్టిస్తున్నాడనుకున్న భార్య అలాగే డ్యాన్స్ చేస్తూ అతన్ని లేపడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలియగానే ఒక్కసారిగా అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. హఠాత్తుగా గుండెపోటు రావడం వల్లే అతను చనిపోయాడని చెబుతున్నారు.

ఇదే ఉదాహరణ కాదు కిందటేడాది మే నెలలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గుజరాత్‌లో ఓ యువకుడు పెళ్లి బరాత్‌లో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ అనూహ్యంగా కుప్పకూలిపోయాడు. పెళ్లి ఊరేగింపులోనే పెళ్లి కొడుకు చనిపోయిన ఘటన గుజరాత్ వడోదరలో జరిగింది. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్‌ చేస్తున్న పెళ్లి కొడుకు హఠాత్తుగా మరణించాడు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన వరుడిని అతని స్నేహితులు భుజంపై ఎక్కించుకుని పెళ్లికి వూరేగింపుగా తీసుకెళ్తున్నారు. పెళ్లికొడుకు కూడా ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు.

ఇంతలో ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని కిందకి దింపి లేపడానికి చాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే వరుడు చనిపోవడం అంతులేని మాటలకందని విషాదం. మరో గంటలో వధూవరులు వివాహ బంధంతో ఒక్కటవుతారనగా వరుడు ఇలా గుండెపోటుతో కుప్పకూలడం నిజంగా అత్యంత దారుణం. కాబోయే భర్త కళ్లముందే చనిపోవడంతో వధువు కన్నీరుమున్నీరైంది.

ఎందుకిలా జరుగుతుంది.? యువకుల్లో ఎందుకింత నిస్సత్తువ. డ్యాన్స్‌ చేస్తే చచ్చిపోవాలా? మన నాడీ వ్యవస్థ బాడీ వ్యవస్థ కనీసం చిన్నపాటి డ్యాన్స్‌ను కూడా తట్టుకోలేని విధంగా తయారైందా? మనం అలా మార్చుకుంటున్నామా? మానసిక ఒత్తిడి.. మనిషి నరాల వ్యవస్థకు చెదల పట్టిస్తుందా?

మానవ జీవితంలో ఇప్పుడు ఒత్తిడి మాములు విషయమైపోయింది. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యం మనసుపై, గుండెపై విపరీతమైన ప్రభావం చూపిస్తుందంటారు వైద్య నిపుణులు. అలాంటప్పుడే మనిషి భయంకరమైన ఒత్తిడిని ఎదుర్కొంటారని చెబుతున్నారు. ఇక మామలుగా ఉండటం, విపరీతమైన పరిస్థితుల ప్రభావానికి లోనవడం లాంటి ఘటనలు పక్కనపెడితే డ్యాన్స్‌కి ముందు వామప్‌ చేసుకోవడం లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటున్నారు నృత్య నిపుణులు.

ఉద్రేకపూరితమైన ఒత్తిడి ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది కొరియాగ్రాఫర్ల అభిప్రాయం. రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ ఉన్నప్పటికీ తామే ఒకరకమైన ఒత్తిడి నుంచి విముక్తి కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు. అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, ఆందోళన ఉన్న వాళ్లు ఇలాంటి డ్యాన్స్‌ల విషయంలో మరింత కేర్‌ తీసుకోవాలంటారు. ఒత్తిడి అనేది జీవితంలో ఒక తప్పించలేని భాగం, అయితే దీనిని ఎదుర్కోవటానికి చాలా ప్రాక్టీస్‌ కావాలంటారు. జీవనశైలిలో మార్పులను స్వాగతించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా దీన్ని అధిగమించవచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top