టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పనున్న డీఎస్

x
Highlights

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కారు దిగడం ఖాయమైపోయింది. అధికార పార్టీకి గుడ్‌బై చేప్పేయనున్నారు. నిజామాబాద్‌లో తన ప్రధాన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో...

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కారు దిగడం ఖాయమైపోయింది. అధికార పార్టీకి గుడ్‌బై చేప్పేయనున్నారు. నిజామాబాద్‌లో తన ప్రధాన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న డీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీని వీడాలంటూ మెజార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారి అభీష్టం మేరకు నడుచుకుంటానని డీఎస్ ప్రకటించారు. మరి డీఎస్ కారు దిగితే నెక్ట్స్ హస్తం గూటికి చేరతారా..? కమలం దళంలో చేరతారా..?

రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు చక్రం తిప్పిన డి. శ్రీనివాస్‌కు ఇప్పుడు కష్టాలొచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరిన డీఎస్‌కు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. డీఎస్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసి అధినేతకు పంపారు. దీంతో ప్రజాప్రతినిధుల లేఖపై సీఎం కేసీఆర్‌ను కలిసి వివరణ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు డీఎస్. అయితే, సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన డీఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

ఇదే సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై కొడుకు సంజయ్‌ని అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని కూడా డీఎస్ జీర్ణించుకోలేకపోయారు. అధికార పార్టీ నుంచి బయటకు పంపాలని ప్రజాప్రతినిధులు తీర్మానం చేయడం, సంజయ్‌ జైలు నుంచి విడుదల కావడంతో ఆయన తొలిసారిగా జిల్లాకు వచ్చారు. దీంతో ఇందల్‌వాయి టోల్‌గేట్ వద్ద డీఎస్‌కు కార్యకర్తలు, అనుచరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మున్నూరు కాపు కల్యాణమండపంలో భవిష్యత్‌ కార్యాచరణపై వారితో చర్చించారు. ఏ నిర్ణయం తీసుకున్నా డీఎస్ వెంటే ఉంటామని మెజార్టీ కార్యకర్తలు, అనుచరులు ప్రకటించారు.

మరోవైపు కొందరు కార్యకర్తులు బీజేపీ మినహా ఏ పార్టీలోకి వెళ్లినా మీ వెంటే ఉంటామని చెప్పారు. దీంతో డీఎస్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని చెప్పారు. త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. మొత్తానికి డీఎస్ కారు దిగడం ఖాయమైపోయింది. మళ్లీ సొంత గూటికి చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి డీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి డీఎస్ కాంగ్రెస్ గూటికి వెళ్తారా..? లేక కమల దళంలో చేరతారా అన్నది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories