తీరం దాటిన టిట్లీ తుపాన్‌

తీరం దాటిన టిట్లీ తుపాన్‌
x
Highlights

టిట్లీ తుపాను తీరం దాటింది. ఈ తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో గోపాలపూర్‌ వద్ద తీరం దాటింది. అతి తీవ్ర తుఫానుగా మారిన టిట్లీ.. ఒడిషాతో పాటు...

టిట్లీ తుపాను తీరం దాటింది. ఈ తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో గోపాలపూర్‌ వద్ద తీరం దాటింది. అతి తీవ్ర తుఫానుగా మారిన టిట్లీ.. ఒడిషాతో పాటు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. ఇది మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ చెబుతోంది. ఒడిశా-ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న టిట్లీ తుపాను మరింత ముందుకు కదిలి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు దిశ మార్చుకుంటోందని వాతావరణశాఖ తెలియచేసింది. తుపాను తీరాన్ని దాటినప్పటికీ వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో గాలులు, వర్ష భీభత్సం కొనసాగుతోంది. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పాటు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సైక్లోన్ ఐ గా పిలిచే తుపాను కేంద్రకం దాదాపు 52 కిలోమీటర్లమేర విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. టిట్లీ తుపాను ప్రభావంతో ఈ సాయంత్రం వరకు ఒడిషాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్‌ కేంద్రం ప్రకటించింది.

తుపాను తీరం దాటిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంపై తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, సోంపేటలో కుండపోత వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటలకు 140 నుంచి 150 ఒక్కోసారి 165 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. గాలుల తాకిడికి శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరా స్తంభించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు కవిటి మండలం కొత్తపాలెం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ 20 నుంచి 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. సంతబొమ్మాళి మండలంలోని డి.మరువాడ ప్రాంతంలో సముంద్రం ముందుకు వచ్చింది. ఇసుక దిబ్బలు కోతకు గురయ్యాయి. హుద్‌హుద్ తర్వాత ఈ స్థాయిలో గాలులు వీయడం ఇప్పుడే చూస్తున్నామని మత్స్యకారులు తెలిపారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం వద్ద సముద్రం 150 అడుగుల ముందుకు వచ్చింది. భీకర శబ్ధంతో అలలు తీరంపై విరుచుకుపడుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కొండ్రాజుపాలెంలో మత్స్యకారుల పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టిట్లీ తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలోనూ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతాలైన పాలకాయితిప్ప, బసవన్నపాలెం, ఊటగుండ తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి.

టిట్లీ తాకిడికి దెబ్బతినే ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి తూర్పునావికా దళం సిద్ధమైంది. ఒడిశాతో పాటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి నష్టం జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన తూర్పు నావికాదళం ముందస్తు ఏర్పాట్లు చేసింది. తుపాను కారణంగా తూర్పు కోస్తా రైల్వే రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సెమ్మెస్‌ల ద్వారా వరద హెచ్చరికల సమాచారం పంపిస్తోంది. సహాయం కోసం 1100 నంబరుకు కాల్ చేయాలని అధికారులు సూచించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి జిల్లా వ్యాప్తంగా హైఅలెర్జ్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.

టిట్లీ తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆర్టీజీఎస్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని చెప్పారు. తుపాను పూర్తిగా బలహీన పడేవరకూ ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. ఈ మధ్యాహ్నం శ్రీకాకుళం వెళ్తున్న సీఎం... దగ్గరుండి సహాయ, పునరావాస చర్యలు పరిశీలించనున్నారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories